Islamabad: పాక్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురి దుర్మరణం, రెండు నెలల్లో ఇది రెండవది

ABN , First Publish Date - 2022-09-27T00:52:26+05:30 IST

నైరుతి పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఆర్మీ హెలికాప్టర్ (Army helicoptor) కుప్పకూలి అందులోని ఆరుగురు వ్యక్తులు ..

Islamabad: పాక్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలి ఆరుగురి దుర్మరణం, రెండు నెలల్లో ఇది రెండవది

ఇస్లామాబాద్: నైరుతి పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ (Balochistan) ప్రావిన్స్‌లో ఆర్మీ హెలికాప్టర్ (Army helicoptor) కుప్పకూలి (Crash) అందులోని ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. ఆదివారంనాడు ఓవర్‌నైట్ మిషన్‌లో ఉండగా బెలూచిస్థాన్ రాజధాని క్వెట్టాకు 121 కిలోమీటర్ల దూరంలోని ఖోస్ట్ టౌన్ సమీపంలో ఈ ఘటన జరిగిట్టు ఆర్మీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు ఆర్మీ మేజర్లు (పైలట్లు) ఉన్నారని తెలిపింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది వెల్లడించలేదు.


ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా, పాకిస్థాన్ ఆర్మీ హెలికాప్టర్ల భద్రతను విశ్లేషించాలని విపక్ష నేత, మాజీ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరి డిమాండ్ చేశారు. హెలికాప్టర్లలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, తరచు కుప్పకూలుతున్న ఘటనలపై ఇంజనీరింగ్ ఎవల్యుయేషన్ అనివార్యమని అన్నారు. కాగా, తాజా ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. గత రెండు నెలల్లో ఆర్మీ హెలికాప్టర్లు కుప్పకూలడం ఇది రెండోసారి.

Updated Date - 2022-09-27T00:52:26+05:30 IST