Advertisement

గబ్బర్‌ గర్జన

Oct 18 2020 @ 03:54AM

శతక్కొట్టిన ధవన్‌

ఢిల్లీ గెలుపు 

చెన్నైకి ఆరో ఓటమి


శిఖర్‌ ధవన్‌ నుంచి మరో అద్భుత ప్రదర్శన. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో చూపించాడు. పరుగులకు 

కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై బౌండరీలతో హోరెత్తిస్తూ ఏకంగా శతకమే బాదేశాడు.. అయితే ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మూడు సిక్సర్లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 14 పాయింట్లతో మరోసారి అగ్రస్థానానికి చేరింది. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకుంది.
షార్జా: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆరు ఓటములతో చెన్నై తమ ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసి (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అంబటి రాయుడు (25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌), వాట్సన్‌ (28 బంతుల్లో 6 ఫోర్లతో 36) ఆదుకోగా చివర్లో జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. నోకియాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. అక్షర్‌ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 21 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. దీపక్‌ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధవన్‌ నిలిచాడు.

ధవన్‌ అంతా తానై..

 ఈ పిచ్‌పై కష్టసాధ్యమైన లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీకి ఆద్యంతం ఓపెనర్‌ ధవన్‌ అండగా నిలిచాడు. అయితే ఆరంభం మాత్రం అంత సాఫీగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే మేడిన్‌ వికెట్‌గా పృథ్వీ షా అవుటయ్యాడు. అటు అజింక్యా రహానె (8) కూడా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ రెండు వికెట్లను దీపక్‌ చాహర్‌ తీశాడు. ఈ దశలో చెన్నై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ధవన్‌ కళ్లు చెదిరే షాట్లతో ఢిల్లీని మ్యాచ్‌లో నిలబెట్టాడు. అతడికి కాసేపు శ్రేయాస్‌ (23) అండగా నిలిచాడు. వీలు చిక్కినప్పుడల్లా ధవన్‌ వరుస ఫోర్లతో చెన్నైపై ఒత్తిడి పెంచసాగాడు. అటు 12వ ఓవర్‌లో అయ్యర్‌ వికెట్‌ను బ్రావో తీయడంతో మూడో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. స్టొయినిస్‌ రాగానే సిక్స్‌, ఫోర్‌తో 13వ ఓవర్‌లో 13 పరుగులు రాబట్టాడు. 16వ ఓవర్‌లోనూ ఓ సిక్సర్‌ బాదిన అనంతరం పేసర్‌ శార్దూల్‌కు దొరికిపోయాడు. అయితే చివరి 26 బంతుల్లో 43 పరుగులు కావాల్సి ఉండగా మ్యాచ్‌ ఇరు పక్షాల వైపు ఉందనిపించింది. ఈ దశలో గబ్బర్‌ 17వ ఓవర్‌లో వరుసగా 4,6తో తన ఉద్దేశాన్ని చాటాడు. 19వ ఓవర్‌లో క్యారీ (4) వికెట్‌ తీసిన కర్రాన్‌ 4 పరుగులే ఇవ్వడంతో చివరి 6 బంతుల్లో ఢిల్లీకి 17 రన్స్‌ అవసరమవగా ఉత్కంఠ ఏర్పడింది. అయితే బ్రావో అందుబాటులో లేకపోవడంతో జడేజా బంతి తీసుకోగా.. అక్షర్‌ మూడు సిక్సర్లతో పండగ చేసుకుని ఏకంగా 21 పరుగులు అందించాడు.

