సిరివెన్నెల.. మరువదు ఈ నేల

ABN , First Publish Date - 2021-12-01T04:56:17+05:30 IST

‘జగమంత కుటుంబం నాది’ అంటూ సాహిత్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తిది విజయనగరంతో వీడలేని అనుబంధం. విజయనగరంలోని అభిమానులు, రచయితలు, కవులు ‘సిరివెన్నెల’ ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సిరివెన్నెల.. మరువదు ఈ నేల

విజయనగరంతో సీతారామశాసి్త్రకి ప్రత్యేక అనుబంధం

ఆయన మృతితో జిల్లాలో విషాదం

విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 30: ‘జగమంత కుటుంబం నాది’ అంటూ సాహిత్యంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ‘సిరివెన్నెల’ సీతారామశాస్ర్తిది విజయనగరంతో వీడలేని అనుబంధం. విజయనగరంలోని అభిమానులు, రచయితలు, కవులు ‘సిరివెన్నెల’ ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనేకసార్లు ఆయన జిల్లాకు వచ్చారు. ఈ నేలతో ఆయనకు బంధుత్వం కూడా ఉంది.  ఇక్కడ బంధువులూ ఉన్నారు. అతని బావగారైన పి.శ్రీనివాసరావు డీఆర్‌డీఏలో ఉద్యోగం చేసేవారు. దీంతో అప్పుడప్పుడు నగరానికి వచ్చేవారు. 2017లో రోటరీ క్లబ్‌ 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. 2018 నవంబరు 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ కళాపీఠం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. సినీ దర్శకులు జాగర్లమూడి క్రిష్‌కు గురజాడ విశిష్ట పురస్కారాన్ని కళాపీఠం తరుఫున ఆయనే ప్రదానం చేశారు. అదే రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గురజాడ గృహంలో గడిపారు. అక్కడ గురజాడ వినియోగించిన వస్తువులను ఆసక్తితో పరిశీలింఆరు. ఆయన కుటుంబీకుల గురించి కళాపీఠం ప్రతినిధి కాపుగంటి ప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం వచ్చినప్పుడల్లా సంగీత సరస్వతుల ఆలయానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని చెబుతుండేవారు.

సిరివెన్నెల మనలోనే ఉంటారు

తెలుగు మాట, పాట, భాష ఉన్నంతవరకు సిరివెన్నెల మనలోనే ఉంటారు. జగమంత సాహిత్య ప్రియులను ఆయన సంపాదించుకున్నారు. అలాంటి రచయిత ఇకలేరు అన్న విషయం నాతో పాటు సాహిత్య అభిమానులకు దిగ్ర్భాంతిని కలిగించింది. ఆయన మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటు.

- సముద్రాల గురుప్రసాద్‌,తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు


విజయనగరమంటే అభిమానం

సినీ పరిశ్రమలో ఆయన గీతాలకు ఎన్నో నంది అవార్డులు వచ్చాయి. ఇలాంటి గీతాలు నేరుగా శివుడు వినాలనేమో.. నేరుగా సిరివెలన్నెల అనే నందిని కైలాసానికి పిలుపించుకున్నారు. అన్ని తరగతుల ప్రేక్షకులను మెప్పించగలిగే గేయ రచయిత సిరివెన్నెల. ఆయన ఇకలేరు అన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నాం.. ఆయనకు విజయనగరమంటే ఎనలేని అభిమానం.

-  కె. ప్రకాష్‌, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి

------

Updated Date - 2021-12-01T04:56:17+05:30 IST