పోలీసులకు బాధితుడి ఫిర్యాదు.. అలాంటిదేమి లేదన్న కులపెద్దలు
కొత్తపల్లి(తూర్పు గోదావరి): స్నేహితుడు ఇంటి స్థలం కొనుగోలు చేసిన వ్యవహారంలో సాక్షి సంతకం చేసినందుకు తమ పెద్దలు కుల బహిష్కరణ చేశారని కొత్తపల్లి మండలం అమీనాబాద్కు చెందిన పందిరి వీరవెంకట్రావు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో తన స్నేహితుడు(దళితుడు) చేనేత కార్మికుల ఇళ్ల సమూహాల మధ్యలో ఇంటి స్థలం కొనుగోలు చేశాడని, దానికి రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షి సంతకం చేశానని వీరవెంకట్రావు చెప్పారు. దీంతో తమ కుల పెద్దలైన చేనేత కుటుంబాలవారు గ్రామంలో కులస్థులెవరూ తనను శుభకార్యాలకు ఆహ్వానించరాదని హుకుం జారీ చేశారని, దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని వీరవెంకట్రావు తెలిపారు. ఈ మేరకు విచారణ చేశామని ఎస్ఐ నబీ చెప్పారు అయితే గ్రామంలో ఎవరూ కుల బహిష్కరణ చేయలేదని పెద్దలు తెలిపారన్నారు. వారి కుటుంబాల మధ్య విభేదాల కారణంగా వెంకటరమణను, వారి బంధువులను కార్యక్రమాలకు ఆహ్వానించలేదని గ్రామస్థులు తెలిపారని ఎస్ఐ చెప్పారు. అయినప్పటికీ కుల పెద్దలతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని ఎస్ఐ తెలిపారు.