అక్కాచెల్లెళ్ళ సెల్యూట్‌ ది నేషన్స్‌

ABN , First Publish Date - 2021-09-13T05:44:31+05:30 IST

చిన్నప్పుడు బడిలో, ఆ తరువాత జాతీయ దినోత్సవాల్లో ‘జనగణమన’ పాడుకుంటాం. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం... అది మన జాతీయ గీతం కాబట్టి. కానీ ‘మన పక్క దేశం జాతీయ గీతం ఏమిటి

అక్కాచెల్లెళ్ళ సెల్యూట్‌ ది నేషన్స్‌

చిన్నప్పుడు బడిలో, ఆ తరువాత జాతీయ దినోత్సవాల్లో ‘జనగణమన’ పాడుకుంటాం. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం... అది మన జాతీయ గీతం కాబట్టి. కానీ ‘మన పక్క దేశం జాతీయ గీతం ఏమిటి?’ అనే ప్రశ్న ఎదురైతే సమాధానం చెప్పేవాళ్ళు లక్షల్లో ఒక్కరు కూడా ఉండరేమో! ఈ అక్కా చెల్లెళ్ళు మాత్రం ఐక్య రాజ్య సమితి సభ్యదేశాలన్నిటి జాతీయగీతాలనూ పొల్లుపోకుండా వినిపించేస్తారు. ఈ నెల 21న, అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా తమ ప్రతిభా ప్రదర్శనతో రికార్డు నెలకొల్పడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు.


‘‘ఏదైనా కొత్తగా చెయ్యాలి. కొత్తగా ఆలోచించాలి. ప్రపంచానికి మీ వంతు సేవ చెయ్యాలి...  మా నాన్న జాయ్‌ మాతో తరచుగా చెప్పే మాటలివి. ఆయన స్ఫూర్తితోనే... నేను మూడో క్లాసులో, మా అక్క థెరిసా ఆరో క్లాసులో ఉన్నప్పుడు... వేర్వేరు దేశాల జాతీయ గీతాలను నేర్చుకోవాలనే ఆలోచన వచ్చింది’’ అంటూ వినూత్నమైన తమ ప్రయత్నం ఎలా ప్రారంభమయిందో గుర్తుచేసుకుంది ఆగ్నెస్‌ జాయ్‌. 


థెరిసా, ఆగ్నెస్‌ పుట్టింది కేరళలోని అలెప్పీ జిల్లా చేర్తల పట్టణంలో. పెరిగిందీ, ప్రస్తుతం చదువుతున్నదీ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో. వారి తండ్రి జాయ్‌ ఫిల్మ్‌ మేకర్‌. తల్లి జాక్వలిన్‌ నర్స్‌. తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఎనిమిదేళ్ళ కిందట జాతీయ గీతాల అభ్యాసానికి ఆ అక్కాచెల్లెళ్ళు శ్రీకారం చుట్టారు. ‘‘ఏదైనా నేర్చుకొనేటప్పుడు కష్టంగా ఉంటుంది.


ప్రతి జాతీయ గీతానికి ఈ కష్టం మాకు ఎదురవుతూనే ఉంది. అయితే మాలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. మరిన్ని నేర్చుకోవాలనే కోరిక బలపడింది. దీని కోసం రోజూ తెల్లారుజామున అయిదు గంటలకు లేచి, రెండు గంటల పాటు జాతీయ గీతాలను అభ్యాసం చేస్తూ వచ్చాం. కొన్ని చాలా సులువుగా ఉంటాయి. మరికొన్ని అంత తేలిగ్గా పట్టుపడవు. అన్నిటికన్నా చిన్న జాతీయ గీతం జపాన్‌ దేశానిదైతే, పెద్దది గ్రీస్‌ దేశానిది. ఇంకో ఇబ్బందేమిటంటే, మాకు మా మాతృభాష మళయాళం, ఇంగ్లీష్‌ మాత్రమే బాగా వచ్చు. ఏ దేశ జాతీయగీతాన్నైనా ఆ భాషలోని సౌందర్యం చెడకుండా, తప్పులు లేకుండా, ఆ దేశస్తుల ఉచ్చారణతో పాడడం ఒక సవాలే. అందుకే, దేన్నైనా నేర్చుకోడానికి ముందు... దాని అర్థాన్నీ, చరిత్రనూ తెలుసుకుంటాం. ఆలాపనలో పరిపూర్ణత సాధించడానికి కొన్నిసార్లు నెలల సమయం కూడా పడుతుంది’’ అని చెప్పింది థెరిసా. 


