- శాపంగా మారిన సింగరేణి భూ సేకరణ

ABN , First Publish Date - 2022-06-27T06:37:47+05:30 IST

ఒకప్పుడు పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల్‌ గ్రామ పురస్కార్‌ అవార్డు అందుకున్న గ్రామం..

- శాపంగా మారిన సింగరేణి భూ సేకరణ
అభివృద్ధికి దూరంగా బుధవారంపేట్‌

 - శాపంగా మారిన సింగరేణి భూ సేకరణ 

- ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోయిన రైతులు

 రామగిరి, జూన్‌ 26: ఒకప్పుడు పలు గ్రామాలకు ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా నిర్మల్‌ గ్రామ పురస్కార్‌ అవార్డు అందుకున్న గ్రామం.. చుట్టూ పచ్చని పంట పొలాలు, ఎటు చూసినా ప్రకృతి అందాలు పాడిపంటలతో అలరారిన బుధవారంపేట్‌ నేడు అభివృద్ధికి ఆమడదూరంగా నిలిచింది. సింగరేణి యాజమాన్యం గనుల విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ ఆదర్శ గ్రామానికి శాపంగా మారింది. 

సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిఽధిలోని ఓసీపీ-2 ప్రాజెక్టు విస్తరణ పనుల కోసం రామగిరి మండలంలోని బుధవారంపేట్‌ గ్రామంలో 17 సంవత్సరాల క్రితమే భూసేకరణ చర్యలు ప్రారంభించారు. గ్రామంలోని సుమారు 200 వందల మందికి చెందిన 708.16 ఎకరాల భూసేకరణకు డీఎన్‌డీడీ (డేట్‌ఆఫ్‌ నోటిఫికేషన్‌, డేట్‌ఆఫ్‌ డిక్లరేషన్‌) గెజిట్‌ను కూడా పాస్‌ చేశారు. దీని రెండేళ్ల కాలపరిమితి ముగిసినా అధికారులు  భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయలేదు. దీన్ని మరో సంవత్సరం పొడిగించి రైతుల నుంచి ఎలాంటి సంతకాలు లేకుండా అవార్డుపాస్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 708.16 ఎకరాల్లో, ఎకరాకు 1.75 లక్షలుగా నిర్ణయించడంతో పాటు అన్ని పరిహారాల కింద రూ. 4.35 లక్షలను చెల్లించడానికి భూసేకరణ అధికారులు ఖరారు చేశారు. వీటికి సంబంధించిన రూ. 37 కోట్ల పరిహారం సొమ్మును రామగుండం ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిపాజిట్‌ కూడా చేశారు. ఈ క్రమంలో భూసేకరణ చట్టం 2013 ప్రకారం  రైతులు తమ భూములతో పాటు గ్రామాన్ని తీసుకోవాలని ప్రతిపాదనలు చేశారు. గ్రామస్థుల ప్రతిపాదనలకు సింగరేణి ససేమిరా అనడంతో పరిహారం అందుకునేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపలేదు.

- గ్రామపంచాయతీ రికార్డుల సీజ్‌..

ప్రాజెక్టు విస్తరణలో భాగంగా గ్రామాన్ని సైతం సేకరిస్తామని స్పష్టం చేస్తూనే... చేపడుతున్న భూసేకరణ సమయంలో గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవద్దని సింగరేణి యాజమాన్యం అన్ని ప్రభుత్వశాఖలకు లేఖలు పంపింది. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడింది. గ్రామంలో నూతనంగా ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ముందస్తుగా గ్రామపంచాయతీ రికార్డులను సీజ్‌ చేశారు. దీంతో పదిహేడు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోవడం లేదు. 2017 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్యం హక్కులు కలిగిన రైతుల పేర్లను భూరికార్డుల శుద్ధీకరణలో భాగంగా తొలగించి సింగరేణి యాజమాన్యం పేరును రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. సింగరేణి భూసేకరణ స్పష్టత రాకపొవడంతో ఆ భూములను నేటికీ రైతులు సాగు చేసుకుంటున్నారు. కాగా గ్రామానికి సంబంధించిన 708.16 ఎకరాలు శుద్ధీకరణలో భాగంగా సింగరేణి యాజమాన్యపు హక్కును పొందడంతో  ప్రభుత్వం కల్పించే పథకాలకు రైతులు అనర్హులయ్యారు. ప్రభుత్వం కల్పిస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతులకు అందడం లేదు. ప్రతి యేటా రైతులకు పెట్టుబడి సహాయం రూ.70.81 లక్షలను గ్రామా రైతులు కొల్పోతున్నారు. రైతులు చనిపోయిన కుటుంబాలకు రైతు బీమా అందడం లేదు. పాస్‌బుక్కులేని రైతులకు బ్యాంకులు వ్యవసాయ రుణాలు కల్పించడం లేదు.

- అవార్డు క్యాన్సిల్‌కు హైకోర్టులో అప్పీల్‌.. 

బుధవారంపేట్‌ గ్రామంలో భూసేకరణ చేపట్టిన 708.16 ఎకరాల భూమి సేకరణకు సంబంధించిన సింగరేణి అవార్డును క్యాన్సిల్‌ చేయాలని గ్రామస్థులు 2017లో హైకోర్టు అప్పీల్‌ చేశారు. దీనిపై  స్పందించిన హైకోర్టు  కౌంటర్‌ పిటీషన్‌ దాఖలు చేయాలని సింగరేణికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై యాజమాన్యం ఇటీవలే కౌంటర్‌ పిటీషన్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. 

- రైతుబంధు పథకం వర్తింపజేయాలి

 పెండ్రు నారాయణరెడ్డి, రైతు, బుధవారంపేట్‌

రైతులకు సంబంధించిన 708.16 ఎకరాల సంబంధించిన రైతులకు  రైతు బంధు పథకం వర్తింపజేయాలి. భూసేకరణ చేపట్టిన నాటి నుంచి ఎనిమిది దఫాలుగా వచ్చిన రైతుబంధు సహాయాన్ని  రైతులకు సింగరేణి యాజమాన్యం చెల్లించాలి. సింగరేణి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా శుద్ధీకరణ పేరిట మా భూములపై హక్కు కల్పించుకుంది. దీంతో  ప్రభుత్వ పథకాలు అందడంలేదు.

- అవార్డు క్యాన్సిల్‌ చేయండి

 ఆరెల్లి దేవక్క, ఎంపీపీ, రామగిరి

గ్రామ రైతులు ప్రభుత్వ పథకాలకు దూరం అయ్యారు. సింగరేణి దశాబ్దకాలం నాన్చుడు ధోరణి కారణంగా గ్రామానికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. హైకోర్టు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలుకే సింగరేణికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది. సింగరేణి అవార్డు పాసైనప్పటి నుంచి సుమారు 15 మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందగా, రైతు బీమా పఽథకానికి అనర్హులయ్యారు. రైతుబంధు, రైతు బీమా లేని కారణంగా సుమారు 200 వందల మంది రైతులు తీవ్రంగా నష్టపొయారు. దీనిని సింగరేణి యాజమాన్యమే భరించాలి.


Updated Date - 2022-06-27T06:37:47+05:30 IST