నెట్టింట్లో సంచలనం - రసజ్ఞులను అద్భుతంగా అలరించిన సంగీత రాగావధానం

ABN , First Publish Date - 2021-04-19T01:28:43+05:30 IST

ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, ఈ రెమిట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు యీగ జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్

నెట్టింట్లో సంచలనం - రసజ్ఞులను అద్భుతంగా అలరించిన సంగీత రాగావధానం

సింగపూర్: సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై ఆదివారం వినూత్నంగా ఏర్పాటు చేయబడిన, ప్రముఖ సంగీత విద్వాంసులు గరికిపాటి వెంకట ప్రభాకర్ "రాగావధానం" కార్యక్రమం సంగీత ప్రియులను 5 గంటల పాటు అద్భుతంగా అలరించింది. గరికిపాటి వెంకట ప్రభాకర్, పద్మ లలిత దంపతులు జ్యోతి ప్రకాశనం గావించి ప్రారంభించిన ఈ  కార్యక్రమానికి అమెరికా నుంచి డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు, భారతదేశం నుంచి డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకులు జి ఆనంద్, ప్రఖ్యాత గాయని సురేఖ మూర్తి తదితరులు గౌరవ అతిథులుగా విచ్చేసి తమ అభినందనలు తెలియజేశారు.


సాహిత్య అష్టావధాన ప్రక్రియలో వలె సింగపూర్ నుండి విద్యాధరి, శేషుకుమారి, సౌభాగ్యలక్ష్మి, షర్మిల, పద్మావతి, స్నిగ్ధ, అనంత్ అనే ఏడుగురు గాయనీ గాయకులు పృచ్ఛకులుగా వ్యవహరించగా, రాధిక మంగిపూడి ప్రసంగం చేస్తూ సమన్వయకర్తగా వ్యవహరించారు.


పృచ్ఛకులు అడిగిన పాటలకు అప్పటికప్పుడు అవధాని, అడిగిన రాగాన్ని మార్చడం, అడిగిన తాళంలో మార్చి పాడడం, రాగమాలికగా లేక తాళమాలికగా అల్లి పాడడం, పద్యాలలోని స్వరాక్షరాలను ఆయా స్వర స్థానాలలోనే పాడడం, పృచ్ఛకులు నిషేధించిన స్వరాలను వర్జించి రాగాలను పాడడం వంటి చక్కటి రాగ తాళ రస విన్యాసాలతో ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను ఈ కార్యక్రమం కట్టిపడేసింది. అమెరికా, హాంగ్ కాంగ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నార్వే మొదలగు దేశాల నుండి ప్రపంచ వ్యాప్తంగా వివిధ తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. 


కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "జీవి ప్రభాకర్ కార్యక్రమానికి సంపూర్ణ న్యాయం చేకూర్చారు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా ఎంతో హుందాగా ఆయా రాగాలను తాళాలను గూర్చి వివరిస్తూ అందరికీ తెలిసిన పాటలను ఉదాహరించి పాడుతూ సంగీత జ్ఞానం లేనివారిని కూడా అలరించే విధంగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కార్యక్రమం ఆసాంతం వినోదాత్మకంగాను విజ్ఞానదాయకంగాను కూడా కొనసాగింది. ఐదు గంటల్లో దాదాపు 2500 మంది పైగా ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షించారు" అని తెలియజేశారు.


మొదటి రెండు ఆవృతాలలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలతోపాటు సినిమా పాటలు, జానపదాలు, లలిత సంగీతం, దేశభక్తి గీతాలు, పద్యాలు మొదలైన వైవిధ్యభరితమైన అంశాలలో పాటలను ఎంచుకుని పృచ్ఛకులందరూ వేరువేరు రాగ తాళాలలో ప్రశ్నలు కురిపించారు. మూడవ ఆవృతంలో రాగ వ్యూహం మరియు తాళ వ్యూహం అనే ప్రక్రియతో అవధాని పాడుతున్న  ఒకే పాటకు అందరూ అప్పటికప్పుడు ఒక్కసారిగా వివిధ రాగాలలో తాళాలలో పాడమని ప్రశ్నలు సంధించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అతిథిగా విచ్చేసిన సురేఖ మూర్తి అప్పటికప్పుడు ఒక కొత్త పాటను ఇచ్చి చంద్రకౌంసు రాగంలో స్వర పరచమని అడుగగా అవధాని వెంటనే ఆ పాటను ఆ రాగంలో స్వరకల్పన చేసి వినిపించారు.


జీవి ప్రభాకర్ మాట్లాడుతూ "ఈ కార్యక్రమం చేయగలగడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎన్నో విలక్షణమైన ప్రశ్నలకు తాను తృప్తికరంగా సమాధానాలు ఇవ్వగలిగాను. పలికి 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' వారికి, అతిథులకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమానికి రాధాకృష్ణ గణేశ్న సాంకేతిక సహకారం అందించగా, ఈ రెమిట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు యీగ జ్యూస్ వారు ఆర్థిక సహాయం అందించారు. అమెరికాలోని యూఎస్ టెలివిజన్ వన్ ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈక్షణం, సింగపూర్ తెలుగు టీవి వారు మీడియా పార్టనర్‌గా సహకారం అందించారు.



Updated Date - 2021-04-19T01:28:43+05:30 IST