ఆదుకున్న త్రయం: తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ సామ్‌ కర్రాన్‌ డకౌట్‌.. రెండో ఓవర్‌లో రబాడ ఒక్క పరుగూ ఇవ్వలేదు.. ఇదీ టాస్‌ గెలిచాక బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు పరిస్థితి. కానీ వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ వాట్సన్‌, డుప్లెసి తమ అపార అనుభవంతో ఇన్నింగ్స్‌ను పట్టాలెక్కించి రెండో వికెట్‌కు 87 పరుగులు జత చేశారు. ఆ తర్వాత రాయుడు అండగా నిలవగా చివర్లో జడేజా చెలరేగాడు. మూడో ఓవర్‌లో వాట్సన్‌ రెండు ఫోర్లతో, ఐదో ఓవర్‌లో డుప్లెసి 6,4,4 బాదగా పవర్‌ ప్లేలో చెన్నై 39 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా పదో ఓవర్‌లో వాట్సన్‌ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. అటు డుప్లెసి ఓ సిక్స్‌, ఫోర్‌తో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ 12వ ఓవర్‌లో వాట్సన్‌ను బౌల్డ్‌ చేసిన నోకియా ఈ ప్రమాదకర జోడీని విడదీశాడు. అయితే మరుసటి ఓవర్‌లోనే డుప్లెసి క్యాచ్‌ను వదిలేసిన ధవన్‌.. 15వ ఓవర్‌లో తన పొరపాటును సరిదిద్దుకున్నాడు. దీంతో చెన్నై కీలక సమయంలో డుప్లెసి వికెట్‌ను కోల్పోయింది. రబాడకిది ఐపీఎల్‌లో 50వ వికెట్‌. 

జడ్డూ బాదుడు: 17వ ఓవర్‌లో ధోనీ (3) అవుటైన సమయానికి స్కోరు 129/4. కానీ రాయుడు ఆ ఓవర్‌లో 6,4తో 12 రన్స్‌ సాధించాడు. ఆ తర్వాత జడేజా జత కలవడంతో సీఎస్‌కే చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు చేసింది. రాయుడు ఓవర్‌కో సిక్స్‌ బాదగా.. ఆఖరి ఓవర్‌లో జడ్డూ రెండు సిక్సర్లతో 21 పరుగులు అందించాడు. దీంతో వీరి మధ్య 21 బంతుల్లోనే అజేయంగా 50 పరుగులు వచ్చాయి.


1 ఐపీఎల్‌లో అతి తక్కువ మ్యాచ్‌ (27)ల్లోనే 50 వికెట్లు తీసిన బౌలర్‌ రబాడ. 


స్కోరు బోర్డు

చెన్నై: సామ్‌ కర్రాన్‌ (సి) నోకియా (బి) తుషార్‌ దేశ్‌పాండే 0; డుప్లెసి (సి) ధవన్‌ (బి) రబాడ 58; వాట్సన్‌ (బి) నోకియా 36; రాయుడు (నాటౌట్‌) 45; ధోనీ (సి) క్యారీ (బి) నోకియా 3; జడేజా (నాటౌట్‌) 33; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 179/4; వికెట్ల పతనం: 1-0, 2-87, 3-109, 4-129; బౌలింగ్‌: తుషార్‌ దేశ్‌పాండే 4-0-39-1; రబాడ 4-1-33-1; అక్షర్‌ 4-0-23-0; నోకియా 4-0-44-2; అశ్విన్‌ 3-0-30-0; స్టొయినిస్‌ 1-0-10-0.

ఢిల్లీ: పృథ్వీషా (సి అండ్‌ బి) చాహర్‌ 0; ధవన్‌ (నాటౌట్‌) 101; రహానె (సి) కర్రాన్‌ (బి) చాహర్‌ 8; శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) డుప్లెసి (బి) బ్రావో 23; స్టొయినిస్‌ (సి) రాయుడు (బి) ఠాకూర్‌ 24; క్యారీ (సి) డుప్లెసి (బి) కర్రాన్‌ 4; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.5 ఓవర్లలో 185/5; వికెట్ల పతనం: 1-0, 2-26, 3-94, 4-137, 5-159; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-18-2, సామ్‌ కర్రాన్‌ 4-0-35-1; శార్దూల్‌ 4-0-39-1; జడేజా 1.5-0-35-0; కర్ణ్‌ శర్మ 3-0-34-0; బ్రావో 3-0-23-1. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.