భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి ఇప్పుడు ఉంది.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల

Published: Tue, 30 Nov 2021 16:33:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి ఇప్పుడు ఉంది.. ఓపెన్‌హార్ట్‌లో సిరివెన్నెల

అది నా పాట కాదు.. నా విజిటింగ్‌ కార్డ్.. అని చెబుతాను

సినిమా చాన్స్‌ వచ్చినప్పుడు నేను వెనకడుగు వేశా.. ఆయనే బలవంతంగా తోసేశారు

మొట్టమొదట నా టాలెంట్‌ను గుర్తించింది నా తమ్ముడే..

అది అపోహే.. నా పాటకు రేటు ఇంత అనే మాట నా నోట రాలేదు

ఒకప్పుడు చిత్రసీమ ఇంతకంటే అద్భుతంగా ఏమీ లేదు.

శిష్యులని అనడం వాళ్ల సంస్కారం. వాళ్లకు నేను నేర్పిందేమీ లేదు. 

29-07-2013న జరిగిన ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో సిరివెన్నెల


జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది.. అంటూ..సముద్రమంత లోతైన తత్వాన్ని.. ఆకాశమంత భావాన్నీ.. అలతిఅలతి పదాల్లో ఇమిడ్చి ఆలోచింపజేసే పాటలు రాసే ‘మంచి’ రచయిత.. సిరివెన్నెల సీతారామశాస్త్రి. జగమంత కుటుంబం అని రాసినా... నిగ్గదీసి అడుగు అని ఆక్రోశించినా అది ఆయనకే సొంతం. ఒకప్పుడు బలపం పట్టి భామ ఒళ్లో అనే పాట రాసిన నేను ఈ తరం సినిమాలకు రాయలేనా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చినా కూడా ఓ వ్యసనాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నానన్న ఆయన 29-07-2013న జరిగిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన జ్ఞాపకాలూ అనుభవాలను పంచుకున్నారు. ఆ కార్యక్రమ పూర్తి వివరాలు.. మీ కోసం..


ఆర్కే: నమస్కారం సీతారామశాస్త్రి గారూ.. మీరు ‘నిగ్గదీసి అడుగు’.. పాట రాసి పదిహేనేళ్లు దాటింది కదా. ఇప్పుడు సమాజంలో పరిస్థితుల మీద రాయాలనిపిస్తే ఏమనిపిస్తుంది?

సిరివెన్నెల: అక్కడే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే.. భయం వెయ్యాలని అప్పట్లో ఆ పాట రాశాను. కానీ, ఇప్పుడు భయం మోతాదు మించిపోయింది. భయపడుతూ బతకడం కంటే.. చచ్చి బతికిపోదామనే పరిస్థితి. అందుకే ఇప్పుడు రాస్తే.. ‘‘శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు.. బతికి ఉండగల సాహసానివై పరుగులు తీ’’ అని రాస్తా.


ఆర్కే: మీకు ఇంత పాండిత్యం ఎలా అబ్బింది?

సిరివెన్నెల: పాండిత్యం అంటే.. పుస్తకాల ద్వారా చదివిందేమీ లేదు. మా నాన్నగారు పుట్టుకతోనే జీనియస్‌. దాదాపు 15 భాషల్లో అపార పాండిత్యం కలిగిన వ్యక్తి. ఆయనకు రాని సబ్జెక్ట్‌ ఏదీ లేదు. పెద్దకొడుకైనన నాకు అవన్నీ నేర్పించాలన్న ఉద్దేశంతో అన్నీ చెప్పేవారు. మా నాన్నగారు నాకిచ్చిన మహా ఆస్తి నన్ను నేను నిరంతరం ప్రశ్నించుకోవడం. సినిమాల్లోకి వచ్చాక పాండిత్యం కంటే కూడా అదే ఉపయోగపడింది.


ఆర్కే: మీ పిల్లలతో మీరు అలాగే ఉంటారా?

సిరివెన్నెల: తప్పకుండా. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో నాకు అవే గైడ్‌లైన్స్‌. పిల్లలతో నిరంతరం మాట్లాడుతుంటాను. అందరితో నా ఇంటరాక్షన్‌ అలాగే ఉంటుంది. ‘జగమంత కుటుంబం నాది’ పాట ఎక్స్‌ప్రెషన్‌ నాది... మా నాన్నగారి జీవనసంవిధానం అది.


ఆర్కే: అది మీ ఫిలాసఫీనా?

సిరివెన్నెల: అవును. మా పిల్లలతో చెప్పేటప్పుడు ‘అది నా పాట కాదు.. నా విజిటింగ్‌ కార్డ్‌’ అని చెబుతాను.


ఆర్కే: ఇంత విద్వత్తు పెట్టుకుని టెలిఫోన్‌ డిపార్ట్‌మెంటులో చేరడమేంటి?

సిరివెన్నెల: మాది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. దాదాపు 14-15 మందికి మా నాన్నే ఆధారం. రోజుకు 18-19 గంటలు కష్టపడేవారు. అప్పట్లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసినా ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు. కాబట్టి నన్ను ఎంబీబీఎస్‌ చేయమన్నారు. ఎంబీబీఎస్‌లో చేరాను. కానీ ఆ క్రమశిక్షణ నాకు అలవాటు లేదు. అదే సమయంలో నేను పదోతరగతి సర్టిఫికెట్‌ మీద దరఖాస్తు చేసిన టెలికం ఉద్యోగం వచ్చింది. సినిమా చాన్స్‌ వచ్చినప్పుడు నేను వెనకడుగు వేసినా మా సత్యారావు మాస్టారు బలవంతంగా దీంట్లోకి తోశారు.


ఆర్కే: మొట్టమొదట మీ టాలెంట్‌ని గుర్తించి ప్రోత్సహించిందెవరు?

సిరివెన్నెల: మా తమ్ముడు. నాకు చిన్నప్పటి నుంచి చదవడం బాగా అలవాటు. కొన్ని వేల పుస్తకాలు చదివాను. అలాగే.. చిన్నప్పుడు నాకు బాగా పాడాలని కోరిక. నేనో పెద్ద గాయకుడినన్న ఫీలింగ్‌. రెండుమూడుసార్లు పాడాక నేను దానికి పనికిరానని నాకు తెలిసింది. దీంతో.. లలలా అనుకునేవాణ్ని. అలా ఎంతసేపు? అందుకే ఏవో పదాలు జోడించేవాణ్ని. అవి విని మా తమ్ముడు... ‘అన్నయ్యా కవిత్వం బాగా రాస్తున్నావు’ అన్నాడు. తర్వాత ఏవీ కృష్ణారావు అని.. ఆయన ప్రోత్సహించారు. నేను రాసిన పాటలు విశ్వనాథ్‌గారి చెవిలో పడటంతో ‘సిరివెన్నెల’ చాన్స్‌ వచ్చింది. 


నా వ్యసనం కూడా అలాగే మొదలయింది.. వదులుకోవడం చేతకావడం లేదు.. ఇంటర్వ్యూ పార్ట్ 2.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.