మందు వరుసలో!

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. గ్రామాల్లో ఎక్కడికక్కడే లభ్యమైంది. కొందరు ముందస్తుగానే మద్యం నిల్వ చేసుకున్నారు. ఎన్నికలకు వినియోగించుకున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు.

మందు వరుసలో!
ఎచ్చెర్ల బాట్లింగ్‌ యూనిట్‌ మద్యం సరఫరా





 శ్రీకాకుళం సర్కిల్‌లోనే అధికం

 ఫిబ్రవరి మూడు వారాల్లో రూ.79.32 కోట్ల విక్రయాలు

   (శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

-మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి.  పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నాటి నుంచి అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. సాధారణ రోజుల కంటే 50 శాతం అధికంగా అమ్మకాలు పెరిగాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకూ ఏకంగా రూ.79 కోట్ల 32 లక్షల మద్యం విక్రయాలు జరిగాయి. రోజువారీ అమ్మకాల్లో శ్రీకాకుళం సర్కిల్‌ ముందు వరుసలో ఉంది. 21 రోజుల్లో రూ.16 కోట్ల 58 లక్షలు విక్రయాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు సారాతో పాటు ఒడిశా మద్యం కూడా ఎన్నికల్లో చలామణి అయ్యింది. సరిహద్దు మండలాలకు చెందిన నేతలు ముందస్తుగానే ఒడిశా మద్యం తెప్పించుకున్నారు. ఎన్నికల ప్రకటన నాటి నుంచి చెక్‌పోస్టుల్లో పెద్దఎత్తున ఒడిశా మద్యం పట్టుబడడం దీనిని తేటతెల్లం చేస్తోంది. 


పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారింది. గ్రామాల్లో ఎక్కడికక్కడే లభ్యమైంది. కొందరు ముందస్తుగానే మద్యం నిల్వ చేసుకున్నారు. ఎన్నికలకు వినియోగించుకున్నారు. జిల్లాలో నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మందుబాబులకు పండగే..పండగ. ఎన్నికలు కొనసాగిన రోజుల్లో పుష్కలంగా మందు లభ్యమయ్యేది. ఏ రోజుకారోజు టోకెన్లు అందించి మద్యం సరఫరా చేశారు. దీంతో అమ్మకాలు సాధారణ రోజుల కంటే భారీగా పెరిగాయి. బీర్ల కేసులు గణనీయంగా అమ్ముడయ్యాయి. జిల్లాలో ఆమదాలవలస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, నరసన్నపేట, పాలకొండ, పలాస, పాతపట్నం, పొందూరు, రాజాం, రణస్థలం, సోంపేట, శ్రీకాకుళం, టెక్కలి ఎక్సైజ్‌ సర్కిళ్లు ఉన్నాయి. ఇతర సర్కిళ్లతో పోల్చితే శ్రీకాకుళం లో రెట్టింపు విక్రయాలు జరిగాయి. అన్నింటికీ ప్రధాన కేంద్రం కావడం... ఎన్నికల శిబిరాలు.. ఇతర రాజకీయాలు.. ఇతరత్రా అంశాలకు శ్రీకాకుళమే వేదికయ్యింది.


 14 సర్కిళ్లలో ఇలా...

-శ్రీకాకుళం సర్కిల్‌ ఏకంగా రూ.16 కోట్ల 58 లక్షల 54 వేల 204 విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. 

-ఆ తర్వాత వరుసలో రాజాం నిలిచింది. ఇక్కడ రూ.9 కోట్ల 60 లక్షల 63వేల 767 మద్యం విక్రయాలు జరిగాయి.

- నరసన్నపేటలో రూ.6.94 కోట్ల మద్యం విక్రయించారు.

- పలాసలో రూ.6 కోట్ల 44 లక్షల 90 వేల 488 మద్యం అమ్ముడైంది.  

-పాలకొండ సర్కిల్‌లో రూ.5 కోట్ల 36 లక్షల 99వేల 574 మద్యం విక్రయించారు. 

- ఆమదాలవలసలో రూ.5 కోట్ల 22 లక్షల 79 వేల 804 విక్రయాలు జరిగాయి. -కొత్తూరులో రూ.1.24 కోట్లు, పాతపట్నం సర్కిల్‌లో రూ.1.25కోట్ల విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


కేసులూ అధికమే..

పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి కేసులు కూడా అధికంగా నమోదయ్యాయి. ఒడిశా మద్యంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి సారా రవాణా చేస్తున్న వారు పెద్దఎత్తున పట్టుబడ్డారు. సాధారణ పోలీసుల తనిఖీల్లో సైతం మద్యం పట్టుబడింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సైతం సారా తయారీదారులపై ఉక్కుపాదం మోపింది. పెద్దఎత్తున సారా బట్టీలను, ఊటలను ధ్వంసం చేసింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన ఫిబ్రవరి 21 నాటికి జిల్లాలో 216 కేసులు నమోదయ్యాయి. 11 మందిని అరెస్ట్‌ చేశారు. ఏకంగా 5,708 లీటర్ల అక్రమ మద్యాన్ని(ఐడీ లిక్కర్‌)ని సీజ్‌ చేశారు. అలాగే నాటుసారా తయారీ కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో నిల్వచేసిన 54,370 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వ్యాన్‌లు, జీపులు, కార్లు, బైక్‌లు.. మొత్తం 36 వాహనాలు సీజ్‌ చేశారు. ఒడిశా మద్యం 350 లీటర్లను సీజ్‌ చేశారు. సారా 688 లీటర్లు ధ్వంసం చేశారు. ఎన్నికల నేపథ్యంలో బెల్టు దుకాణాలు, సారా విక్రయదారులు, తయారీదారులను గుర్తించి...  ఏకంగా 1264 మందిని బైండోవర్‌ చేశారు. 





Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST