గాయకుడు మనోను సత్కరిస్తున్న కందర్ప హనుమాన్
రాయవరం,
మార్చి 26: గాయకుడిగా 11 భాషల్లో ఇప్పటివరకు 25 వేలకు పైగా పాటలు
పాడినట్లు నేపథ్య గాయకుడు నాగూర్‌బాబు (మనో) తెలిపారు. రాయవరం మండలం
కూర్మాపురంలో అన్నవరం ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు కందర్ప హనుమాన్
స్వగృహానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 1984లో తనకు
గాయకుడిగా మురళీమోహన్ జయభేరి పతాకంపై నిర్మించిన కర్పూర దీపంలో పాటలు పాడే
అవకాశం లభించిందన్నారు. 25 వేల ప్రైవేటు సాంగ్స్ పాడినట్లు చెప్పారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు దగ్గర కావడం ఆనందమన్నారు. తెలుగులో
చక్రవర్తి, ఇళయరాజా, రాజ్, కోటి విద్యాసాగర్, రమణీయ భరద్వాజ్ తనను
ప్రోత్సహించారన్నారు. తన సోదరుడుగా భావించే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశయాలకు
అనుగుణంగా పనిచేసేందుకు ఆయన కుమారుడు చరణ్ వెంట తన లాంటి సైనికులు
ఎంతోమంది ఉన్నారన్నారు. మనోను కందర్ప హనుమాన్ సత్కరించి జ్ఞాపికను
అందజేయడంతో పాటు సత్యదేవుడి ప్రసాదం అందజేశారు. గాయకుడు మనో వెంట వైసీపీ
రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాఽథరెడ్డి, సత్తి
వెంకటరెడ్డి, సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ కందర్ప భానుమతి ఉన్నారు.