ఇవేం పన్నులు దేవుడా.. బాదుడే బాదుడు..!

ABN , First Publish Date - 2021-12-03T06:41:24+05:30 IST

పన్నుల ఆదాయం పెంచుకోవడానికి రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికీ ఆస్తి పన్ను, నీటి పన్ను, వినోదపు పన్ను, ప్రకటన పన్ను, ఖాళీ స్థలాల పన్ను, మార్కెట్‌ సెస్‌ తదితర పేర్లతో రూ.కోట్ల ఆదాయం గడిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవేం పన్నులు దేవుడా.. బాదుడే బాదుడు..!

  • సైన్‌ బోర్డుకు పన్ను
  • షాపులకు పేర్లు రాస్తే పన్ను బాదుడే
  • వాటికి లైటింగ్‌ పెడితే మరింత  వడ్డింపు
  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో 30 శాతం పెరిగిన ప్రకటన పన్ను
  • తిరగబడిన చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌
  • ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహంతో తాత్కాలికంగా ఆపిన వైనం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి) : పన్నుల ఆదాయం పెంచుకోవడానికి రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికీ ఆస్తి పన్ను, నీటి పన్ను, వినోదపు పన్ను, ప్రకటన పన్ను, ఖాళీ స్థలాల పన్ను, మార్కెట్‌ సెస్‌ తదితర పేర్లతో రూ.కోట్ల ఆదాయం గడిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అధికారులు షాపుల ముం దు రాసుకున్న పేర్లకు కూడా రూ.వేలాది పన్ను విధించడం వివాదాస్పదమైంది. ఎప్పుడో 2017లో కౌన్సిల్‌ ఆమోదం పొందిందని చెబుతూ ఇవాళ సిటీ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆధ్వర్యంలో ఈ పన్నుల వసూళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం వరకూ నోటీసులు జారీ చేసినట్టు టౌన్‌ప్లానింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల దేవీచౌక్‌లో ఒక షాపునకు రూ.6 వేలు  పన్ను విధిస్తూ నోటీసు ఇవ్వడంతో తన షాపు పేరు రాసుకుంటే పన్ను ఎందుకు కట్టాలని సదరు షాపు యజమాని గట్టిగా ప్రశ్నించడం గమనార్హం. ఇలా చాలా షాపులకు పైన రాసిన బోర్డులన్నీ ప్రకటనల కిందకు వస్తాయని చెబుతూ నోటీసులు ఇవ్వ డంతో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తిరగబడింది.


అందరూ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో రాజానగరం ఎమ్మె ల్యే జక్కంపూడి రాజా కొద్దిరోజుల కిందట మున్సిపల్‌ ఆఫీసుకు వచ్చి టౌన్‌ప్లానింగ్‌ అధికారులపై ఆగ్రహం  వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో కమిషనర్‌ అభిషిక్త్‌కిశోర్‌ ఈ పన్ను వసూళ్లను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చాంబర్‌ నాయకులు చెబున్నారు. కానీ టౌన్‌ప్లానింగ్‌ అధి కారులు మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత తాము వసూలు చేయకతప్పదని, 2017లో కౌన్సి ల్‌ తీర్మానం చేసిందని, అధికారులుగా తాము అమలు చేయవలసి ఉందని చెబుతున్నారు.


దుకాణం పేరు కూడా ప్రకటనే..

షాపు ముందుభాగాన రాసిన షాపు పేరు కూడా ప్రకటన కిందకే వస్తుందని అధికారులు తేల్చారు. దీనిపై సిటీలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేమ్‌బోర్డ్‌ పెట్టినా పన్ను వేస్తున్నారని,  అపార్ట్‌మెంట్ల వద్ద ఫ్లాట్ల యజమానుల పేర్లు రాసే బోర్డులకు కూడా పన్నులు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు ప్రైవేట్‌ స్థలంలో ఉన్నా, మున్సిపల్‌ రోడ్ల మార్జిన్ల లో ఉన్నా పన్నులు వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో బోర్డ్‌కు లైటింగ్‌ పెడితే ఒక రేటు, లైటింగ్‌ లేకపోతే మరో రేటు కూడా నిర్ణయించారు. ఈనేపథ్యంలో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వ్యాపారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎడ్వ ర్టైమెంట్‌ బోర్డులకు పన్నులు వసూలు చేసేవారు. వినోదపు పన్ను కూడా ఉండేది. ఇవాళ షాపుల మీద రాసుకున్న పేర్లకు, షాపుల ముందు పెట్టిన బోర్డులకు కూడా పన్నులు వసూలు చేయడం దారుణమని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.


వివిధ రకాల పన్నులు ఇలా..

గతంలో వసూలు చేసే ప్రకటనల పన్నులకు 30 శాతం పెంచి వసూలు చేస్తున్నారు. దీపాల వెలుగులో అలంకరించిన ప్రకటనలు, నేల మీద, బిల్డింగ్‌ల మీద, గోడల మీద బోర్డులు, తడికలు, ఫ్రేములు, గోడలకు అతికించు పటాల మొదలైనవాటికి చదరపు మీటరకు రూ.600 వంతున 2.50 మీటర్ల వరకూ 1000 రూపాయల పన్ను విధించారు. ఎద్దులు, గుర్రాలు, ఇతర జంతువులు లాగే వాహనాలు మనుషులు, సైకిళ్లు ట్రామ్‌కార్‌, ఇతర వాహనాలపై మోసే లైటింగ్‌ లేని ప్రకటన 5 చ.మీటరు వరకూ రూ.4 వేలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇంకా సినిమా థియేటర్లను చూపే ప్రకటలు, వీధులకు అడ్డంగా పెట్టే ప్రకటనలు, వేలం ప్రకటన, అమ్మకం, కౌలుదారు ప్రకటనలు, విద్యుత్‌ స్తంభం మీద పెట్టే ప్రకటనలు, బ్యానర్లు, ఫ్లెక్స్‌లకు పన్నులు విధిస్తున్నారు. బస్‌షెల్టర్లపై పెట్టే ప్రకటనలు ధరలు  రూ.9 వేల నుంచి  30 వేల వరకూ ఉన్నాయి. ఇలా బోర్డుల సైజును బట్టి పన్ను విధిస్తూ నోటీసులు ఇచ్చారు. కొందరు కంగారు పడి కట్టేయగా, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రశ్నించడంతో కొంతమంది వ్యాపారులు కట్టడం మానేశారు. 

Updated Date - 2021-12-03T06:41:24+05:30 IST