అక్కడ...ప్రతి రోజూ పండగే!

ABN , First Publish Date - 2020-02-03T19:55:19+05:30 IST

చుట్టూ సముద్రం! జస్ట్‌ 719.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం!! నగరమా అంటే.. నగరం. దేశమా అంటే.. దేశం!! ఆ నగర దేశాన్ని ప్రపంచమంతా ముద్దుగా...

అక్కడ...ప్రతి రోజూ పండగే!

చుట్టూ సముద్రం! జస్ట్‌ 719.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం!! నగరమా అంటే.. నగరం. దేశమా అంటే.. దేశం!! ఆ నగర దేశాన్ని ప్రపంచమంతా ముద్దుగా పిలుచుకునే పేరు... సింగపూర్‌.


ట్రాఫిక్‌ క్రమశిక్షణ, రహదారులు, విద్యలో నాణ్యత... ఇలా దేని గురించి చెప్పాలన్నా పాశ్చాత్య దేశాలతో పోల్చుకోవడం మనకు అలవాటు. కానీ మన ఆసియా ఖండంలోనే పాశ్చాత్య దేశాలకు దీటుగా ఉండే ఏకైక దేశం సింగపూర్‌. పర్యాటక రంగం ఆ దేశ ఆదాయానికి ఆయువుపట్టు. విదేశీయులూ మెచ్చి వచ్చే చోటు సింగపూర్‌. కానీ, చూసినవే ఎవరైనా ఎన్నిసార్లు చూస్తారు? అందుకే పర్యాటకులను ఆకర్షించేలా చైనీయుల నూతన సంవత్సరం చైనా టౌన్‌లో, భారతీయుల దీపావళి వేడుకలు లిటిల్‌ ఇండియాలో, లెబనన్ల కొత్త సంవత్సర వేడుకలు వారుండే ప్రాంతాల్లో... ఇలా నిత్యం ఏదో ఒక కొత్త ఈవెంట్‌ జరుగుతూనే ఉంటుంది. అందుకే చాలా మంది పర్యాటకులు ‘సింగపూర్‌లో ప్రతిరోజూ పండగే’ అంటారు. అక్కడి పర్యాటక ఆకర్షణల్లో మచ్చుకు కొన్ని..

 

నైట్‌ సఫారీ

 సింగపూర్‌కే ప్రత్యేకం ‘నాక్టర్నల్‌ జూ’. అంటే రాత్రిపూట కూడా తెరచి ఉండే జంతువుల ప్రదర్శన శాల. ప్రపంచంలోనే తొలి నాక్టర్నల్‌ జూ ఇది. దాదాపు 86 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ జూలో రాత్రిపూట వేటాడే జీవులను చూడొచ్చు. ‘నైట్‌ సఫారీ’ పేరుతో 1994 మే 26 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. 100 జాతులకు చెందిన 900 జంతువులు ఇందులో ఉంటాయి. వాటిలో 41 శాతం అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నవే. రైల్‌ కోచ్‌లాంటి వాహనంలో కూర్చొని,. చిమ్మచీకట్లో నెమ్మదిగా వెళ్తూ ఆ జంతువులను చూడొచ్చు.

 

రెయిన్‌ ఫారెస్ట్‌ లూమినా

నైట్‌ సఫారీ పక్కనే ఉండే మరో ఆకర్షణ.. రెయిన్‌ఫారె్‌స్ట లూమినా. ఇది కూడా రాత్రిపూట సందర్శించేదే. పేరుకు ఫారెస్టే కానీ, ఇందులో నిజమైన జంతువులు రెండో మూడో ఉంటాయి. మిగతావన్నీ వర్చువల్‌ జంతువులే! పేరుకు తగినట్టుగా ఎక్కడ చూసినా కళ్లు చెదిరే అద్భుతమైన విద్యుద్దీపాల కాంతులు మనల్ని అబ్బురపరుస్తుంటాయి. ఒకచోట పెద్ద పెద్ద మైకులు ఉంటాయి. వాటిలో మనం ఎంత గట్టిగా అరిస్తే అన్ని వర్చువల్‌ జంతువులు కనిపించి ఆటలాడుతాయి. మరొకచోట వరుసగా బండరాళ్లు పరిచి ఉంటాయి. వాటి మీద మనం ఎంత గట్టిగా ఎగిరితే అన్ని వర్చువల్‌ జంతువులు ప్రత్యక్షమై అలరిస్తాయి.

 

