విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌

Jun 17 2021 @ 02:33AM

ఆరుగురు నక్సల్స్‌ మృతి

మృతుల్లో సీనియర్‌ డీసీఎం సందె గంగన్న

డివిజన్‌ కార్యదర్శి బాడీగార్డు కూడా మృతి

అగ్ర నేతలు అరుణ, జగన్‌కు గాయాలు!

వారికోసం కొయ్యూరు అడవులు జల్లెడ


చింతపల్లి/కొయ్యూరు, సాలూరురూరల్‌, పెద్దపల్లి/ఓదెల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): భారీ తుపాకీ మోతలతో విశాఖ ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొయ్యూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు ఈస్టు డివిజన్‌కి(విశాఖ) చెందిన ఇద్దరు డీసీఎంలు, ఒక ఏసీఎం, ముగ్గురు మహిళా దళ సభ్యులు ఉన్నారు. ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ వ్యక్తిగత అంగరక్షకురాలు కూడా ఈ కాల్పుల్లో చనిపోయింది. అరుణ గాయపడి, ఘటనాస్థలినుంచి తప్పించుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఈస్ట్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ సుమారు 20 రోజుల క్రితం కొయ్యూరు-జీకే వీధి మండలాల సరిహద్దుల పరిధిలోని గాలికొండ ఏరియాకు వచ్చినట్టు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. ఈ ఏరియాలో అప్పటినుంచి గ్రేహౌండ్స్‌, ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు ప్రారంభించారు. ఐదురోజుల క్రితం జీకే వీధి మండలం పెదపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపించి గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 5:30 గంటల ప్రాంతంలో కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారి మధ్య కాల్పులు, ఎదురుకాల్పులతో అడవంతా హోరెత్తిపోయింది. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిన తర్వాత సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. అక్కడ ఆరు మావోయి స్టు మృతదేహాలను గుర్తించారు.  


మృతుల వివరాలు..

తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా గుంపుల గ్రామానికి చెందిన సందె గంగన్న అలియాస్‌ అశోక్‌ (39) ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. అశోక్‌ ఈస్టు డివిజన్‌ డీసీఎంగా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అగ్ర మావోయిస్టు నేత సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌కు గంగన్న సమీప బంధువు. 7వ తరగతి వరకు చదివిన గంగన్న గ్రామంలో వెల్డర్‌గా పనిచేసేశాడు. సోదరుడు రాజన్నతో కలిసి 1999లో నక్సల్‌ ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాజన్న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. వెల్డర్‌గా గంగన్నకు మంచి అనుభవం ఉండడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తమ వెంట దండకారణ్యం తీసుకెళ్లారు. అక్కడి అబూజ్‌మడ్‌లో ఏర్పాటు చేసిన ఆయుధాల తయారీ కేంద్రంలో సుదీర్ఘకాలం గంగన్న పనిచేశాడు. సల్వాజుడుం వ్యవస్థాపన నేత మహేంద్ర కర్మ హత్యకేసులో గంగన్న నిందితుడు. ఇప్పటివరకు 19 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని.. చివరకు విశాఖ ఏజెన్సీలో పోలీసుల చేతుల్లో చనిపోయాడు. 


ఇక.. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్‌ టేక్‌గుడ గ్రామానికి చెందిన ఈస్టు డివిజన్‌ డీసీఎం రణదేవ్‌ అలియాస్‌ అర్జున్‌ (31), కొరాపుట్‌ జిల్లా భాలైపుట్టు గ్రామానికి చెందిన ఏసీఎం సంతు నాచిక (28), ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన దళ సభ్యురాలు పైకే (25), గూడెంకొత్తవీధి మండలం పేములగొంది గ్రామానికి చెందిన దళ సభ్యురాలు, ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ వ్యక్తిగత గార్డు లలిత (28) ఉన్నారు. మృతిచెందిన మరో మహిళా సభ్యురాలిని గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో ఒక ఏకే 47, మరో ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక కార్బన్‌ రైఫిల్‌, మూడు 303 తుపాకులు, ఒక తపంచాతోపాటు వంట సామగ్రి, మందులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఎదురుకాల్పుల్లో గాయపడి కొంతమంది మావోయిస్టు నేతలు తప్పించుకున్నారన్న సమాచారంతో కొయ్యూరు-జీకే వీధి సరిహద్దు అడవులను పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈస్టు డివిజన్‌ కార్యదర్శి అరుణ, గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న కూ డా గాయపడినవారిలో ఉన్నారని తెలుస్తోంది.  


ఒడిశాలో ఎదురుకాల్పులు

ఒడిసాలోని కొరాపుట్‌, మల్కన్‌గిరి సరిహద్దు అడవుల్లో మంగళవారం ఎదురుకాల్పులు జరిగినట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ హృషికేశ్‌ కిలారి ప్రకటించారు. కులబేడ అటవీప్రాంతంలో కూం బింగ్‌ నిర్వహిస్తున్న ఎస్‌వోజీ, డీవీఎఫ్‌ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారని, ఆ సమయంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయన్నా రు. మావోయిస్టులు తప్పించుకుపోగా, తుపాకీ, మందుగుళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.