193 గీతాలు... ఆరు గంటలు

‘అంతర్జాతీయ శాంతి దినోత్సవం’ సందర్భంగా... ‘యునైటెడ్‌ నేషన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ (యుఎన్‌ఎఎ) ఈ నెల 21న  బ్రిస్బేన్‌లోని సెయింట్‌ క్యాథడ్రల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో... ఐక్యరాజ్య సమితి (యుఎన్‌) సభ్యత్వం కలిగిన మొత్తం 193 దేశాల జాతీయ గీతాలను థెరిసా, ఆగ్నెస్‌ ఆలపిస్తారు. దీనికి ‘యూనివర్సల్‌ రికార్డ్స్‌’తో సహా వివిధ ప్రపంచ రికార్డుల నమోదు సంస్థల నుంచి న్యాయనిర్ణేతలు హాజరవుతారు. ఈ సందర్భంగా ‘సెల్యూట్‌ ది నేషన్స్‌’ పేరిట ఒక అంతర్జాతీయ ఈవెంట్‌ను ఈ సిస్టర్స్‌ ప్రారంభించబోతున్నారు.

ఆ ఈవెంట్‌ కింద ఐక్యరాజ్య సమితి సహాయంతో వివిధ దేశాల్లో తమ ప్రదర్శనలు ఇవ్వాలన్నది వారి ప్రణాళిక. వాటి ద్వారా సేకరించే నిధులను ఐక్యరాజ్యసమితి చేపట్టే శాంతి, ధార్మిక కార్యక్రమాలకూ, మహిళల భద్రత కోసం పాటుపడుతున్న సంస్థలకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారు. ‘‘ఆ జాతీయ గీతాలు మొత్తం ఆలపించడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. రెండు గంటలకు పది నిమిషాల చొప్పున విరామం తీసుకొని దాన్ని మేం కొనసాగిస్తాం’’ అంటున్నారు థెరిసా, ఆగ్నెస్‌. నిజానికి, కిందటి ఏడాది యుఎన్‌ 75వ వార్షికోత్సవాల్లో వారి ప్రదర్శన జరగాల్సి ఉంది. కానీ కొవిడ్‌ కారణంగా రద్దయింది. ‘‘అప్పుడు మేమెంతో నిరాశకు గురయ్యాం. కానీ కొవిడ్‌ బాధితులకు సంఘీభావం తెలపడం కోసం వివిధ సోషల్‌ మీడియా వేదికల ద్వారా... ప్రతి దేశ జాతీయ గీతాన్నీ పాడి అప్‌లోడ్‌ చేశాం’’ అని చెప్పారు థెరిసా. ‘‘ఏవో రికార్డులు సాధించాలని ఇదంతా మేము చేయడం లేదు. ప్రపంచ శాంతి, బాలల భద్రత, మహిళా సాధికారత, మానవతావాదం బలపడం ఇవీ మా లక్ష్యాలు. మేము సేకరించే నిధులన్నీ వాటి కోసమే ఖర్చు చేస్తాం’’ అని అంటున్నారీ సోదరీమణులు. ఇరవై ఒక్క ఏళ్ళ థెరిసా ‘గ్రిఫిత్‌ యూనివర్సిటీ’లో డిగ్రీ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థిని. పదిహేడేళ్ళ ఆగ్నెస్‌ ప్రస్తుతం ప్లస్‌ టూ చదువుతోంది. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ‘ఆగ్నెస్‌ అండ్‌ థెరిసా పీస్‌ ఫౌండేషన్‌’అనే ఒక సంస్థను వీరు నడుపుతున్నారు. వారి సేవలను గుర్తించిన యుఎన్‌ఎఎ తమ క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్ర డివిజన్‌కు కార్యదర్శిగా థెరిసాను ఇటీవల ఎన్నుకుంది. ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలు ఆమే కావడం విశేషం.


ఈ నెల 21న  బ్రిస్బేన్‌లోని సెయింట్‌ క్యాథడ్రల్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో.ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కలిగిన మొత్తం 193 దేశాల జాతీయ గీతాలను థెరిసా, ఆగ్నెస్‌ ఆలపిస్తారు. దీనికి ‘యూనివర్సల్‌ రికార్డ్స్‌’తో సహా వివిధ ప్రపంచ రికార్డుల నమోదు సంస్థల నుంచి న్యాయనిర్ణేతలు హాజరవుతారు.

Updated Date - 2021-09-13T05:44:31+05:30 IST