రిసార్ట్‌ వరల్డ్‌ సెంటోసా

 సింగపూర్‌ దక్షిణ తీరంలో ఉండే సెంటోసా దీవి ఆనందాల అద్భుతం. ‘రిసార్ట్‌ వరల్డ్‌ సెంటోసా’ పేరుతో అక్కడ ఏర్పాటైన రిసార్ట్‌ను పూర్తిగా చూడాలంటే కనీసం వారం రోజులైనా పడుతుంది. సింగపూర్‌లో ఉండే రెండు క్యాసినోల్లో ఒకటి అక్కడే ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అక్వేరియంను అక్కడి ఎస్‌.ఇ.ఎ.(సౌత్‌ ఈస్ట్‌ ఆసియా)లో చూడొచ్చు. అది ఎంత పెద్ద అక్వేరియం అంటే దానిలో 1.8 కోట్ల లీటర్ల నీళ్లు పడతాయి! 800 జాతులకు చెందిన 50 వేల సముద్ర జీవాలు ఆ ఆక్వేరియంలో ఉంటాయి. రోజూ మధ్యాహ్నం పూట ఇద్దరు డైవర్లు ఆ అక్వేరియంలోకి దిగి చేపలకు ఆహారం పెట్టే దృశ్యాలను చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఇక, మేడమ్‌ టుస్సాడ్స్‌ మైనపు బొమ్మల మ్యూజియంలో మన బాలీవుడ్‌ స్టార్ల బొమ్మలే హైలైట్‌! మారిటైమ్‌ మ్యూజియం, రాయల్‌ ఆల్బట్రాస్‌ పడవలో విహారం, ట్రిక్‌ ఐ మ్యూజియం, స్కై డైవింగ్‌, స్కైల్యూజ్‌... ఇలా చాలా ఆకర్షణలే ఉంటాయక్కడ. రిసార్ట్‌ వరల్డ్‌ సెంటోసా ఎంత పెద్దదో అర్థమయ్యేలా చెప్పాలంటే దాని కారు పార్కింగ్‌ వైశాల్యం గురించి తెలుసుకుంటే చాలు. ఆ కార్‌పార్కింగ్‌ ప్రదేశం ఎంత పెద్దదో తెలుసా? అక్కడ 45 వేల కార్లను పార్కింగ్‌ చేయవచ్చు. ఇది బహుళ అంతస్తుల పార్కింగ్‌.\

 

చైనా టౌన్‌

 సింగపూర్‌ వెళ్లినవారంతా ఎక్కువగా, తప్పనిసరిగా వెళ్లే ప్రదేశాల్లో చైనా టౌన్‌ ఒకటి. అత్యంత ఆకర్షణీయంగా ఉండడంతోపాటు చాలామంది పర్యాటకులు సావనీర్లు, గిఫ్టులు కొనుక్కోవడానికి ఇదే అత్యంత అనువైన చోటు కావడం ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే సింగపూర్‌ మాల్స్‌లో ఏదైనా కొనాలంటే భారీగా ఖర్చవుతుంది. కానీ, చైనా టౌన్‌ మన హైదరాబాద్‌లోని అబిడ్స్‌, కోఠి ప్రాంతం లాంటిది. ఇక్కడ పది డాలర్లకు (దాదాపు రూ.550) మూడు వస్తువుల బేరం నడుస్తుంటుంది. ఇంకా బేరమాడినా కూడా కొందరు తగ్గించే అవకాశం ఉంది. గృహాలంకరణ వస్తువులకైతే కొదవ ఉండదు.

 

లిటిల్‌ ఇండియా

 ఇది భారతీయులు ఎక్కువగా ఉండే ప్రదేశం. భారతీయులు అంటే.. ఎక్కువ మంది తమిళులే! ఈ ప్రాంతంలో ఉండే ముస్తఫా షాపింగ్‌మాల్‌లోని సూపర్‌మార్కెట్‌కు వెళ్తే మనం ఏ చెన్నైలోనో ఉన్నామనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. లిటిల్‌ ఇండియా ప్రాంతంలో పెద్ద ‘తలైవా’ (రజనీకాంత్‌) పెయింటింగ్‌ ప్రత్యేక ఆకర్షణ.

 

చాంగీ జ్యువెల్‌

సింగపూర్‌ పర్యాటకానికే మణిమకుటం- చాంగీ జ్యూవెల్‌ ఎయిర్‌పోర్టు. సింగపూర్‌ ఎయిర్‌పోర్టులో నాలుగు టెర్మినల్స్‌ ఉంటాయి. వాటిలో తాజా నిర్మాణం చాంగీ జ్యూవెల్‌ టెర్మినల్‌. మానవ నిర్మిత జలపాతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది ఇక్కడే ఉంది. 40 మీటర్ల ఎత్తు నుంచి పల్చటి కాగితంలా కిందికి జాలువారే జలపాతం (దీన్ని ‘రెయిన్‌ వర్టెక్స్‌’గా పిలుస్తారు).. ఆ నీటిని టర్బైన్ల ద్వారా తిప్పి పైకి పంపుతారు. అక్కడే విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఒక్క జ్యూవెల్‌ టెర్మినల్‌ను చూడ్డానికే ఒకరోజు మొత్తం సరిపోదు. 2013 నుంచి వరుసగా ఏడేళ్లుగా ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో చాంగీ జ్యూవెల్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. మరో విశేషమేమిటంటే... ఇంత పెద్ద నిర్మాణాన్నీ ఎక్కడా పిల్లర్లు లేకుండా డోమ్‌లాగా నిర్మించారు. సింగపూర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ‘మెరీనా బే శాండ్స్‌’ హోటల్‌కు ప్లాన్‌ గీసిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ మోషే సఫ్ది దీనికి కూడా రూపాన్ని ఇచ్చారు.

 

                                                                               -కేబీఎల్‌

మరిన్ని వివరాలకు: 

https://www.stb.gov.sg/

https://www.visitsingapore.com/en/


Updated Date - 2020-02-03T19:55:19+05:30 IST