ఒకే ఒక్క ఇల్లు...

ABN , First Publish Date - 2022-05-29T17:42:39+05:30 IST

‘వైట్‌ హౌస్‌’.. అమెరికా అధ్యక్షుడి నివాసం కాదు.. ఐస్‌లాండ్‌లోని ఎల్లియోయి ద్వీపంలోని ఓ ఇంటి పేరు అది. వందల ఎకరాల ద్వీపంలో ఒకే ఒక

ఒకే ఒక్క ఇల్లు...

ఇల్లు అంటే మనుషులు.. మమతలు... ఇరుగు పొరుగు.. వీధులు... మార్కెట్లు... ఊరు... అబ్బో అదో పెద్ద సందడి. కానీ, ఏకాకిలా ఒకే ఒక ఇల్లు ఉన్న ఓ పెద్ద దీవి గురించి తెలుసా? ఐస్‌లాండ్‌ లోని ఎల్లియోయి ద్వీపంలో ఉంది.. ప్రపంచంలో అత్యంత ఏకాంత ఆవాసం ఇదే!. అయితే ఆ ఇంట్లోకి అడుగుపెట్టాలంటే ఎంతో సాహసం చేయాలి...

‘వైట్‌ హౌస్‌’.. అమెరికా అధ్యక్షుడి నివాసం కాదు.. ఐస్‌లాండ్‌లోని ఎల్లియోయి ద్వీపంలోని ఓ ఇంటి పేరు అది. వందల ఎకరాల ద్వీపంలో ఒకే ఒక ఇల్లు. చుట్టూ నీళ్లు. చూడటానికి వింతగా అనిపిస్తుంది. అసలు అలాంటి ఏకాంత ప్రదేశంలో ఆ ఇంటిని ఎవరుకట్టారు? ఎందుకు కట్టారు? తెలీదు. ఇప్పటికీ అదొక పెద్ద మిస్టరీనే. ఆ వైట్‌హౌస్‌ గురించి ఐస్‌లాండ్‌ వాసులు కథలు కథలుగా చెబుతారు.


 ప్రపంచాన్నంతా జాంబీలు చుట్టుముడతారని ఓ బిలియనీర్‌ ఆ దీవిలో ఏకాంత నివాసం కట్టుకున్నాడట.

 ఓ రుషి ఘోర తపస్సుకు అనువుగా అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడట.

  అది ఇల్లు కాదు, ఫొటోషాప్‌ చేసి ఆన్‌లైన్‌లో ఫొటోలు పెట్టారని అనే వాళ్లూ లేకపోలేదు.


అసలు సంగతి? 

ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో వెస్ట్‌ మ్యాన్‌ ద్వీప సమూహాల్లో మూడో పెద్ద ద్వీపం ఎల్లియోయి. ఒకప్పుడు ఇక్కడ చేపలు పట్టే కొన్ని కుటుంబాలు నివసించేవి. అయితే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. ఆఖరికి అయిదు కుటుంబాలు మిగిలాయి. వాళ్లు కూడా 1930లో ఈ దీవిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అలా వందేళ్లుగా అక్కడ ఎవరూ నివసించడం లేదు. మరి ఆ ఇల్లు ఎవరిది? 


ధృవ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ ద్వీపంలో ఎలాంటి వృక్షసంపద, పశు సంపద లేదు. కాకపోతే పఫిన్స్‌ అనే పక్షులు మాత్రం సముద్ర చేపల కోసం ఈ దీవికి వస్తుంటాయి. ఆ పక్షుల కోసం వేటగాళ్లు ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. ఎల్లియోయి హంటింగ్‌ అసోసియేషన్‌ కూడా ఏర్పడింది. 1953లో వేటగాళ్లు తాత్కాలిక ఆవాసం కోసం వైట్‌ హౌస్‌ను నిర్మించారు. ఇదో విడిది కేంద్రం. వేటగాళ్లు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అయితే లాడ్జింగ్‌ సకల సౌకర్యాలు ఉంటాయనుకోవద్దు. ఇటీవల ఇక్కడికి ‘హంటింగ్‌ ట్రిప్‌’లతో పాటు, టూరిస్టు ట్రిప్‌లు కూడా ఊపందుకున్నాయి. సముద్ర ప్రయాణం, ద్వీప విహారం, కనుచూపు మేరా కమనీయ దృశ్యాలను ఆస్వాదించాలనుకునే వారు ఇక్కడికి క్యూ కడుతున్నారట. అందుకే టికెట్లు కూడా లక్షల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. 

Updated Date - 2022-05-29T17:42:39+05:30 IST