ఆరేళ్లయినా.. అర ఎకరం తడపలే!

ABN , First Publish Date - 2022-04-28T04:48:44+05:30 IST

లోయర్‌ పెన్‌ గంగా ప్రాజెక్టులో భాగంగా కోర్టా - చనకా బ్యారేజీ నిర్మాణం పనులు చేపట్టి ఆరేళ్లయినా అరకం భూమి కూడా తడవలేదు.

ఆరేళ్లయినా.. అర ఎకరం తడపలే!
కోర్టా - చనకా బ్యారేజీ

ఐదుసార్లు గడువు పెంచినా ముందుకు సాగని పనులు

పెండింగ్‌లో సుమారుగా రూ.170కోట్ల నిధులు

పనులు చేపట్టేందుకు ఇదే అనువైన సమయం 

కోర్టా - చనకా ఆయకట్టు రైతులకు తప్పని ఎదురు చూపులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌27 (ఆంధ్రజ్యోతి) : లోయర్‌ పెన్‌ గంగా ప్రాజెక్టులో భాగంగా కోర్టా - చనకా బ్యారేజీ నిర్మాణం పనులు చేపట్టి ఆరేళ్లయినా అరకం భూమి కూడా తడవలేదు. మహారాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న కోర్టా - చనకా బ్యారేజీ పనులకు నిధుల కొరత ఆటంకంగా మారుతోంది. ఆరేళ్ల్ల క్రితం రూ.386కోట్ల అంచనా వ్యయంతో లోయర్‌ పెన్‌గంగా ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఐదు సార్లు పనుల గడువు సమయాన్ని పొడగించారు. ప్రతి యేటా పెన్‌గం గా నదికి భారీ వరదలు రావడంతో పనులను అర్ధాంతరం గానే నిలిచి పోతున్నాయి. బ్యారేజీ నిర్మాణం, హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ పనులు దాదాపుగా పూర్తి దశకు చేరుకున్న కాలువల నిర్మాణం పనుల్లో జాప్యం జరుగుతోంది. మే చివరి నాటికి పంప్‌హౌస్‌ డ్రై రన్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆయకట్టుకు సాగునీరు అందడం అనుమానంగానే కనిపిస్తోంది. ఇటీవల సీఎంవో స్మితా సబర్వాల్‌ పర్యటించి పనుల్లో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన భూసేకరణ తీవ్ర సమస్యగా మారుతోంది. ప్రధానంగా నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. సీఎం కేసీఆర్‌ మూడేళ్ల క్రితం కో ర్టా-చనకా బ్యారేజీని సందర్శించి పనులను మరింత వేగ వంతం పెంచాలని సంబంధిత అధికారులతో పాటు కాం ట్రాక్ట్‌ కంపెనీలను హెచ్చరించారు. అయినా పనులు ఊపందుకోవడమే లేదు. దీంతో ఈ యేడు కూడా ఆయకట్టుకు సాగునీరు అందించడం అనుమానంగానే కనిపిస్తోంది. 

నిలిచి పోయిన కాలువల నిర్మాణం

ప్రధానంగా కాలువల నిర్మాణం పనులు పూర్తయితేనే ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. కానీ భూసేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పటికే సర్వే పనులను చేపట్టిన ప్రభుత్వం నిధులను మంజూరు చేయక పోవడంతో అర్ధాంతరంగానే నిలిచి పోయింది. మరో రెండు మాసాల్లో వర్షాకాలం ముంచుకొస్తుండడంతో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో కాలువల నిర్మాణం పనులు ముందుకు సాగడం కష్టంగానే కనిపిస్తోంది. అసలే నల్ల రేగడి నేలలు కావడంతో చిన్న పాటి వర్షాలకే బురదమయమై పనులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రధాన, ఉపకాల్వల పనులు పూర్తిగా నిలిచి పోయే ప్రమాదం ఉంది. ఒక వేళ బ్యారేజీ, హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ పనులు పూర్తయిన కాల్వల పనులు పూర్తికాక పోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఇప్పటికే పంపుమోటార్లను బిగించిన చిన్న పాటి మరమ్మతులు కొనసాగుతున్నాయి. మేలో పంపులను డ్రై రన్‌ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ కాల్వల నిర్మాణం పూర్తికాక పోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం కష్టంగానే కనిపిస్తుంది. ఒక వేళ మోటార్‌ పంపుసెట్లు డ్రైరన్‌ పూర్తయిన కాల్వల నిర్మాణం పనులు పూర్తికాకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు.

అంచనా వ్యయం పెంచినా.. అంతే సంగతి

కోర్టా - చనకా బ్యారేజీ నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచిన పనుల్లో పురోగతి కనిపించడం లేదు. మొదట రూ.386కోట్ల అంచనా వ్యయంతో బ్యారేజీ నిర్మాణం పనులను చేపట్టింది. ఇటీవల రూ.765కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఇందులో దుమ్ముగూడెం నుంచి తరలించిన మోటార్‌ పంపుల విలువ రూ.110 కోట్లు, సబ్‌స్టేషన్‌, విద్యుత్‌ టవర్‌ లైన్‌ల పనుల కోసం రూ.60కోట్లు, 12శాతం జీఎస్టీ, పెరిగిన ధరల విలువ, మహారాష్ట్ర వైపు నిర్మించాల్సిన పనులకు నిధుల కేటాయింపు, ప్రభుత్వ డిపాజిట్లు, పంపుమోటార్‌ల డిజైన్‌ మార్పు, గేట్ల సామర్థ్యం పెంపు లాంటి పనులకు అంచనా వ్యయాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారుగా రూ.170కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు గాను రూ.50కోట్లు, విద్యుత్‌ టవర్‌ పనులకు రూ.20కోట్లు, మరో రూ.100 కోట్లు భూసేకరణకు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇన్నాళ్లు బిల్లుల కోసం ఎదురు చూడకండానే ఎలాగో పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ కంపెనీలు బిల్లులకు సంబంధించిన నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యంచేయడంతో ఇక చేసేది లేక చేతులెత్తేస్తున్నారు. పెండింగ్‌  బిల్లుల కోసం నెలల తరబడి హైదరాబాద్‌లోనే మకాం వేసి ప్రయత్నాలు చేసినా నయా పైసా కూడా విడుదల కావడం లేదంటున్నారు. 

మేలో డ్రైరన్‌ నిర్వహిస్తాం..

- శ్రీనివాస్‌రెడ్డి  లోయర్‌ పెన్‌గంగా చీఫ్‌ ఇంజనీర్‌

ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తియినట్లే. చిన్నపాటి మరమ్మత్తులు చేపట్టి నీటిని నిల్వ చేసేందుకు సిద్ధం చేస్తాం. ప్రధానంగా భూసేకరణ పనులు చేపట్టాల్సి ఉంది. దీంతో కాలువల పనులు ముందుకు సాగడం లేదు. కొనసాగుతున్న పనులకు కొంత వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచడంతో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. మే చివరి నాటికి పంపుహౌస్‌ పనులను పూర్తి చేసి డ్రైరన్‌ నిర్వహిస్తాం. వచ్చే జూన్‌, జూలైలో పంపుల ద్వారా నీటిని ఎత్తి పోసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 


Updated Date - 2022-04-28T04:48:44+05:30 IST