పాపన్నది కులస్థిరీకరణ అధికారం కాదే!

ABN , First Publish Date - 2022-08-18T11:51:51+05:30 IST

సర్దార్ సర్వాయి పాపన్న పూర్వపు వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలం, ఖిలాషాపూర్‌ గ్రామంలో ధర్మన్నదొర సర్వమ్మలకు ఆగస్టు 18, 1650లో జన్మించాడు....

పాపన్నది కులస్థిరీకరణ అధికారం కాదే!

సర్దార్ సర్వాయి పాపన్న పూర్వపు వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలం, ఖిలాషాపూర్‌ గ్రామంలో ధర్మన్నదొర సర్వమ్మలకు ఆగస్టు 18, 1650లో జన్మించాడు. తాటి, ఈత చెట్లకు కల్లు గీయడం వారి వృత్తి. తాబేదారులు, జమీన్‌దారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే, పాపన్నకు వారసత్వ నాయకత్వం కాని, ధనం కాని, అధికారం కాని లేవు. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యంతో మొగల్ సైన్యంపై దాడి చేసి, ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని, 1675లో తన రాజ్యాన్ని స్థాపించాడు. 1678 వరకు ఆ గెరిల్లా సైన్యంతో దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌, హుజూరాబాద్‌ వరకు విస్తరించింది.


ఇండియా చరిత్రలో ఎస్సి, ఎస్టి, బీసీ, మైనార్టీ, పేదవర్గాలను ఐక్యం చేసి పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని 17వ శతాబ్దంలోనే నిరూపించాడు సర్వాయి పాపన్న. ఆనాడు పాపన్న పోరాట నేపథ్యాన్ని పరిశీలిస్తే ఏకకాలంలో అయిదు అంచెల పోరాట అంశాలు బోధపడతాయి: 


1) బ్రాహ్మణీయ భావజాల కులవ్యవస్థ వ్యతిరేకత. 2) వలసవాద సామ్రాజ్యవాద వ్యతిరేకత. 3) ఆధిపత్యకుల భూస్వామ్య వ్యతిరేకత. 4) సమానత్వం. 5) పీడితకుల దళిత బహుజన రాజ్యాధికారం.


పాపన్న బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వలేదు, గుడులు కట్టించలేదు. ఇది సారాంశంలో బ్రాహ్మణీయ కులవ్యవస్థ వ్యతిరేక భావజాలమే. అందుకే బ్రాహ్మణ సమాజం పాపన్న చరిత్రను తొక్కి పెట్టింది. పాపన్న దళిత బహుజన కళాకారులను ఆదరించాడు కనుక జానపదులు పాపన్న జీవితాన్ని కళా రూపాల ద్వారా నిక్షిప్తం చేశారు. ముదిరాజులు, యాదవులు, పద్మశాలీలు, మున్నూరు కాపు, వైశ్యులు, కమ్మరి, కుమ్మరి, మేదరి, చాకలి, ఎరుకల, యానాది, కోయ, లంబాడీ ఇతర సామాజిక వర్గాలతో ఐక్యత సాధించి సర్వాయి పాపన్న సైన్యాన్ని స్థాపించాడు. పీడితులు కలిసిమెలసి ఉండాలనే సంకల్పంతో ముస్లిం మతానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు.


పాపన్న వీరోచిత పోరాట పటిమ, తెగువను, ఆచరించిన బ్రాహ్మణీయ కుల వ్యవస్థ వ్యతిరేక చైతనాన్ని అన్ని కులాల (బహుజనులు) ప్రజలు మననం చేసుకోవల్సిన అవసరం ఉంది. కులవ్యవస్థ స్థిరీకరణను కీర్తించే కుల సంఘాల కార్యాచరణ అగ్రకులాధికారాన్ని సుస్థిరం చేయడానికే గానీ, కుల నిర్మూలన కొరకు కాదని గ్రహించాలి. అందని రాజకీయాధికారాన్నే రాజ్యాధికారంగా భ్రమింప చేస్తూ, పాలకుల దగ్గర మోకరిల్లే ఈ దళారీ వ్యవస్థ ప్రజలను మోసగిస్తున్నది. పాలకులు ఇచ్చే సబ్సీడీలు, రాయితీలు, గొర్లు, బర్లు, చెప్పులు వంటివి కుల స్థిరీకరణకు కారణమవుతూంటే, దానినే కీర్తించే దుస్థితి ఇప్పుడు నెలకొని ఉంది.


సమగ్ర సామాజిక న్యాయానికి బదులు రాజకీయ రంగంలో తమ కులానికి న్యాయం చేయమనో, తమ కులాన్ని బీసీల్లో గాని, ఎస్సీల్లోగాని, ఎస్టీల్లో గాని చేర్చమనో శంఖరావాలను, సమ్మేళనాలను ఆయా పాలకవర్గాల పార్టీల్లో ఉన్న బడుగువర్గ దళారీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. ఆయా కుల సంఘాల భేరీలలో బడుగులకు రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఉద్యమించాలని పిలుపునిస్తూ, ఉద్యమ ఫలితాల్ని వారే అనుభవిస్తున్నారు. కుల ఉద్యమాలు అంటేనే కుల స్థిరీకరణగా నేడు వర్ధిల్లుతున్న అంశాలను పరిధిలోకి తీసుకొని ప్రత్యామ్నాయ కుల వర్గ నిర్మూలన ప్రతిపాదికతో ఆచరణను మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉంది. కుల వర్గ వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా గల పోరాట శక్తులు ఏ దిశనుండి ఏ దశకు ప్రయాణించాలో మార్గనిర్దేశం చేసుకోవడానికి గత ఉద్యమాల విశ్లేషణలు, అనుభవాలను అధ్యయనం చేసుకోవాలి. దళితులు, మూలవాసీలు, బీసీలు, మైనార్టీలు, స్త్రీలు కుల నిర్మూలనా లక్ష్యంతో తాత్కలికంగా విడివిడిగా పోరాడినా, దీర్ఘకాలికంగా భూమి, రాజ్యాధికార సాధనే కేంద్రంగా సంఘటితమై సామాజిక విప్లవ రాజకీయోద్యమంలో పాల్గొనాలి. విప్లవ పోరాటవాదులకు ‘ఐక్యత–ఐక్యసంఘటన’ ఎలా అవసరమో, కులవర్గ పోరాట అవగాహన కలిగిన వారి మధ్యలోనూ అంతే ఐక్యత అవసరం. అదే, పాపన్నను స్మరించుకోవడం, ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగించడం.

పాపని నాగరాజు

Updated Date - 2022-08-18T11:51:51+05:30 IST