సిరాజ్‌, విహారికి ఫైనల్‌ జట్టులో చోటు

ABN , First Publish Date - 2021-06-16T06:33:24+05:30 IST

టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారితోపాటు హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు భారత టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ జట్టులో చోటుదక్కింది...

సిరాజ్‌, విహారికి  ఫైనల్‌ జట్టులో చోటు

  • టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో
  • ఉమేష్‌కు లక్కీ చాన్స్‌ 
  • శార్దూల్‌, సుందర్‌, అక్షర్‌కు నిరాశ
  • 15 మందితో టీమిండియా

సౌతాంప్టన్‌: టెస్టు స్పెషలిస్ట్‌ హనుమ విహారితోపాటు హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌కు భారత టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ జట్టులో చోటుదక్కింది. కాగా, బ్రిస్బేన్‌ టెస్టు హీరో శార్దూల్‌ ఠాకూర్‌ను కాదని అనుభజ్ఞుడైన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపింది. ఐసీసీ ప్రొటోకాల్‌ ప్రకారం 15 మంది సభ్యుల భారత జట్టును మంగళవారం ప్రకటించారు. శుక్రవారం నుంచి ఏజెస్‌ బౌల్స్‌లో జరిగే చారిత్రక టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. విహారితోపాటు ఆసీస్‌ టూర్‌లో గాయపడిన షమి జట్టులోకొచ్చాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కనబెట్టారు. అందుబాటులో ఉన్న ప్రధాన ఆటగాళ్లకు అవకాశం కల్పించాలనే సూత్రాన్ని మేనేజ్‌మెంట్‌ అమలు చేసినట్టు తెలుస్తోంది. ఓపెనింగ్‌ జోడీ రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌కు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో.. ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ను పక్కనబెట్టినట్టు కనిపిస్తోంది. అశ్విన్‌తోపాటు జడేజా కూడా జట్టులోకి రావడంతో.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మెరిసిన అక్షర్‌ పటేల్‌కు నిరాశ తప్పలేదు. 


ఫైనల్‌కు జట్లు ఇవే..

భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, ఛటేశ్వర్‌ పుజార, అజింక్యా రహానె, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, సిరాజ్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), ఉమేష్‌ యాదవ్‌, హనుమ విహారి. 

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టామ్‌ బండిల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, డివోన్‌ కాన్వే, గ్రాండ్‌హోమ్‌, మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమిసన్‌, టామ్‌ లాథమ్‌, హెన్రీ నికోల్స్‌, అజాజ్‌ పటేల్‌, టిమ్‌ సౌథీ, రాస్‌ టేలర్‌, నీల్‌ వాగ్నర్‌, వాట్లింగ్‌, విల్‌ యంగ్‌. 


Updated Date - 2021-06-16T06:33:24+05:30 IST