చరిత్ర పుటల్లోకి సిల్వర్‌ జూబ్లీ

ABN , First Publish Date - 2021-10-30T05:23:16+05:30 IST

ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కాలేజీ పేరు కనుమరుగు అయ్యేలా కనిపిస్తోంది.

చరిత్ర పుటల్లోకి సిల్వర్‌ జూబ్లీ

  1. క్లస్టర్‌ వర్సిటీగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థ
  2. 50 ఎకరాల స్థలం, రూ.88.5 కోట్లు కేటాయింపు
  3. పేరు మారుతుండటంతో పూర్వ విద్యార్థుల ఆవేదన
  4. 2023 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు 


కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 29: ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్‌ జూబ్లీ కాలేజీ పేరు కనుమరుగు అయ్యేలా కనిపిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటైన కళాశాల కావడంతో అప్పటి తరం విద్యార్థులు ఈ పరిణామం పట్ల ఆవేదన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యూనివర్సిటీలను ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా ఏడు కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందులో టెక్నాలజీ, పరిశ్రమలు, వృత్తి నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా నూతన కోర్సులు ప్రవేశపెడుతున్నామని కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ ప్రక్రియలో సిల్వర్‌ జూబ్లీ కళాశాల, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఫర్‌ మెన్‌ డిగ్రీ కళాశాలతో కలిపి ఒక క్లస్టర్‌ యూనివర్సిటీగా ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది క్రితం క్లస్టర్‌ యూనివర్సిటీ పరిధి మొదలైంది. 2023 నుంచి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు సాగుతున్నాయి. 


సిల్వర్‌ జూబ్లీ స్థానంలో క్లస్టర్‌


దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సిల్వర్‌ జూబ్లీ కళాశాలకు కేంద్రం ప్రభుత్వం క్లస్టర్‌ యూనివర్సిటీ గుర్తింపును ఇచ్చింది. దేశంలో కొత్తగా ఏర్పాటైన మూడు యూనివర్సిటీల్లో ఇది ఒకటి కావడం విశేషం. 2020 జనవరి 3న యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాల, ఫర్‌ మెన్‌ డిగ్రీ కళాశాల, సిల్వర్‌ జూబ్లీ కళాశాలలను కలిపి ఒక క్లస్‌ యూనివర్సిటీగా ప్రకటించి, 2021న మార్చి 21న ఉపకులపతిని, రిజిస్ట్రార్‌ను నియమించారు. ఇంకా సిబ్బంది నియామకం జరగలేదు. కళాశాల ప్రిన్సిపాల్‌ చాంబర్‌లోనే ఉపకులపతి, రిజిస్ట్రార్‌కు గదులు కేటాయించారు. 


జగన్నాథ గట్టుకు..


క్లస్టర్‌ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన సిల్వర్‌ జూబ్లీ కళాశాల నగర శివారులోని జగన్నాథగట్టుపైకి తరలిపోతోంది. క్లస్టర్‌ యూనివర్సిటికీ భూములను కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్‌ గురువారం తీర్మానం చేసింది. 50 ఎకరాల స్థలాన్ని, రూ.88.5 కోట్ల నిధులను కేటాయించింది. భవన నిర్మాణాలకు సర్వేలు పూర్తయ్యాయి. శంకుస్థాపనకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.


ఏర్పడింది ఇలా..


దేశానికి స్వాతంత్య్రం వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1972లో జరిగిన వేడుకల్లో నాటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావును అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాష్ట్రానికి గుర్తుగా ఏదైనా కోరమని అవకాశం ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాఽథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా  ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని పీవీ కోరారు. స్పందించిన ప్రధాని ఇందిరా గాంధీ సిల్వర్‌ జూబ్లీ కళాశాల పేరిట కర్నూలులో విద్యాసంస్థను ఏర్పాటు చేయించారు. ఈ విద్యాసంస్థలో ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించి, అరుదైన గుర్తింపు ఇచ్చారు. సిల్వర్‌ జూబ్లీలో చదివినవారిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ సహా ఎన్నో కీలక ఉద్యోగాలు, ఉన్నత పదవులు పొందారు. తాము చదివిన విద్యాలయం పేరు ఇక చరిత్రలో భాగమవుతుందని తెలిసి ఆవేదన చెందుతున్నారు. 


13న పూర్వ విద్యార్థుల సమావేశం


హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నవంబరు 13న పూర్వ విద్యార్థులు సమావేశం కాబోతున్నారు. దేశ, విదేశాల్లోని పూర్వ విద్యార్థులకు సంఘం అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, కార్యదర్శి జీవన్‌, సభ్యులు నాగభూషణం, ఐలయ్య ఆహ్వానాలు పంపారు. తాము చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలిచేందుకు కారణమైన కళాశాల భవితవ్యం గురించి చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో వారు సమావేశం కాబోతున్నారని తెలిసింది. 


2023 నుంచి కొత్త కోర్సులు.. 


క్లస్టర్‌ యూనివర్సిటీలో 2023 నుంచి కొత్తగా ఏడు కోర్సులను ప్రారంభించనున్నాం. ప్రభుత్వం నిధులు, స్థలం కేటాయించింది. భవన నిర్మాణాలు కూడా త్వరలో ప్రారంభం అవుతాయి. క్లస్టర్‌ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 


- ప్రొఫెసర్‌ బీఆర్‌ సాయిగోపాల్‌, ఉపకులపతి

Updated Date - 2021-10-30T05:23:16+05:30 IST