కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-02-24T05:14:09+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దేవస్థానం పరిసరాలు రామనామ స్మరణతో మార్మోగాయి. భక్తులతో ఆవరణంతా కళకళలాడింది. దేవస్థానం ఆవరణలో పూలు, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికను సీతారామ లక్ష్మణులు అధిష్టించారు.

కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం
రామతీర్థంలో సీతారాముల కల్యాణోత్సవ దృశ్యం

కనులార్పకుండా తిలకించిన భక్తులు

రామనామ స్మరణతో మార్మోగిన రామతీర్థం

ఉత్సాహంగా ఎదురుసన్నాహ తంతు

నెల్లిమర్ల, ఫిబ్రవరి 23 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం రాత్రి సీతారాముల తిరుక్కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. దేవస్థానం పరిసరాలు రామనామ స్మరణతో మార్మోగాయి. భక్తులతో ఆవరణంతా కళకళలాడింది.  దేవస్థానం ఆవరణలో పూలు, విద్యుత్‌ దీపాలతో శోభాయమానంగా అలంకరించిన వేదికను సీతారామ లక్ష్మణులు అధిష్టించారు. అనంతరం అర్చకులు సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం మంగళవారం అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు సాగింది. అంతకుముందు నవ వధూవరులను వేర్వేరుగా ఊరేగించే ఎదురుసన్నాహం   ఘనంగా జరిగింది. సీతారామలక్ష్మణులను అశ్వ, గరుడ, హంస వాహనాలపై రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఆ తర్వాత కల్యాణ ఘట్టాలను ప్రారంభించారు. అర్చకులు ఖండవిల్లి సాయి రామాచార్యులు, ఖండవిల్లి కిరణ్‌,  గొడవర్తి నరసింహాచార్యులు, పాణంగిపల్లి ప్రసాద్‌, పవన్‌కుమార్‌ తదితరులు శాస్త్రోక్తంగా వివాహ ప్రక్రియను నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వరుడు శ్రీరామచంద్రుడి తరపున ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు వ్యవహరించాల్సి ఉంది. ఆయన తరఫున దేవస్థానం అధికారులు శ్రీరామచంద్రునికి పట్టు వస్త్రాలను అందజేశారు. వధువు సీతమ్మ తరఫున అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరై వివాహ సామగ్రిని సమకూర్చారు. సీతమ్మకు బంగారు శతమానాలతో పాటు పండ్లు, పట్టు వస్త్రాలు, అరటి, కొబ్బరి పండ్లు సమకూర్చారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన సీతారాముల తిరుక్కల్యాణ ఉత్సవాన్ని భక్తులు కనులార్పకుండా చూసి ఆనందించారు. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులతో దేవస్థానం ఆవరణ కళకళలాడింది. సీతమ్మ  తలపై శ్రీరామ చంద్రుడు జీలకర్ర బెల్లం పెట్టిన సన్నివేశం, తలంబ్రాలు చల్లుకున్న సన్నివేశం చూసి భక్తులు పులకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయనగరం రూరల్‌ సీఐ టి.సత్యమంగవేణి పర్యవేక్షణలో నెల్లిమర్ల ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.  


Updated Date - 2021-02-24T05:14:09+05:30 IST