నేను.. ఏ బడికి పోవాలి సారూ..!

ABN , First Publish Date - 2022-07-05T07:13:49+05:30 IST

బడి గంట మోగే వేళ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తొలుస్తున్న ప్రశ్న ఇది. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. తొలిరోజునే ఏ బడికి పోవాలనే సందిగ్ధత విద్యార్థులను వెన్నాడుతోంది.

నేను.. ఏ బడికి పోవాలి సారూ..!
ప్రైవేటు పాఠశాలలకు ఉత్సాహంగా విద్యార్థులు

యాప్‌లోనే పాఠశాలల విలీనం

బడిలో చేర్చుకోడానికి ఉత్తర్వులు ఏవీ? 

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం 

ప్రైవేటు పాఠశాలలు ఒక రోజు ముందే 


చిత్తూరు (సెంట్రల్‌) : బడి గంట మోగే వేళ.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను తొలుస్తున్న ప్రశ్న ఇది. మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి. తొలిరోజునే ఏ బడికి పోవాలనే సందిగ్ధత విద్యార్థులను వెన్నాడుతోంది. దీనికి కారణం జాతీయ నూతన విద్యావిధానమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎన్‌ఈపీ ద్వారా పాఠశాలల విలీనం యాప్‌లకు, విద్యార్థుల విలీనం కాగితాలకే పరిమితమైంది. అధికారిక ఉత్తర్వులు సోమవారానికీ రాలేదు. ఇక, పిల్లలకు.. పాఠశాలలకు మధ్య దూరం పెరగడం, పేదలకు.. ప్రభుత్వ విద్య దూరం పెరిగింది. పాఠశాలల సంఖ్య, టీచర్‌ పోస్టుల కుదింపులతో పాటు 117 జీవోతో ఈ ఏడాది ప్రభుత్వ విద్యావ్యవస్థ ఆయోమయంగా మారింది.  


జిల్లా విద్యాశాఖలో పాఠశాలల విలీనం సమస్యలకు నిలయంగా మారింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌పీఎ్‌స)లో భాగంగా 2020-21లో మొదలైన బడుల విలీన ప్రక్రియ 2021-22లో కొనసాగడం 2022-23 విద్యా సంవత్సరానికి శాపంగా మారింది. ఒక వైపు టీచర్ల కొరత, మరోవైపు తాము ఏ పాఠశాలకు వెళ్లాలనే దానిపై విద్యార్థుల్లో టెన్షన్‌ మొదలైంది. గతేడాది తొలి దశలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 250 మీటర్ల దూరంలోని 316 ప్రాథమిక పాఠశాలలను 312 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. రెండో దశలో కిలో మీటరు దూరంలోని పాఠశాలలను విలీనం చేయడంతో విద్యాశాఖ మరింత క్లిష్ట పరిస్థితికి చేరుకుంది. 31 మండలాల పరిధిలోని చిత్తూరు జిల్లాలో 2938 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2099 ప్రాథమిక, 315 ప్రాథమికోన్నత, 524 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 2.47 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విలీనంలోని తాజా ఉత్తర్వుల ప్రకారం కిలో మీటరు దూరంలోని 498 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను 347 ఉన్నత పాఠశాలల్లో విలీనంపై విద్యాశాఖ కసరత్తు చేసింది. 


మేము చేర్చుకోలేం..! 

పాఠశాలల విలీనంతో ఏ విద్యార్థిని ఏ పాఠశాలలో చేర్చుకోవాలనే దానిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఒక విద్యార్థిని తమ పాఠశాలలో చేర్చుకోడానికి, మరో విద్యార్థికి టీసీ ఇవ్వడానికి ఆన్‌లైన్‌లో ఆప్షన్లు కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక హెచ్‌ఎంలు తికమకపడుతున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత తరగతుల కోసం ఏ పాఠశాలకు వెళ్లాలో తేలని పరిస్థితి. తమకు విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలల్లో చేర్పించుకోమని విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్‌ఎంలు తెగేసి చెబుతున్నారు.  

పోస్టుల రద్దు..

రేషనలైజేషన్‌ పేరుతో అధికంగా టీచర్ల పోస్టులు ఉన్నాయని చూపుతూ పెద్ద సంఖ్యలో టీచర్‌ పోస్టులు రద్దు చేశారు. పాఠశాలల విలీనంతో 2469 టీచర్‌ పోస్టులు రద్దు కానున్నాయి. విద్యార్థుల సంఖ్య 30 మంది కంటే తక్కువ 2300 ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 4260 ప్రాథమిక, 731 ప్రాథమికోన్నత, 1228 ఉన్నత.. మొత్తం కలిపి 6219 అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. రేషనలైజేషన్‌ (హేతుబద్దీకరణ)తో  6 నుంచి పదో తరగతి వరకు 93 మంది విద్యార్థుల కంటే తక్కువ కలిగిన పాఠశాలలు 40 ఉన్నాయి. నూతన విద్యా విధానం అమలుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలోని ఉన్నత పాఠశాల్లో విలీనం చేశారు. దీంతో మూడు నుంచి పదో తరగతి వరకు 137 మంది విద్యార్థుల కంటే తక్కువగా 54 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో  హెచ్‌ఎం, పీడీ పోస్టులు రద్దు కానున్నాయి. అలాగే  విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో 307 పోస్టులు, ఉన్నత పాఠశాలల్లో 56 హెచ్‌ఎం పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 

టీచర్లు కావాలి..! .

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం టీచర్ల సమస్య నెలకుంది. భారీ సంఖ్యలో పోస్టులు రద్దు కావడం, డీఎస్సీల ద్వారా పోస్టులు భర్తీ చేయకపోవడంతో టీచర్ల కొరత ఏర్పడింది. జిల్లాలో ఎస్జీటీ, పీడీ, మ్యాథ్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు టీచర్లు కావాల్సి ఉంది. 9510 ఎస్జీటీ పోస్టుల్లో రేషనలైజేషన్‌ ఆధారంగా 7041కు కుదించారు. దీంతో 2469 ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయి. విలీనం అనంతరం లెక్కలు కడితే 451 మంది ఎస్జీటీలు, మరో 120 పీడీలు, 13 మంది స్కూల్‌ అసిస్టెంట్‌లో మ్యాథమెటిక్స్‌ టీచర్లు, 73 మంది ఇంగ్లీష్‌ టీచర్లు కావాల్సి ఉంది. 


తెరచుకున్న ప్రైవేటు పాఠశాలలు 

మంగళవారం సెంటిమెంట్‌తో సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు తెరచుకున్నాయి. విద్యార్థులు హుషారుగా కొత్త యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, బ్యాగులు ధరించి ఉన్నత తరగతుల్లో ఆడుగుపెట్టడంతో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు సోమవారం కళకళలాడుతూ కనిపించాయి. 

Updated Date - 2022-07-05T07:13:49+05:30 IST