శివశంకరయ్య ః 109

ABN , First Publish Date - 2022-08-14T06:30:38+05:30 IST

గాంధీ వెంట వెళ్లారు. కలకత్తా జైలులో చీకటి రోజులు గడిపారు. స్వాతంత్య్రం వచ్చాక.. సమరయోధుడిగా గుర్తింపును, ప్రభుత్వం ఇచ్చిన పింఛను, వ్యవసాయ భూమిని, ఆర్మీలో పనిచేసిన కాలానికి జీతాన్నీ దేశంకోసం వదులుకున్నారు.109 ఏళ్ల వయసులోనూ సేద్యం చేసుకుంటూ తన కాళ్లపై తాను బతుకుతున్నారు శివశంకరయ్య.

శివశంకరయ్య ః 109

పెద్దపంజాణి మండలం బనకందొడ్డికి చెందిన జంగం లింగయ్య కుమారుడు శివశంకరయ్య.1913 జూలై 7న జన్మించారు. పుంగనూరులో అమెరికన్‌ ఆర్కాట్‌ మిషన్‌ స్కూల్లో నాలుగు వరకూ, బసవరాజా హైస్కూల్లో ఎస్సెసెల్సీ దాకా చదువుకున్నారు. 1934లో చిత్తూరుకు వచ్చిన గాంధీని చూసేందుకు వెళ్లినప్పటికి ఆయన వయసు 21 ఏళ్లు.గాంధీ ఉపన్యాసానికి ఆకర్షితుడై, అక్కడే సోల్జర్‌ అసోసియేషన్‌లో పేరు నమోదు చేసుకుని 150 మంది యువకుల బృందంలో చేరారు. గాంధీ వెంట గుంటూరు, హైదరాబాదు, అహ్మదాబాద్‌ మీదుగా ఢిల్లీ దాకా రైల్లో వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చే దాకా దేశమంతా తిరిగి స్వాతంత్య్రపోరాటానికి ప్రజలను సమాయత్తం చేశారు.చాలాసార్లు అరెస్టయ్యారు. నేతాజీ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కూడా కొంతకాలం పనిచేశారు.1946లో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు బంగారుపాళ్యం, పుంగనూరు జమీందార్లు ఆయనతో సంభాషించేందుకు ఆంగ్లం రాకపోవడంతో శివశంకరయ్యే అనువాదకుడిగా వ్యవహరించారు. 

స్వాతంత్య్రం వచ్చాక.. 


మేల్‌ నర్సు కోర్సు చేసినందున దేశానికి సేవ కొనసాగించే ఉద్దేశంతో శివశంకరయ్య ఆర్మీలో చేరారు. సిపాయి హోదాలో ఆర్మీ మెడికల్‌ కార్ప్స్‌లో నర్సింగ్‌ అసిస్టెంట్‌గా చేరి.. 1961 వరకూ పనిచేశారు.రిటైరయ్యాక పింఛను తీసుకోలేదు. స్వాతంత్ర సమరయోధుడిగా పింఛనూ వద్దన్నారు. 1963లోనే తిరుపతి అవిలాల గ్రామంలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వం మంజూరు చేస్తే వద్దని రాసిచ్చేశారు. ముగ్గురు కొడుకులున్నా వారిపై ఆధారపడకుండా సేద్యం చేసుకుంటూ, పశువులు మేపుకుంటూ శివశంకరయ్య బతుకుతున్నారు.


Updated Date - 2022-08-14T06:30:38+05:30 IST