Yogi Adityanath : యూపీ మదరసాలలో జాతీయ గీతం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-05-13T00:52:41+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని మదరసాలలో జాతీయ గీతాలాపన గురువారం

Yogi Adityanath : యూపీ మదరసాలలో జాతీయ గీతం తప్పనిసరి

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని మదరసాలలో జాతీయ గీతాలాపన గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర మదరసా ఎడ్యుకేషన్ బోర్డు మార్చి 24న తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని మే 9న అన్ని జిల్లాల మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రంజాన్ సెలవుల అనంతరం మదరసాలలో తరగతులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. 


మదరసాలలో తరగతుల ప్రారంభానికి ముందు ప్రార్థన సమయంలో ‘జనగణమన’ (National Anthem)ను ఆలపించాలని బోర్డు రిజిస్ట్రార్ ఎస్ఎన్ పాండే అన్ని జిల్లాల మైనారిటీ (Minority) సంక్షేమ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని మదరసాలలోనూ ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు అన్ని రికగ్నయిజ్‌డ్, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ మదరసాలకు వర్తిస్తాయని తెలిపారు. ఈ ఆదేశాలు అమలయ్యే విధంగా చూసే బాధ్యతను జిల్లా మైనారిటీ సంక్షేమాధికారులకు అప్పగించారు. 


టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దివాన్ సాహబ్ జమన్ ఖాన్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అల్లాను, మహమ్మద్‌ను ఉద్దేశించి ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని మదరసాలలో జాతీయ గీతాన్ని కూడా ఆలపిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు దీనిని తప్పనిసరి చేశారన్నారు. 


ఉత్తర ప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ గత నెలలో మాట్లాడుతూ, మదరసాలలో జాతీయభావాన్ని బోధించాలని నొక్కివక్కాణించారు. మరో మంత్రి డానిష్ ఆజాద్ మాట్లాడుతూ మదరసా విద్యార్థులు పూర్తి స్థాయిలో దేశభక్తులుగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. 


ప్రస్తుతం రాష్ట్రంలో 16,461 మదరసాలు ఉన్నాయి. వీటిలో 560 మదరసాలకు ప్రభుత్వ నిధులు అందుతున్నాయి. 


Read more