ప్లాస్మా దానం చేస్తా!

ABN , First Publish Date - 2020-08-08T05:30:00+05:30 IST

ఇంటిపట్టునే ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గాయని స్మితతో పాటు ఆమె భర్తకూ పాజిటివ్‌ వచ్చింది. రెండు వారాలు స్వీయ నిర్భందంలో ఉండేందుకు సిద్ధమైన ఆమె బెంగంతా తమ గారాల కూతురు శివిని విడిచి ఎలా ఉండాలన్నదే...

ప్లాస్మా దానం చేస్తా!

ఇంటిపట్టునే ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా గాయని స్మితతో పాటు ఆమె భర్తకూ పాజిటివ్‌ వచ్చింది. రెండు వారాలు స్వీయ నిర్భందంలో ఉండేందుకు సిద్ధమైన ఆమె బెంగంతా తమ గారాల కూతురు శివిని విడిచి ఎలా ఉండాలన్నదే. ‘కొవిడ్‌-19’ను జయించి ఎప్పుడెప్పుడు కూతురును హత్తుకోవాలా? అని ఎదురుచూస్తున్నారామె. అంతేకాదు ప్లాస్మా దానం చేసి ఆదర్శంగా నిలవాలనుకుంటున్న స్మిత ఇంకా ఏమంటున్నారంటే...


‘‘నా భర్త, నేను గత అయిదు నెలలుగా ఇంటి వద్ద ఉంటూనే పనిచేస్తున్నాం. మన దగ్గర కరోనా మొదలైన మార్చి నెల నుంచి అన్ని రకాల జాగ్త్రతలు తీసుకుంటున్నాం. అయినప్పటికీ మాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒకరోజు నేను ఎక్కువ సేపు వ్యాయామం చేశాను. ఆ రోజంతా విపరీతమైన ఒళ్లు నొప్పులు. అయితే వర్కవుట్‌ ఎక్కువ సమయం చేయడం వల్ల అలా ఉందేమో అనుకున్నా. దానికి తోడు తొందరగా డీహైడ్రేట్‌ అవుతున్నట్టుగా అనిపించేది. అనుమానంతో కరోనా పరీక్ష చేయించున్నా. పాజిటివ్‌ వచ్చింది.  

కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రీషియన్‌ చిన్న పనిమీద మా ఇంటికి వచ్చాడు. అతడికి కరోనా వచ్చిందని మాకు తరువాత తెలిసింది. అతడికి పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే మేము ముగ్గురం కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. నాకు, నా భర్తకు పాజిటివ్‌ వచ్చింది. మా కూతురు శివికి నెగటివ్‌ వచ్చింది. దంపతులిద్దరం రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే మా పాపకు దూరంగా ఉండడం నా వల్ల కాదు. కరోనా వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలనే విషయం తనకు తెలుసు. మాకు దూరంగా ఉండాల్సి రావడాన్ని శివి తట్టుకోలేకపోతోంది. తనని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మా అమ్మ వచ్చి శివిని తనతో పాటు విజయవాడకు తీసుకెళ్లింది.


మానసికంగా సిద్ధమయ్యా...

మేము తొందరగా కోలుకుంటామనే నమ్మకం నాకుంది. అప్పుడు నా కూతురును ఏ భయం లేకుండా కౌగిలించుకుంటాను. ఇప్పుడు మా దృష్టంతా ‘కొవిడ్‌-19’ను జయించడం, పూర్తి ఆరోగ్యంతో బయటపడడం మీదే ఉంది. రెండు వారాలు ఐసొలేషన్‌లో ఉండేందుకు మానసికంగా సిద్ధమవుతున్నా. కరోనా నెగటివ్‌ వచ్చేంత వరకూ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలనుకుంటున్నా. చెక్కుల సంతకాల కోసం మా అసిస్టెంట్లును కూడా రావద్దని చెప్పాను. ఇప్పుడు మేమిద్దరం ధైర్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. తొందరగా కరోనాను జయించాలనే ఆలోచనతో ఉన్నా. కోలుకున్న తరువాత ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా.’’


Updated Date - 2020-08-08T05:30:00+05:30 IST