25 కూడళ్లలో ఏటీసీఎస్‌

ABN , First Publish Date - 2022-08-08T05:39:22+05:30 IST

ప్రస్తుతం నగరంలో పనిచేస్తున్న ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థకు శాశ్వతంగా స్వస్తి చెప్పాలని అనుకుంటున్నారా?

25 కూడళ్లలో ఏటీసీఎస్‌

ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా తొమ్మిది సంస్థలకు ఆహ్వానం

  సమావేశానికి హాజరైన ఆరు కంపెనీలు

 నగరంలో పూర్తయిన సర్వే

 మూడు దశల్లో ఏటీసీఎస్‌ ఏర్పాటు

 రూ.5కోట్లు విడుదల చేసిన వీఎంసీ

  బెంజ్‌సర్కిల్‌ సిగ్నల్స్‌ మార్పు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ)

 ప్రస్తుతం నగరంలో పనిచేస్తున్న ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థకు శాశ్వతంగా స్వస్తి చెప్పాలని అనుకుంటున్నారా? దాని స్థానంలో అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేసే యోచనల్లో అధికారులు ఉన్నారా? ఇందులో భాగంగానే ఇటీవల బెంజ్‌సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను మార్చాలని భావిస్తున్నారా? వీటికి అవుననే సమాధానం వస్తోంది. హైదరాబాద్‌ నరగంలో ఉన్న హెచ్‌ట్రిమ్స్‌ మాదిరిగానే విజయవాడలో ఏటీసీఎస్‌(అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టం)ను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు కమిషనరేట్‌ అధికారులు, వీఎంసీ అధికారులు నిర్ణయించారు. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం మిలియన్‌ ప్లస్‌ నగరాలకు నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా కేంద్రం విడుదల చేసిన నిధుల నుంచి రూ.5కోట్లతో ట్రాఫిక్‌ వ్యవస్థకు కొత్త వెలుగులు తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. నగరంలోని మొత్తం 25 కూడళ్లలో ఏటీసీఎస్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) విధానంలో తొమ్మిది కంపెనీలకు అధికారులు ఆహ్వానాలు పంపారు. అందులో ఆరు కంపెనీల ప్రతినిధులు కొద్దిరోజుల కిత్రం విజయవాడలోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు, కంపెనీల ప్రతినిధులు, వీఎంసీ అధికారులు సమావేశమయ్యారు. 

  పూర్తయిన సర్వే..  

 కొద్దిరోజుల క్రితం పోలీసులు, కంపెనీల ప్రతినిధులు, వీఎంసీ అధికారులు కలిసి నగరం మొత్తం పర్యటించారు. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే జంక్షన్లలో సర్వే చేశారు. మొత్తం మూడు దశల్లో ఏటీసీఎస్‌ పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. మొదటి దశలోనే 25 జంక్షన్లలో ఏటీసీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇన్ని జంక్షన్ల పనులు మొదటి దశలో పూర్తి కావడం కష్టమని అనుమానిస్తున్నారు. పైగా రూ.5కోట్లకు ఈ పనులన్నీ పూర్తవ్వడం కష్టమని భావిస్తున్నారు. ఈ నిధులతో 10-12 కూడళ్లలో మాత్రమే పనులు చేయడం సాధ్యమవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వే నిర్వహించిన 25 కూడళ్లతోపాటు బెంజ్‌సర్కిల్‌లో ఇటీవలే ఏర్పాటు చేసిన సిగ్నల్‌ లైట్లను మార్పు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ సిగ్నల్స్‌ కొత్తవే అయినా మాన్యువల్‌గా నిర్వహించాల్సి వస్తోంది. త్వరలో ఏర్పాటు చేయబోయే సిగ్నల్స్‌ ఆటోమెటిక్‌గా వాటికి అవే మారుతుంటాయి. ఆయా కూడళ్లలో ఉన్న వాహనాల రద్దీని బట్టి సమయాన్ని మార్చుకుంటాయి. వీఐపీలు, వీవీఐపీలు కాన్వాయ్‌లు వెళ్లినప్పుడు పోలీసులతో సంబంధం లేకుండా ఏటీసీఎస్‌ ట్రాఫిక్‌ను ఆపుతుంది. బెంజ్‌సర్కిల్‌ ఏటీసీఎస్‌ ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సిగ్నల్‌ లైట్లను మరో జంక్షన్‌లోకి మార్చే యోచనలో అధికారులు ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏటీసీఎస్‌ సిగ్నల్స్‌ వద్ద సీసీ కెమెరాలు గానీ, థర్మల్‌ పరికరాన్ని గానీ అమర్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయడంతో ఆయా కూడళ్లలో ఉన్న ట్రాఫిక్‌ స్థితిగతులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. థర్మల్‌ పరికరం ఏర్పాటు చేస్తే శాటిలైట్‌ ద్వారా థర్మల్‌ చిత్రాలు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరతాయి. వీఎంసీ, పోలీసు అధికారులు మాత్రం సీసీ కెమెరాల ఏర్పాటుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సమాచారం. 

  ఏటీసీఎస్‌ ఏర్పాటు జంక్షన్లు ఇవే..

 బెంజ్‌సర్కిల్‌, నిర్మలా జంక్షన్‌, రమేష్‌ ఆసుపత్రి జంక్షన్‌,  మహానాడు జంక్షన్‌, రామవరప్పాడు జంక్షన్‌, పీసీఆర్‌ జంక్షన్‌, పీసీఆర్‌ వై జంక్షన్‌, డీసీపీ బంగ్లా, రాఘవయ్య పార్కు, రామలింగేశ్వరనగర్‌ కట్ట, ఆంజనేయ స్వామి ఆలయం, ఎనికేపాడు 100 అడుగులు, గొల్లపూడి వన్‌ సెంటర్‌, గొల్లపూడి వై జంక్షన్‌, సితార జంక్షన్‌, చిట్టినగర్‌, పుష్ప హోటల్‌, స్వర్ణప్యాలెస్‌, దీప్తి సెంటర్‌, విద్యాధరపురం జంక్షన్‌, పైపులరోడ్డు జంక్షన్‌, సిద్ధార్థ ఆడిటోరియం జంక్షన్‌. 


Updated Date - 2022-08-08T05:39:22+05:30 IST