సిట్‌ంగ్‌ ఎప్పుడో!?

ABN , First Publish Date - 2021-07-25T05:57:19+05:30 IST

విశాఖ నగర పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) నుంచి నివేదిక స్వీకరణకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.

సిట్‌ంగ్‌ ఎప్పుడో!?

ప్రభుత్వానికి చేరని ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక

మూడు నెలల నుంచి అపాయింట్‌మెంట్‌ కోసం సభ్యుల ఎదురుచూపు

కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తోందనే సందేహాలు

అస్మదీయులు పేర్లు ఉన్నాయనే...

ఒకసారి స్వీకరిస్తే...బహిర్గతం చేయాల్సిందే


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


విశాఖ నగర పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) నుంచి నివేదిక స్వీకరణకు ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. భూ అక్రమ లావాదేవీల్లో ప్రస్తుతం అధికార పార్టీలో వున్న పలువురి నేతలు పాలుపంచుకున్నట్టు సిట్‌ దర్యాప్తులో తేలిందని, అటువంటప్పుడు ఆ నివేదిక తీసుకుని బయటపెడితే...చివరకు అస్మదీయులపైనే చర్యలు తీసుకోవలసిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ అంచనాల మేరకు సిట్‌ దర్యాప్తు జరగలేదనే భావనలో ప్రభుత్వం వుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నివేదిక సమర్పించేందుకు సిట్‌ బృందానికి ప్రభుత్వం తగిన సమయం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు రావడంతో గత తెలుగుదేశం ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం వినీత్‌ బ్రిజలాల్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. రికార్డులు పరిశీలించి, అనేకమందిని విచారించి ‘సిట్‌’ సమగ్ర నివేదిక తయారుచేసి అప్పటి ప్రభుత్వానికి సమర్పించింది. ఈలోగా ప్రభుత్వం మారింది. గతంలో సిట్‌ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి వైసీపీ ప్రభుత్వం 2019 అక్టోబరు 17వ తేదీన రిటైర్డు ఐఏఎస్‌ అధికారులతో మరో సిట్‌ను వేసింది. రిటైర్టు ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ నేతృత్వంలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారిణి వైవీ అనురాధ, రిటైర్డు జడ్జి వి.భాస్కరరావులను సభ్యులుగా నియమించింది. ఈ బృందానికి విశాఖ నగరంతోపాటు పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణల, రికార్డుల ట్యాంపరింగ్‌పై సుమారు 1400 ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులపై విచారించిన సిట్‌ గత ఏడాది జనవరి చివరిలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేసింది. ఆ తరువాత మార్చిలో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందడంతో దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసింది. కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో 2020 నవంబరు నుంచి తిరిగి దర్యాప్తు ప్రారంభించింది. పెండింగ్‌లో వున్న ఫిర్యాదులను విచారించి నివేదిక రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 15లోగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అపాయింట్‌మెంట్‌ కోరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ సమయం ఇవ్వలేదని తెలిసింది. ప్రభుత్వం అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన వెంటనే నివేదిక ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని సిట్‌ సభ్యులు చెబుతున్నారు.


అస్మదీయులున్నారనే వెనుకంజ?


సిట్‌ నుంచి నివేదిక తీసుకోకపోవడానికి రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. నివేదికలో అధికార పార్టీ నేతల పేర్లు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో...వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు వస్తుందని పాలక పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది.  ఇదిలావుండగా ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్‌, ఎన్‌వోసీల జారీలో ప్రస్తుతం కీలక స్థానాల్లో వున్న కొంతమంది ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు, వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు వున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఒకసారి సిట్‌ నుంచి నివేదిక తీసుకున్నాక వివరాలు బహిరంగపరిచి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోతే అభాసుపాలవుతామనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలున్నాయి.  

Updated Date - 2021-07-25T05:57:19+05:30 IST