గనులపై మొదలైన ‘గుర్తింపు’ లొల్లి

ABN , First Publish Date - 2021-09-19T04:05:16+05:30 IST

సింగరేణిలో గుర్తింపు పోరుకు రంగం సిద్ధమవుతోంది. రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో కార్మిక సంఘాలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ కారణాలతో కార్మిక సంఘాల నేతలు గనుల వద్ద కార్మికులను కలిసి మాట్లాడుతున్నారు. ఈ సారి పోరు ఆసక్తికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గనులపై మొదలైన ‘గుర్తింపు’ లొల్లి
సింగరేణి కార్మికులు

సింగరేణిలో సమరానికి సై అంటున్న కార్మిక సంఘాలు

రానున్న రెండు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం

బాయిబాట పడుతున్న నాయకులు

కార్మికుల్లో మొదలైన ఎన్నికల సందడి

నస్పూర్‌, సెప్టెంబర్‌ 18 : సింగరేణిలో గుర్తింపు పోరుకు రంగం సిద్ధమవుతోంది. రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో కార్మిక సంఘాలు  ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ కారణాలతో కార్మిక సంఘాల నేతలు గనుల వద్ద కార్మికులను కలిసి మాట్లాడుతున్నారు.  ఈ సారి పోరు ఆసక్తికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగరేణిలో టీబీజీకేఎస్‌, ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ, బీఎంఎస్‌, సీఐటీయు, హెచ్‌ఎంఎస్‌, ఐఎఫ్‌టీయు తదితర కార్మిక సంఘాలున్నాయి. శ్రీరాంపూర్‌ డివిజన్‌లో దాదాపు 9800 మంది కార్మిక ఓటర్లున్నారు. 2017 అక్టోబర్‌ 5న సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) మరో మారు గుర్తింపు సంఘం హోదాను దక్కించుకోవాలనే వ్యూహాంతో సాధించిన హక్కులను కార్మికులకు వివరిస్తూ నేతలు అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమం ద్వారా బాయి బాట పడుతున్నారు. ఈ సారి ఏలాగైనా సింగరేణిలో పాగ వేయాలన్న లక్ష్యంతో ఏఐటీయుసీ, అదే విధంగా బీఎంఎస్‌, సీఐటీయు, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టీయుసీ కార్మిక సంఘాలు పోటాపోటీగా ఇప్పటికే గనుల వద్ద గేట్‌ మీటింగ్‌లు, సమావేశాలు, ధర్నాలు, బాయి బాట కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం చెందిందని ఆరోపిస్తున్నాయి.  అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్‌ కార్మికుల హక్కులను, సమస్యలను పరిష్కారం చేసే సత్తా మాకే ఉందంటూ, పరిష్కారం చేసినా సమస్యలను, హక్కులను కార్మికులకు వివరిస్తోంది.  కార్మిక సమస్యల పరిష్కారం, హక్కులను కాపాడడంలో గుర్తింపు సంఘం విఫలమైందని ఏఐటీయుసీ, ఐఎన్‌టీయుసీ, బీఎంఎస్‌, సీఐటీయు, హెచ్‌ఎంఎస్‌లు విమర్శలను గుప్పిస్తున్నాయి.  నిన్నమొన్నటి వరకు స్తబ్దంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు ఒక్కసారిగా తమతమ వ్యూహాలను రూపొందించి గనులపై కార్మికుల ప్రసన్నం కొరకు ప్రయత్నాలు ప్రారంభించాయి.  ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తింపు సంఘం నేతలు ప్రకటించగా, తాము కూడా సిద్ధమేనని మిగిలిన సంఘాల నేతలు గనులపై కార్మికులను  కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరికి గుర్తింపు సంఘం హోదాను కల్పిస్తారో వేచి చూడాలి.   

Updated Date - 2021-09-19T04:05:16+05:30 IST