రాజన్న సన్నిధిలో నేడు సీతారాముల కల్యాణం

ABN , First Publish Date - 2021-04-21T06:24:42+05:30 IST

వేములవాడ రాజ రాజేశ్వర క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.

రాజన్న సన్నిధిలో నేడు సీతారాముల కల్యాణం
స్వామివారల ఉత్సవ మూర్తులు

- కరోనా నేపథ్యంలో అంతరంగికంగా వేడుక

వేములవాడ, ఏప్రిల్‌ 20: వేములవాడ రాజ రాజేశ్వర క్షేత్రంలో బుధవారం  సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా  రాజరాజేశ్వరస్వామివారి దేవ స్థానంలో సీతారామచంద్రస్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా   ఆలయం లోపల  భక్తులు లేకుండా సీతారాముల కల్యాణాన్ని నిర్వ హించనున్నారు. గతేడాది కూడా లాక్‌డౌన్‌ కారణంగా  సీతారాముల కల్యాణాన్ని అంతరంగికంగా నిర్వహించారు. శ్రీరామన వమి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి స్వామివారల దర్శనాలతోపాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఐదు రోజులపాటు భక్తులకు ఆలయం లోపలికి అనుమతి  లేదు. ఈ క్రమంలో సీతారాముల కల్యాణ వేడుకను అంతరంగికంగా, అర్చకుల సమక్షంలో నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 


   ఘనంగా అభిషేకం

వేములవాడ రాజన్న క్షేత్రంలో మంగళవారం సీతారామచంద్రస్వామివారలకు ఘనంగా అభిషేకం నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు  రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారా అభిషేకం నిర్వహించారు. పరివార, అనుబంధ దేవతలకు అభిషేకములు చేశారు. రాత్రి పార్వతీ రాజరాజేశ్వరస్వామివారు, లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలు ఆలయ ఆవరణలో నంది హనుమంతుడు వాహనాలపై విహరించారు.

Updated Date - 2021-04-21T06:24:42+05:30 IST