లీజు ముసుగు... అక్రమాల లొసుగు!

ABN , First Publish Date - 2020-08-09T10:35:14+05:30 IST

పాలకుల అండదండలు ఉండాలే కానీ అక్రమార్కుల ఆగడాలను ప్రశ్నించేవారే ఉండరు.

లీజు ముసుగు... అక్రమాల లొసుగు!

 సిక్కోలు పర్యాటక శాఖ ఆస్తులపై రాబంధుల కన్ను

లీజుకు తీసుకున్న హోటల్‌ సెల్లారులో ఫంక్షన్‌హాలు

అక్రమ నిర్మాణం వెనుక విశాఖ మంత్రి దన్ను

చోద్యం చూస్తున్న అధికారులు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): పాలకుల అండదండలు ఉండాలే కానీ అక్రమార్కుల ఆగడాలను ప్రశ్నించేవారే ఉండరు. దీనికి శ్రీకాకుళంలో పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న బడ్జెట్‌ హోటల్‌ గ‘లీజు’ వ్యవహారమే నిదర్శనం. విశాఖకు చెందిన ఒక మంత్రి అండదండలతో లీజు పొందిన అధికార పార్టీ నాయకులు వరుసగా అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో అక్రమంగా ఫంక్షన్‌ హాలు నిర్మించారు. ఇప్పుడు ఏకంగా పర్యాటక శాఖ హోటల్‌ సెల్లారులో అనుమతులు లేకుండానే మరో ఫంక్షన్‌హాలు నిర్మాణ పనులు కానిచ్చేస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


పర్యాటక శాఖ ఆస్తులపై అక్రమార్కుల కన్ను పడింది. ఓ హోటల్‌ లీజు ముసుగులో.. అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. శ్రీకాకుళం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఖాజీపేట పంచాయతీ పరిధిలో ఎకరాన్నర విస్తీర్ణంలో పర్యాటక శాఖకు చెందిన బడ్జెట్‌ హోటల్‌ ఉంది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ హోటల్‌ నిర్వహణ పర్యాటక శాఖకు భారంగా మారింది. దీనిని 2017లో టీడీపీ హయాంలో ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. అప్పట్లో విశాఖపట్నానికి చెందిన కొందరు టెండరులో హోటల్‌ను దక్కించుకున్నారు. హోటల్‌తో పాటు పది విడిది గదుల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఆ వ్యక్తులు ఏడాదికి పర్యాటక శాఖకు రూ.58 లక్షలు చెల్లించేందుకు ఐదేళ్లకు లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా, ఇదే అదునుగా లీజుదారులు హోటల్‌కు ఆనుకొని ఉన్న పర్యాటక శాఖకు చెందిన ఖాళీ స్థలంపై కన్నేశారు. అప్పట్లో ఎటువంటి అనుమతులు లేకపోయినా లీజుదారులు బరితెగించి ఖాళీ స్థలంలో ఒక ఫంక్షన్‌ హాలు నిర్మించేశారు.


ప్రస్తుతం ప్రభుత్వం మారింది. కానీ లీజుదారులు మారలేదు. మళ్లీ ఇప్పుడు లీజుదారులు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా లీజుకు తీసుకున్న బడ్జెట్‌ హోటల్‌ కింద భాగంలో సెల్లారులో మరో ఫంక్షన్‌ హాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కనీసం పంచాయతీ అనుమతులు కూడా లేవు. ఫంక్షన్‌ హాలు నిర్వహణకు పర్యాటక శాఖ ఉన్నతాధికారి ఒకరు అనుమతి ఇచ్చారనే నెపంతో కొత్తగా సెల్లారులో అక్రమ నిర్మాణం కానిచ్చేస్తుండడం నేతల బరితెగింపునకు అద్దం పడుతోంది.  


గలీజు వెనుక విశాఖ మంత్రి....

కొత్తగా సెల్లారులో అనుమతులు లేకుండా ఫంక్షన్‌ హాలు నిర్మిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరంతా విశాఖకు చెందిన అధికార పార్టీకి చెందిన  ఒక మంత్రి అనుచరులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాజీపేట పంచాయతీ అధికారులు.. అక్రమ నిర్మాణంపై హోటల్‌ నిర్వాహకులకు కనీసం నోటీసు కూడా ఇచ్చేందుకు సాహసించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 


ప్రతిపక్షంలో పోరాడిన నేత ఎక్కడ...

గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌ హోటల్‌ లీజుదారులు హోటల్‌కు పక్కన ఖాళీ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే మరో ఫంక్షన్‌హాలు నిర్మించారు. దీనిపై అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ స్థానిక పెద్దల సహకారం ఉండడంతో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పర్యాటక శాఖ అధీనంలో ఉన్న ఖాళీ స్థలంలో లీజుదారులు ఫంక్షన్‌హాలు ఎలా నిర్మిస్తారంటూ దాన్ని తక్షణమే కూల్చేయాలని 2017లో మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఒకరు.. తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిర్మాణం ఆపేయాలని డిమాండ్‌ చేశారు. అప్పట్లో విశాఖలో టీడీపీకి చెందిన ఎంపీ తెరవెనుక ఉండడంతో అక్రమ నిర్మాణంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే హోటల్‌ సెల్లారులో అక్రమంగా మరో ఫంక్షన్‌హాలు నిర్మిస్తున్నా, అధికార పార్టీలో ఉన్న ఆ నేత కూడా నోరు మెదపడం లేదు. దీనికి కారణం అక్రమ నిర్మాణం వెనుక విశాఖకు చెందిన మంత్రి దన్ను ఉండడమేనని స్పష్టమవుతోంది.


వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గత ప్రభుత్వ  హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతిలో ప్రజాసదన్‌ లాంటి కట్టడాలను సైతం కూల్చేశారు. కానీ శ్రీకాకుళంలో పర్యాటక శాఖ హోటల్‌ స్థలంలో ఫంక్షన్‌హాలు నిర్మాణం మీద మాత్రం నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మళ్లీ అదే హోటల్‌లో సెల్లారులో అడ్డగోలు నిర్మాణం జరిగిపోతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఎండీ అనుమతితోనే..నారాయణరావు, జిల్లా మేనేజరు, పర్యాటకశాఖ, శ్రీకాకుళం 

బడ్జెట్‌ హోటల్‌ లీజుదారులు సెల్లారులో ఫంక్షన్‌ హాలు నిర్మాణానికి పర్యాటక శాఖ ఎండీ నుంచి అనుమతులు ఉన్నాయి. సెల్లారులో ఎలా అనుమతి ఇచ్చారో నాకు తెలియదు. కొత్తగా లీజుదారునికి ఇచ్చిన అనుమతి ప్రకారం నెలకు పర్యాటక శాఖకు లీజుదారుడు రూ.2లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సెల్లారులో ఫంక్షన్‌ హాలు పనులకు లీజుదారుడే ఖర్చు చేస్తున్నారు. 

Updated Date - 2020-08-09T10:35:14+05:30 IST