శ్రీగిరిపై బ్రహ్మోత్సవ శోభ

ABN , First Publish Date - 2021-03-04T06:26:18+05:30 IST

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి సిద్ధమైంది..

శ్రీగిరిపై బ్రహ్మోత్సవ శోభ

నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు

భక్తులకు అలంకార దర్శనం మాత్రమే 

పాదయాత్ర భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు 


శ్రీశైలం(కర్నూలు): మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీగిరి సిద్ధమైంది. గురువారం నుంచి 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తామని ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. క్షేత్రంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాల కట్టారు. ఆలయాలకు విద్యుద్దీకరణ చేశారు. అటవీ మార్గాన వచ్చే పాదయాత్రికులకు తాగునీరు, అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నారు. 4తేదీ ఉదయం 9:45 గంటలకు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రాత్రి 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరిస్తారు.


5వ తేదీ భృంగి వాహనసేవ, 6న హంసవాహన సేవ, 7న మయూర వాహన సేవ, 8న రావణ వాహనసేవ నిర్వహిస్తారు. ఇదేరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 9న స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ జరుపుతారు. 10న గజవాహన సేవ, 11న మహాశి వరాత్రి పర్వది నం పురస్కరించుకుని సాయంకాలం ప్రభో త్సవం, స్వామిఅమ్మ వార్లకు నందివాహన సేవ, స్వామివారికి లింగోద్భవకాల మహ న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలం కరణ ఉంటాయి. రాత్రి 12 గంటలకు కళ్యాణో త్సవం నిర్వహిస్తారు. 12న సాయంత్రం రథోత్సవం, స్వామి అమ్మవార్లకు తెప్పో త్సవం ఉంటాయి. 13న 10:30 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు. 14న ఆదివారం సాయంకాలం స్వామిఅమ్మవార్లకు అశ్వవాహన సేవ, రాత్రి 8 గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు.


బ్రహ్మదేవుడే కర్త

బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలు కనుక వీటికి బ్రహ్మోత్సవా లంటారని ప్రతీతి. క్షేత్రపాలకుడైన వీర భద్రస్వామి పర్యవేక్షణలో, శివపరి వార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయ కత్వంలో జరుగుతాయని చెబుతారు. 


ఏటా రెండు సార్లు 

శ్రీశైలంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. మకరసం క్రమణ పుణ్యకాలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులు, మాఘ మాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలు 11 రోజులు జరుపుతారు. 


పాదయాత్రికులకు లోటు రానివ్వం

ఆత్మకూరు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే పాదయాత్రికులకు ఏలోటూ రానివ్వమని శ్రీశైల దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆత్మకూరు డీఎఫ్‌వో ఆశాకిరణ్‌తో కలిసి వెంకటాపురం నుంచి నాగలూటి వరకు అటవీమార్గంలో పాదయాత్రికులకు సదుపా యాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పాదయాత్రికులకు తాగునీరు, వైద్యశిబి రాలు, అన్నదానకేంద్రాలు, విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కైలాసద్వారం నుంచి భీమునికొల నుకు తాత్కాలి తాగునీటి పైపులైను వేస్తున్నట్లు తెలిపారు. ఈ మార్గమధ్యంలో 1000లీటర్ల ట్యాంకు, కైలాసద్వారం వద్ద 5వేల లీటర్ల సామర్థ్యం గల మరో ఆరు ట్యాంకులు, 20వేల లీటర్ల సామర్థ్యం ఉన్న మరో ట్యాంకును ఏర్పాటు చేసి నిరంతరం నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. వీరి వెంట నాగలూటి రేంజర్‌ చంద్రశేఖర్‌, డీఆర్‌వో రామచంద్రుడు ఉన్నారు. 




Updated Date - 2021-03-04T06:26:18+05:30 IST