ఓటీటీలో ‘వాళ్‌’

Jun 2 2021 @ 15:23PM

తమిళ సినీపరిశ్రమలో ఒక నటుడుగానే కాకుండా నిర్మాతగా ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా సినిమాలు నిర్మిస్తూ, ప్రతి ఒక్కరితో శభాష్‌ అనిపించుకుంటున్న హీరో శివకార్తికేయన్‌. ‘గనా’, ‘నెంజముండు నెర్మైయుండు’ చిత్రాల తర్వాత ‘వాళ్‌’ అనే చిత్రాన్ని నిర్మించారు. ‘అరువి’ చిత్ర ఫేం అరుణ్‌ పురుషోత్తమన్‌ దర్శకత్వం వహించిన ‘వాళ్‌’ చిత్రం షూటింగ్‌ గత 2019లోనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇపుడు కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. దీంతో సినిమా థియేటర్లు మూసివేశారు. అలాగే, షూటింగులను కూడా నిలిపివేశారు. పైగా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అనేకమంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ కోవలోనే ఇపుడు శివకార్తికేయన్‌ కూడా తన చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్ణయించి, చిత్రం విడుదల హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థకు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి అధికారపూర్వక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇదిలావుంటే, శివకార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’ చిత్రం కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.