ltrScrptTheme3

‘మోడల్‌’ కాప్‌

Oct 17 2021 @ 00:17AM

ఆమె ఒక్కతే... కానీ ఎన్నో రూపాలు. రింగ్‌లోకి దిగితే పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించే బాక్సర్‌. ఖాకీ ధరిస్తే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌. ర్యాంప్‌ మీదకు వస్తే వయ్యారాలు ఒలికించే మోడల్‌. ‘మహీంద్రా గ్రూప్‌’ అధినేత ఆనంద్‌ మహీంద్రా మాటల్లో చెప్పాలంటే...

 

‘వండర్‌ ఉమన్‌’. ఎవరామె? 

ఎక్షా హంగ్మా సుబ్బా... 21 ఏళ్ల ఈ సిక్కిమ్‌ యువతి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక పక్కన కెరీర్‌ను నిర్మించుకొంటూనే... మరోపక్క అభిరుచిని ఆస్వాదిస్తోంది. సిక్కిమ్‌లోని రుంబక్‌ గ్రామంలో పుట్టిన ఎక్షా చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నది. ఇంటి పరిస్థితులు సహకరించకపోయినా... ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా... ఆ కలల వెంటే పరుగెత్తింది. అనుకోకుండా ఒక రోజు ‘ఎంటీవీ సూపర్‌మోడల్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ రియాల్టీ షో చూసింది. ఇక అక్కడి నుంచి ఆ షోలో పాల్గొనాలనే కోరిక ఆమెలో బలపడింది. అదే సమయంలో బాక్సింగ్‌తోనూ ప్రేమలో పడింది. 


‘పంచ్‌’ అదిరింది... 

‘‘మా ఇంటికి దగ్గర్లో బాక్సింగ్‌ కోచింగ్‌ సెంటర్‌ ఉంది. చిన్న వయసు కదా... ఆ పంచ్‌లు అవీ నాకు బాగా నచ్చాయి. నా ఆసక్తిని మా నాన్న గమనించారు. వెంటనే నన్ను తీసుకువెళ్లి శిక్షణలో చేర్పించారు. బాక్సింగ్‌ వల్ల మంచి ఫిట్‌నెస్‌ వస్తుందనేది నాన్న ఆలోచన’’ అంటూ చెప్పుకొచ్చింది ఎక్షా. అయితే ఆ తరువాత బాక్సింగ్‌ ఆమె ప్రపంచం అయిపోయింది. కేవలం ఫిట్‌నెస్‌ కోసమే కాకుండా... అందులో లక్ష్యాలు నిర్దేశించుకుంది. విరామం లేకుండా శ్రమించింది. కొద్ది కాలంలోనే తన రాష్ట్రం తరుఫున పోటీపడింది. జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. 


ఇంటి భారం... 

అందరిలా కాలేజీ రోజులు ఆస్వాదించే అవకాశం లభించలేదు ఎక్షాకు. తండ్రి సంపాదనతో ఇల్లు గడవడం కష్టమైపోయింది. సంతానంలో పెద్ద తనే. దాంతో డిగ్రీ చదువుతున్న వయసులోనే కుటుంబ భారం ఆమె నెత్తిన పడింది. ‘‘నాన్న తరువాత ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సింది నేనే కదా! నేను ఏదైనా ఉద్యోగంలో చేరితే కానీ మా కడుపు నిండని పరిస్థితి. అదే సమయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖలో ఖాళీలు ఉన్నట్టు తెలిసింది. దరఖాస్తు చేసుకున్నాను. పట్టుదలగా ప్రయత్నించి ఉద్యోగం సాధించాను. పధ్నాలుగు నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరాను’’... గతాన్ని గుర్తు చేసుకుంది ఈ సూపర్‌ ఉమన్‌. 


కలలను ఛేదిస్తూ... 

పోలీస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టినా సూపర్‌మోడల్‌ కావాలన్న తన చిన్న నాటి కలను కలగానే మిగల్చదలుచుకోలేదు ఎక్షా. దాన్ని నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో సూపర్‌మోడల్‌ ఆడిషన్స్‌ కోసం ముంబయి వెళ్లింది. అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఆమెకు హిందీ, ఇంగ్లిష్‌ రావు. అదే పెద్ద సమస్యగా మారింది. ఆ మహానగరంలో ఎవరిని సంప్రతించాలన్నా, ఎక్కడికి పోవాలన్నా భాష తెలియక ఇబ్బందులు ఎదురయ్యాయి. గ్లామర్‌ ప్రపంచంతో అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా ఆమెకు పరిచయం లేదు. కానీ నిరాశతో ఇంటి ముఖం పట్టలేదు. ఆత్మవిశ్వాసంతో, సాధించాలన్న తపనతో వాటన్నిటినీ అధిగమించి ఆడిషన్స్‌లో పాల్గొంది. ఎన్నో వ్యయప్రయాసల తరువాత షోకి ఎంపికైంది. ఇన్నేళ్ల తన కలను నిజం చేసుకుంది. ఒక మహిళ తలుచుకొంటే అసాధ్యమంటూ ఏదీ లేదని నిరూపించింది. 


శిక్షణ పనికొచ్చింది... 

‘‘సూపర్‌మోడల్‌’ షోకి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. పోలీస్‌ అకాడమీలో తీసుకున్న శిక్షణ ఇక్కడ బాగా ఉపయోగపడింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యం, ఒత్తిడులను జయించగలిగే ఆత్మస్థైర్యం, త్వరగా నేర్చుకోగలిగే నైపుణ్యం... ఇవే నన్ను లక్ష్యం దిశగా నడిపించాయి’’ అంటున్న ఎక్షా, షోలో ఎందరో హృదయాలు గెలిచింది. ప్రస్తుతం టాప్‌ 4 కంటెస్టెంట్స్‌లో ఒకరిగానిలిచి, అంతిమ సమరానికి సిద్ధమౌతోంది. షోకి న్యాయనిర్ణేతగా వచ్చిన బాలీవుడ్‌ నటి మలైకా అరోరా అయితే ఎక్షా ప్రతిభకు నిలబడి చప్పట్లు కొట్టింది. ‘ఒక మహిళ... భిన్న నైపుణ్యాలతో దేశం గర్వించే స్థాయికి ఎదిగిందం’టూ సలాం కొట్టింది. ‘మహీంద్రా గ్రూప్‌’ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ఇటీవల ట్విట్టర్‌లో ‘వండర్‌ ఉమన్‌’ అంటూ కీర్తించడం లక్ష్యం పట్ల ఆమె అంకితభావానికి నిదర్శనం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.