Singapore Telugu Society: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2022

ABN , First Publish Date - 2022-08-02T18:48:21+05:30 IST

సింగపూర్‌లోని అవర్ టాంపనీస్ హబ్‌లో సింగపూర్ తెలుగు సమాజం (STS) బ్యాడ్మింటన్ (Badminton) పోటీలను నిర్వహించింది.

Singapore Telugu Society: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2022

సింగపూర్ సిటీ: సింగపూర్‌లోని అవర్ టాంపనీస్ హబ్‌లో సింగపూర్ తెలుగు సమాజం (STS) బ్యాడ్మింటన్ (Badminton) పోటీలను నిర్వహించింది. సింగపూర్ తెలుగు సమాజం నిర్వహించే సాంస్కృతిక, సామాజిక, భాష సంబంధిత ఈవెంట్‌లతో పాటు వార్షిక ఈవెంట్‌లలో భాగంగా సమగ్రత, ఐక్యతను ప్రోత్సహించడానికి క్రీడలకు సంబంధించిన ఈవెంట్‌లను (బ్యాడ్మింటన్, బౌలింగ్ & క్రికెట్) కూడా నిర్వహిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లపాటు వీటికి ఊహించని విరామం వచ్చింది. దీంతో ఎస్‌టీఎస్ సభ్యుల కోసం జూలై 30, 31 తేదీలలో టాంపైన్స్ హబ్‌లో ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (Badminton championship)ను నిర్వహించింది. 


అక్కడి 8 కోర్టులలో రెండు రోజులలో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచులు జరిగాయి. ఈ టోర్నీలో 250 మందికి పైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు.  వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది చిన్నారులు ఉన్నారు. ఈ రెండు రోజుల టోర్నీలో వివిధ విభాగాల్లో 400కు పైగా మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సంవత్సరం 50 మంది ఔత్సాహిక క్రీడాకారులకు ప్రముఖ శిక్షకులతో బ్యాడ్మింటన్ (Badminton) శిక్షణా తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు మన శక్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని తెలిపారు. వినోదానికి సాధనంగా నిలుస్తాయన్నారు. అలానే పోటీల్లో పాల్గొన్న తెలుగువారి క్రీడా నైపుణ్యాన్ని కూడా కొనియాడారు. పోటీల అనంతరం విజేతలకు స్పాన్సర్ల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీల్లో తెలుగు వారు ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కార్యక్రమ నిర్వాహకులు మల్లికార్జున్ పాలెపు, శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన స్పాన్సర్‌లు, వాలంటీర్లు, కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి STS కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు.



Updated Date - 2022-08-02T18:48:21+05:30 IST