అనంతలో ఘోరం.. పాపం ఆ తల్లులు!.. పిల్లల ముఖాలైనా చూశారో లేదో!

ABN , First Publish Date - 2021-11-06T06:56:37+05:30 IST

జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు.

అనంతలో ఘోరం.. పాపం ఆ తల్లులు!.. పిల్లల ముఖాలైనా చూశారో లేదో!
నాగవేణి మృతదేహం వద్ద కూతురును ఎత్తుకొని విలపిస్తున్న సుధాకర్‌

పామిడి వద్ద ఆరుగురు కూలీలు.. మిడుతూరు వద్ద ఇద్దరు వృద్ధులు..

రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం

కూలీల ఆటోను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం

ఆరుగురు మహిళలు మృత్యువాత

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

కూలి పనులకు వెళ్తుండగా దుర్ఘటన

కొప్పలకొండ గ్రామంలో విషాదం



ఒక్క ప్రమాదం 

ఆ ఇళ్లలో దీపాలు ఆర్పేసింది.

ఒక్క దుర్ఘటన 

పిల్లలను అమ్మలేని అనాథలను చేసింది.

ఒక్క యాక్సిడెంట్‌

కొండంత దుఃఖాన్ని ఆ ఊరికి మిగిల్చింది.

కొన్ని గంటల ముందు వరకూ 

మతాబుల్లా ఆనందాలు విరజిమ్మిన ఆ ఇళ్లు 

తెల్లారేసరికి రోదనలతో పిక్కటిల్లాయి

పాపం ఆతల్లులు!

పడుకున్న పిల్లల మొహాలైనా చూశారో లేదో!

పొట్టకూటి కోసం కూలీ పనులకు

చద్దన్నం మూటగట్టుకుని బయల్దేరారు.

మార్గమధ్యలోనే మాటువేసిన 

మృత్యువు దెబ్బకు ఆరుగురు బలైపోయారు

నిర్జీవంగా పడి ఉన్న తల్లిని చూసి

పిల్లలు అమ్మా లే అంటూ...

నాన్నా అమ్మ లేవలేదు... 

నీవైనా చెప్పు లేవమని అంటుంటే

బిడ్డలను వదిలి వెళ్లలేని 

ఆ తల్లి ఆత్మ ఎంతగా తల్లడిల్లి ఉంటుందో !

తమ పెళ్లిళ్లు చూడకుండానే కన్నుమూసిన

తల్లులను చూసి ఎదిగిన బిడ్డలు

పేగు తెంచి ప్రాణం పోసిన అమ్మ

ప్రేమ బంధం తెంచుకుని కాటికిపోయిందని

గుండెలు బాదుకుని రోదించటం చూసి

కర్మభూమి సైతం కన్నీరు కార్చిందేమో! 

ఈ విషాద సంఘటన పామిడి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది.


