ప్రమాదాలకు చెక్‌ పెట్టేలా..!

ABN , First Publish Date - 2021-01-10T12:12:59+05:30 IST

గ్రేటర్‌లోని 959 ప్రాంతాల్లో ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న, చిన్న పనులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవే అయినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ...

ప్రమాదాలకు చెక్‌ పెట్టేలా..!

గ్రేటర్‌లో సైనేజ్‌లు

కసరత్తు ప్రారంభించిన జీహెచ్‌ఎంసీ

959 ప్రాంతాలను గుర్తించిన పోలీసులు


హైదరాబాద్‌ : గ్రేటర్‌లోని 959 ప్రాంతాల్లో ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న, చిన్న పనులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేవే అయినప్పటికీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వాహనదారులకు ప్రాణసంకటంగా మారుతోంది. రోడ్డు పరిస్థితిని సూచించే సైనేజీలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పోలీసుల క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. అతివేగం, అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం గ్రేటర్‌లో ప్రమాదానికి ప్రధాన కారణం. సైనేజీలు, ప్రమాద సూచికా బోర్డులు లేకపోవడమూ ఒక కారణంగా తేల్చారు. ఆ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా దిద్దుబాటు చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుడుతోంది. సైనేజీలు, సూచిక బోర్డుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ.50 లక్షలు అవసరమని అంచనా వేశారు.  


600-800 మిల్లీ మీటర్ల పరిమాణంతో..

ప్రాథమిక పరిశీలన మేరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 868, రాచకొండలో 53, సైబరాబాద్‌ కమిషనర్‌ పరిధిలో 38 ప్రాంతాల్లో సైనేజ్‌లు, సూచిక బోర్డులు లేవు. నెమ్మదిగా వెళ్లండి, ముందు యూటర్న్‌ ఉంది, టీ జంక్షన్‌.. ప్రమాదకరమైన మలుపు ఉంది.. తదితర సమాచారం తెలిపే సైనేజ్‌లు  600, 800 మిల్లీమీటర్ల పరిమాణంతో ఏర్పాటు చేయనున్నారు. బస్‌బేలు, ఇరుకు రోడ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులను సూచించేలా సైనేజీలు ఏర్పాటు చేయనున్నారు.


సైనేజీలు ఇవి.. 

టీ జంక్షన్‌ 

 గో స్లో 

యూ టర్న్‌ అహెడ్‌ 100 మీటర్లు 

వై జంక్షన్‌ అహెడ్‌ గో స్లో..

యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియా

బ్లైండ్‌ కర్వ్‌ - గో స్లో 

డు నాట్‌ డ్రింక్‌ అండ్‌ డ్రైవ్‌

వన్‌ వే 

నో పార్కింగ్‌ 

నో స్టాండింగ్‌ 

పాదచారుల దారి 

నో యూ టర్న్‌


జోన్‌ సైనేజీలు

చార్మినార్‌ 250

ఖైరతాబాద్‌ 386

కూకట్‌పల్లి 10

సికింద్రాబాద్‌ 222

Updated Date - 2021-01-10T12:12:59+05:30 IST