విదేశాల్లో సిరిసిల్ల పట్టుచీరలు

ABN , First Publish Date - 2022-09-19T09:22:43+05:30 IST

బతుకమ్మ చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది.

విదేశాల్లో  సిరిసిల్ల పట్టుచీరలు

  • ‘రాజన్న సిరిపట్టు’గా నామకరణం
  • న్యూజిలాండ్‌లో ఆవిష్కరించిన ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌
  • అభినందించిన మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌/సిరిసిల్ల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు యెల్ది హరిప్రసాద్‌ అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీరలతోపాటు మరమగ్గంపై పట్టు చీరల ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టారు. హరిప్రసాద్‌ ప్రతిభను గుర్తించిన న్యూజిలాండ్‌లోని బ్రాండ్‌ తెలంగాణ ఫౌండర్‌ సునీతావిజయ్‌ చీరల ఉత్పత్తికి న్యూజిలాండ్‌, అమెరికా, లండన్‌ వంటి ఆరు దేశాల నుంచి ఆర్డర్లు ఇప్పించారు. ఈ చీరలకు ‘రాజన్న సిరిపట్టు’ అని నామకరణం చేశారు. ఈ పట్టుచీరలను శనివారం న్యూజిలాండ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అక్కడి మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌, భారత రాయబారి బావూ దిల్లాన్‌ ఆవిష్కరించారు. సిరిసిల్ల ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చినందుకు నేతన్నలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా అభినందించారు. పట్టుచీరలను ఆవిష్కరించిన న్యూజిలాండ్‌ మంత్రి ప్రియాంకకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పట్టుచీరలకు విదేశాల్లో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్న బ్రాండ్‌ తెలంగాణ ఫౌండర్‌ సునీతవిజయ్‌ను అభినందించారు. ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారన్నారు. హరిప్రసాద్‌ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘రాజన్న సిరిపట్టు’కు మంచి భవిష్యత్తు ఉండాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. 



పట్టుచీరలంటే నాకెంతో ఇష్టం: న్యూజిలాండ్‌ మంత్రి 

‘రాజన్న సిరిపట్టు’ పేరుతో సిరిసిల్ల పట్టు చీరలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్‌ క్రియేట్‌ చేయాలన్న తన ఆలోచనకు మంచి స్పందన లభిస్తున్నదని బ్రాండ్‌ తెలంగాణ ఫౌండర్‌ సునీత తెలిపారు. తొలుత నేతన్న హరిప్రసాద్‌ ఒక్కరితో మాత్రమే ప్రారంభమైన పట్టుచీరల ఉత్పత్తి, ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా నేతన్నలకు ఉపాధి కల్పిస్తోందని ఆమె తెలిపారు. ‘సిరిసిల్ల పట్టు చీరలు బాగున్నాయి’ అని న్యూజిలాండ్‌ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌ కొనియాడారు. పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. తనకు పట్టు చీరలంటే ఎంతో ఇష్టమని, బతుకమ్మ సంబరాల కోసం తెలంగాణ ప్రవాసీలు తనను ఆహ్వానించిన ప్రతిసారి పట్టుచీరలనే ధరిస్తానని చెప్పారు.

Updated Date - 2022-09-19T09:22:43+05:30 IST