గార్లదిన్నె/పామిడి, నవంబరు 5 : జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో  ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పామిడి సమీపంలో ఆరుగురు మహిళా కూలీలు, మిడుతూరు వద్ద ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన కూలీలు వ్యవసాయ పనులకు ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనటంతో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా... కొప్పలకొండ గ్రామానికి చెందిన 14 మంది కూలీలు శంకరమ్మ (44), చౌడమ్మ(33), బోయ నాగవేణి (45), సావిత్రి(36), సుబ్బమ్మ(47), బీ నాగవేణి(25) ఉప్పర సావిత్రి, బీ లక్ష్మిదేవి, వడ్డే రామలక్ష్మి, బోయ జయమ్మ, కురుబ రమాదేవి, బోయ లక్ష్మినారాయణ, వడ్డే సుబ్బరాయుడు, కురుబ రేవంతలు పామిడి మండలం నీలూరు గ్రామంలో పత్తి పంట కోసేందుకు ఆటోలో బయల్దేరారు. పామిడి పట్టణం దాటి మరికొద్ది సేపట్లో నీలూరుకు చేరుకునే సమయంలో ఖల్సా ఢాబా వద్ద 44వ జాతీయ రహదారిపై  గుత్తి వైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలందరూ ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ప్రమాదంలో శంకరమ, చౌడమ్మ, బోయ నాగవేణి, సావిత్రి, సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. బీ నాగవేణి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఎనిమిది మంది కాళ్లు, చేతులు విరిగి, తలకు తీవ్ర గాయాలై బాధతో ఆర్తనాదాలు చేశారు.  స్థానికులు క్షతగాత్రులను పీజేఆర్‌ అంబులెన్స, హైవే అంబులెన్సలలో పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య సేవల అనంతరం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ ఈరన్న, ఎస్‌ఐ చాంద్‌బాషా తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదస్థలానికి భారీగా జనం చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాడిపత్రి డీఎస్పీ వీఎనకే చైతన్య, జిల్లా డిప్యూటీ ట్రాన్సపోర్టు కమిషనర్‌ శివరాం ప్రసాద్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం ఆర్డీఓ మధుసూదన, గుంతకల్లు ఎంవీఐ శ్రీనివాసులు, పామిడి, గార్లదిన్నె తహసీల్దార్లు ఆర్‌వీ సునీతాబాయి, భరతకుమార్‌ పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. 


వాహనం కోసం ముమ్మర గాలింపు

 రోడ్డు ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పామిడి ప్రభుత్వాస్పత్రిలో పామిడి, గుత్తి, ఆత్మకూరు సీఐలు ఈరన్న, శ్యామరావు, శివశంకర్‌ నాయక్‌, పామిడి, గార్లదిన్నె ఎస్‌ఐలు చాంద్‌బాషా, కిరణ్‌కుమార్‌ రెడ్డిలతో తాడిపత్రి డీఎస్పీ వీఎనకే చైతన్య ప్రమాదానికి కారణమైన వాహనం గురించి చర్చించారు. 44వ జాతీయ రహదారిపై ఉన్న కాసేపల్లి, మరూ రు చెక్‌ పోస్టులలో ప్రమాద సమయాల్లో ఏయే వాహనాలు వెళ్లాయో ఆరా తీయాలన్నారు. అలాగే పామిడి, గార్లదిన్నె పట్టణాలలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. 



అందరూ రెక్కాడితేగాని డొక్కాడని కూలీలే

మృతులు, క్షతగాత్రులు అందరూ రెక్కాడితేగాని డొక్కాడని కూలీలు. వ్యవసాయ కూలి పనులకు వెళుతూ తమ భర్తలకు కుటుంబ పోషణలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. దీపావళి పండగ పూట ఇంటిల్లిపాది ఆనందంగా గడిపిన వారిని 24 గంటలైన గడవక ముందే ఘోర రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. మృతుల్లో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ.


నాన్నా! అమ్మను లేవమని చెప్పు

మృతులందరిలోకి తక్కువ వయసున్న బీ నాగవేణికి ఇద్దరు కుమార్తెలు. ఈమె భర్త సుధాకర్‌ విద్యుతశాఖలో ప్రైవేట్‌  హెల్పర్‌గా పని చేస్తున్నాడు. వీరికి బిందు, నీలూ  ఇద్దరు కుమార్తెలున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెంది నిర్జీవంగా పడి ఉన్న ఆమెను చూసి చిన్న కుమార్తె నీలూ అమ్మా! లే అంటూ తట్టిలేపటం...అమ్మ లేవ లేదంటూ తండ్రి సుధాకర్‌కు చెప్పడం చూసి బంధు, మిత్రులందరూ ఒక్కసారిగా బిగ్గరగా రోదించారు. తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారుల ఆలనా పాలనా ఎవరు చూస్తారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  ఇద్దరు కుమార్తెలను చెరోవైపు ఎత్తుకుని భార్య శవం ముందు నిలబడ్డ సుధాకర్‌ బాధ వర్ణణాతీతం. 

