Sidhu Moose Wala చివరి పాట 'SYL'.. యూట్యూబ్ నుంచి తొలగింపు.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-06-27T02:41:44+05:30 IST

సింగర్, ర్యాపర్, పాటల రచయిత సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) హత్యానంతరం విడుదలైన ‘ఎస్‌వైఎల్’(సట్లెజ్ - యమునా అనుసంధానం) పాటను వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’(YouTube) తొలగించింది.

Sidhu Moose Wala చివరి పాట 'SYL'.. యూట్యూబ్ నుంచి తొలగింపు.. కారణం ఇదే..

న్యూఢిల్లీ : సింగర్, ర్యాపర్, పాటల రచయిత సిద్ధూ మూసేవాలా(Sidhu Moose Wala) హత్యానంతరం విడుదలైన ‘SYL’(సట్లెజ్ - యమునా అనుసంధానం) పాటను వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’(YouTube) తొలగించింది. పంజాబ్ నీళ్ల సమస్య, సట్లెజ్ - యమునా నదుల అనుసంధాన కాలువ ఇతివృత్తంగా ఈ పాట సాగింది. సుధీర్ఘకాలం గడుస్తున్నా సట్లెజ్ - యమునా అనుసంధాన కాలువ విషయంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరని ఈ అంశమే కాకుండా అవిభజిత పంజాబ్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వాక్యాలూ ఈ పాటలో ఉన్నాయి. మరోవైపు రైతు ఆందోళన సమయంలో ఎర్రకోటపై సిక్కు జెండా ఎగరవేత దృశ్యాలను కూడా వీడియోలో వాడారు. దీంతో ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఫిర్యాదులు అందడంతో ఈ కంటెంట్‌ను తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది. ఈ పాట లింక్‌ను క్లిక్ చేయగా ఈ మేరకు సందేశం కనిపిస్తోంది. 


సిద్ధూ మూసే వాలా హత్యకు ముందే ఈ మ్యూజిక్ వీడియోని రూపొందించారు. దీంతో ఈ వీడియోని ప్రొడ్యూసర్ ఎంఎక్స్‌ఆర్‌సీఐ(MXRCI ) జూన్ 23 శుక్రవారం  విడుదల చేశారు. ఎస్‌వైఎల్ పాటను విడుదలైన నాటి నుంచి యూట్యూబ్‌లో 27 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 3.3 మిలియన్ లైక్స్ లభించాయి. కాగా మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో 424 మంది వీఐపీలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం ప్రకటన చేసిన మరునాడే జరిగిన సిద్ధూ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. హత్య సూత్రదారిగా అనుమానిస్తున్న గ్యాంగ్‌లీడర్ లారెన్స్ బిష్ణోయ్‌కి గోల్డీ బ్రార్ సన్నిహితుడని దర్యాప్తులో తేలింది. కాగా అసెంబ్లీ ఎన్నికలకు ముందే గతడాది డిసెంబర్‌లో సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-06-27T02:41:44+05:30 IST