టెస్టుల్లోకి సిరాజ్‌

ABN , First Publish Date - 2020-10-27T09:25:43+05:30 IST

టెస్టు జట్టులో హైదరాబాదీ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు, పరిమిత ఓవర్ల నుంచి రిషభ్‌ పంత్‌కు ఉద్వాసన, కేఎల్‌ రాహుల్‌కు

టెస్టుల్లోకి సిరాజ్‌

రాహుల్‌కు డబుల్‌ ధమాకా 

ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్లు

గాయంతో రోహిత్‌ అవుట్‌

పరిమిత ఓవర్ల నుంచి పంత్‌కు ఉద్వాసన


న్యూఢిల్లీ: టెస్టు జట్టులో హైదరాబాదీ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు చోటు, పరిమిత ఓవర్ల నుంచి రిషభ్‌ పంత్‌కు ఉద్వాసన, కేఎల్‌ రాహుల్‌కు వైస్‌ కెప్టెన్సీతోపాటు సుదీర్ఘ విరామానంతరం టెస్టు జట్టుకు ఎంపిక.. ఇవీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టులో విశేషాలు. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే మొదలయ్యే ఆసీస్‌ టూర్‌ కోసం మూడు ఫార్మాట్లలో జట్లను సోమవారం ప్రకటించారు. నవంబరు 27న మొదలయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఐపీఎల్‌ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన సీనియర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఆసీస్‌ టూర్‌కు పక్కనబెట్టారు. ‘గాయాలపాలైన రోహిత్‌, ఇషాంత్‌ శర్మలను బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్‌కు పూర్తిగా దూరమైన రోహిత్‌ త్వరలోనే భారత్‌ వచ్చి జాతీయ క్రికెట్‌ అకాడమీలోని పునరావాస కేంద్రంలో ఉంటాడు’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించాడు. రోహిత్‌ గైర్హాజరీలో  కేఎల్‌ రాహుల్‌కు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అంతేకాదు.. సుదీర్ఘ విరామానంతం రాహుల్‌ టెస్టు జట్టుకు కూడా ఎంపికై డబుల్‌ ధమాకా అందుకున్నాడు. ఇక, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పంత్‌ టెస్టు జట్టుకు ఎంపికైనా.. వన్డేలు, టీ20ల్లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ‘జట్టు వికెట్‌ కీపర్‌గా రాహుల్‌కు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ దాకా ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అతను పంజాబ్‌ను సమర్ధవంతంగా నడిపిస్తున్నాడు. రాహుల్‌కు పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడానికి ఇది కూడా కారణం’ అని బోర్డు వర్గాలు తెలిపాయి. సంజూ శాంసన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20ల్లో చోటు దక్కించుకున్నారు. ఇటీవల ఐపీఎల్‌లో కోల్‌కతాపై బెంగళూరు అద్భుత విజయంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తొలిసారిగా టెస్టుల్లో ఆడనున్నాడు. ఇషాంత్‌, భువనేశ్వర్‌ గాయాలపాలవడం కూడా సిరాజ్‌కు కలిసొచ్చింది. తెలుగు ఆటగాడు హనుమ విహారి టెస్టు జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. కాగా.. నటరాజన్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, కార్తీక్‌ త్యాగి, ఇషాన్‌ పొరెల్‌లను ఆసీస్‌ టూర్‌లో నెట్‌ బౌలర్లుగా వ్యవహరిస్తారని బీసీసీఐ తెలిపింది. 


జట్లు 

టెస్టు (18 మంది)

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, పుజార, రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, సాహా (వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), బుమ్రా, షమి, ఉమేశ్‌, నవ్‌దీప్‌ సైనీ, కుల్దీప్‌, జడేజా, ఆర్‌ అశ్విన్‌, మహ్మద్‌ సిరాజ్‌.   

వన్డే (15 మంది)

కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), అయ్యర్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌, మయాంక్‌, జడేజా, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, షమి, సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌.

టీ20 (16 మంది)

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ ధవన్‌, మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌, కీపర్‌), శ్రేయాస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహల్‌, బుమ్రా,  షమి, నవ్‌దీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, వరుణ్‌ చక్రవర్తి.


మూడు ఫార్మాట్లకూ ఎంపికైన ఆటగాళ్లు

విరాట్‌ కోహ్లీ, మయాంక్‌ అగర్వాల్‌, 

కేఎల్‌ రాహుల్‌, జడేజా, బుమ్రా, షమి, సైనీ

Updated Date - 2020-10-27T09:25:43+05:30 IST