నామ్‌ రోడ్డులో అసంపూర్తి పనులపై కామ్‌!

ABN , First Publish Date - 2022-01-22T05:27:36+05:30 IST

నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల (నామ్‌) రోడ్డులో అసంపూర్తిగా ఉన్న పనులు చేపట్టే విషయంలో అధికారుల్లో చలనం కరువైంది.

నామ్‌ రోడ్డులో అసంపూర్తి పనులపై కామ్‌!
నిర్మాణం చేయకుండా వదిలివేసిన రోడ్డు

పట్టించుకోని అధికారులు 

రైతులకు, బాధితులకు అందని పరిహారం

గోపాలపురం వద్ద తరచూ ప్రమాదాలు

అద్దంకి, జనవరి 21 : నార్కెట్‌పల్లి-అద్దంకి-మేదరమెట్ల (నామ్‌)  రోడ్డులో అసంపూర్తిగా ఉన్న పనులు చేపట్టే విషయంలో అధికారుల్లో చలనం కరువైంది. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. రైతులకు, బాధితులకు పరిహారం అందకపోడమే ప్రధాన అడ్డంకిగా మారింది. టోల్‌గేట్‌లు ప్రారంభించి వాహనదారుల వద్ద ట్యాక్స్‌ వసూలు మొదలుపెట్టి సుమారు ఏడెనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా అసంపూర్తి పనులపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 సంవత్సరంలో నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి నుంచి ప్రకాశం జిల్లా  అద్దంకి మీదుగా మేదరమెట్ల వరకు సుమారు 210 కి.మీ దూరం నామ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఐదేళ్లలో పనులు పూర్తి చేశారు. మూడుచోట్ల ఏడెనిమిది సంవత్సరాలుగా టోల్‌గేట్‌లు ఏర్పాటు చేసి వాహనదారుల వద్ద టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. 


మూడు చోట్ల నిలిచిన పనులు 

అద్దంకి మండలం గోపాలపురం, చక్రాయపాలెం, సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద భూసేకరణ చేసి రోడ్డు నిర్మించాల్సి వచ్చింది. అయితే భూసేకరణకు సంబంధించి పరిహారం  చెల్లించకపోవడంతో అప్పట్లో రోడ్డు నిర్మాణాన్ని పలుసార్లు బాధితులు అడ్డుకున్నారు. టోల్‌గేట్‌లు  ఏర్పాటు  కాక ముందు ఒకింత హడావుడి చేసిన అధికారులు, నామ్‌ రోడ్డు నిర్మాణ సంస్థ అనంతరం  విషయాన్ని గాలికి వదిలివేశారు. దీంతో అసంపూర్తి రోడ్డులోనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రధానంగా గోపాలపురం వద్ద అసంపూర్తి రోడ్డులో వాహనాల వేగం తగ్గించేందుకు ఏర్పాటు చేసిన స్పీడు బ్రేకర్లను వాహన చోదకులు గుర్తించకుండా ప్రయాణిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోచోట సుమారు 100 మీటర్ల దూరం అసలు రోడ్డు నిర్మించలేదు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి ఒకే రోడ్డు నుంచి రెండు వైపులా వాహనాల రాకపోకలు సాగించేలా ఏర్పాటు చేశారు. చక్రాయపాలెం వద్ద ప్రతిపాదిత సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకపోవటంతో గ్రామస్థులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఏల్చూరులో కూడా సుమారు 200  మీటర్ల దూరం రోడ్డు నిర్మాణం వదిలివేశారు. దీంతో ఆ ప్రాంతంలో రోడ్డుపై తరచూ గోతులు ఏర్పడుతూ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనచోదకులు, కొత్తగా ప్రయాణించే వారు రోడ్డు అసంపూర్తిగా ఉండటం గమనించక ప్రమాదాలకు  గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు  స్పందించి రైతులు, బాధితులకు పరిహారం  చెల్లించి అసంపూర్తిగా ఉన్న నామ్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.




Updated Date - 2022-01-22T05:27:36+05:30 IST