- బోయ నాగవేణికి భర్త కిష్టన్న, ఒక కుమార్తె, కుమారుడున్నారు. నెలలో కుమార్తె పెళ్లి జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లి చూడకుండానే కన్ను మూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 

- చౌడమ్మకు భర్త నాగేంద్రతో పాటు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో ఒకరు పదవ తరగతి, మరొకరు ఆరవ తరగతి చదువుతున్నారు. 

- సావిత్రమ్మకు భర్త సత్యన్న గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులకు వివాహం చేశారు. 

- సుబ్బమ్మకు భర్త చితంబరయ్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమారునికి వివాహం చేయాల్సి ఉంది. 

- శంకరమ్మకు భర్త ఆంజనేయులుతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

మృతుల అంత్యక్రియలను ఒకే రోజు నిర్వహించడంతో  కుటుంబ సభ్యులు, బంధువుల, స్థానికుల రోదనలతో కొప్పలకొండ గ్రామం కన్నీటి సంద్రమైంది. 



 కుటుంబాలను పరామర్శించిన ప్రముఖులు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, శింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి బొల్లు శ్రీనివాసరెడ్డి, గార్లదిన్నె ఎంపీపీ వెంకట నారాయణ, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, అనంతపురం, గుత్తి మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు ఆదినారాయణ, ప్రభాకర్‌చౌదరి, మున్సిపల్‌ మాజీ చైర్మన గౌస్‌పీర, టీడీపీ అనంతపురం పార్లమెంట్‌ కార్యనిర్వహక కార్యదర్శి ఇల్లూరు రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు జింకల సంజీవకుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జింకల రామకృష్ణ, వడ్డే శివకుమార్‌, రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి  తదితరులు పరామర్శించారు. 




అంత్యక్రియలకు అత్యవసర సాయం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అనంతపురం ఆర్డీఓ మధుసూదన, గార్లదిన్నె తహసీల్దార్‌ భరతకుమార్‌ అంత్యక్రియలకు అత్యవసర సాయం అందజేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున  అందజేశారు. ప్రభుత్వం తరఫున వచ్చే ప్రమాద బీమా, ఆర్థికసాయంతో పాటు బాధిత కుటుంబాలకు వ్యవసాయ భూమిని అందజేసేందుకు తగిన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.



మృతులకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

- కాలవ శ్రీనివాసులు, రాంభూపాల్‌ 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ప్రభుత్వాస్ప త్రిలో శుక్రవారం వారు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో రోడ్లు ప్రమాదకరంగా మారాయన్నారు. ప్రమాదకరంగా మారిన జాతీయ రహ దారుల వద్ద  స్పీడు బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ తాడిపత్రి డీఎస్పీ చైతన్యకు సూచించారు.  



కారు ఢీకొని ఇద్దరు మృతి

పెద్దవడుగూరు, నవంబరు5: మండలంలోని మిడుతూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కారు ఢీకొన్న ప్రమాదంలో సుంకన్న(65), నారాయణ (60) మృతి చెందారని ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పామిడి మండలం వెదురూరు గ్రామానికి చెందిన సుంకన్న మిడుతూరు వద్ద గల వైనషాపులో నైట్‌వాచమనగా పనిచేస్తున్నాడు. రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో సుంకన్న అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్‌ బెలూన్లు తెరచుకోవడంతో డ్రైవింగ్‌ చేస్తున్న సురే్‌షకు రోడ్డు కనిపించక, కారును అదుపు చేయలేక రోడ్డు దాటుతున్న నారాయణ (60)ను ఢీకొట్టాడు. మృతిచెందిన నారాయణ శింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామంలో నివాసం ఉంటూ మిడుతూరులో ఉన్న ఆరు ఎకరాల పొలాన్ని గుత్తకు ఇచ్చాడు.  నారాయణకు గతంలో భార్య మృతిచెందగా ఇరువురు కుమారులు ఉన్నారు. సుంకన్నకు భార్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. డ్రైవర్‌ సురే్‌షపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-11-06T06:56:37+05:30 IST