విజ్ఞాన గనిలో గండం!

ABN , First Publish Date - 2022-08-19T06:39:13+05:30 IST

మండల కేంద్రం పరవాడలో గల శాఖా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 32 ఏళ్ల క్రితం దీని నిర్మాణం చేపట్టారు. ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించిన ఘన చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయ భవనాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో నేడు ఈ దుస్థితికి చేరింది.

విజ్ఞాన గనిలో గండం!
శిథిల స్థితిలో ఉన్న గ్రంథాలయ భవనం


శిథిలావస్థకు చేరిన పరవాడ శాఖా గ్రంథాలయ భవనం

బీటలు వారిన గోడలు.. పెచ్చులూడి పడుతున్న శ్లాబ్‌

ఆందోళన చెందుతున్న పాఠకులు

పట్టించుకోని అధికారులు

పరవాడ, ఆగస్టు 18: మండల కేంద్రం పరవాడలో గల శాఖా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. సుమారు 32 ఏళ్ల క్రితం దీని నిర్మాణం చేపట్టారు. ఎంతో మందికి విజ్ఞానాన్ని అందించిన ఘన చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయ భవనాన్ని పట్టించుకునేవారు లేకపోవడంతో నేడు ఈ దుస్థితికి చేరింది. గోడలు బీటలు వారాయి. శ్లాబుతో పాటు సన్‌షెడ్‌ పెచ్చులూడి పడుతున్నాయి.  తలుపులు, కిటికీలు దెబ్బతిన్నాయి. ఫలితంగా  గ్రంథాలయానికి వచ్చే పాఠకులు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి గోడలు తడిసి చెమ్మ పట్టాయి. కిటికీలు, తలుపులు చెదలు పట్టి ఊడిపోతున్నాయి.  ప్రధాన ద్వారం తలుపులకు పెద్ద రంధ్రం ఏర్పడడంతో లోపలికి పురుగులు, జెర్రెలు వంటివి ప్రవేశిస్తున్నాయని పాఠకులు వాపోతున్నారు. గతంలో ఈ భవనానికి మరమ్మతు పనులు చేయించినా ఫలితం లేకపోయింది. పనుల్లో నాణ్యత లోపించడం వల్లే  పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందన్న వాదన వినిపిస్తోంది. 

విలువైన పుస్తక నిధి

ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ భాషలకు సంబంధించి సుమారు 6,882 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన దినపత్రికలతో పాటు మరో నాలుగు పత్రికలను పాఠకుల కోసం అందుబాటులో ఉంచారు. వెయ్యి మందికి పైగా చందాదారులు ఉన్నారు. విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, పత్రికలు ఉన్నప్పటికీ భనవం పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా మారింది. ఉన్నతాధి కారులు తక్షణమే స్పందించి భవనానికి మర్మమతులు చేపట్టాలని పాఠకులంతా కోరుతున్నారు.

Updated Date - 2022-08-19T06:39:13+05:30 IST