స్వియటెక్‌దే కిరీటం

ABN , First Publish Date - 2022-06-05T10:32:51+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ బ్యూటీ ఇగా స్వియటెక్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల స్వియటెక్‌ 6-1, 6-3 తేడాతో 18 ఏళ్ల కోకో గాఫ్‌ను సునాయాసంగా..

స్వియటెక్‌దే   కిరీటం

పోలెండ్‌ స్టార్‌ ఖాతాలో రెండో ఫ్రెంచ్‌ టైటిల్‌ 

ఫైనల్లో గాఫ్‌ చిత్తు


ప్రైజ్‌మనీ

స్వియటెక్‌కు రూ. 18.30 కోట్లు

కోకో గాఫ్‌కు రూ. 9.15 కోట్లు


వరల్డ్‌ నెంబర్‌వన్‌ ఇగా స్వియటెక్‌ అత్యద్భుత ఫామ్‌ కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఏ టోర్నీలో అడుగుపెట్టినా టైటిల్‌ దక్కించుకుంటున్న ఈ పోలెండ్‌ భామ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ అదే ఆనవాయితీ కొనసాగించింది. ఈ సీజన్‌లో వరుసగా 35వ మ్యాచ్‌ గెలుపుతో రోలాండ్‌ గారోస్‌ చాంపియన్‌గా నిలిచింది. దీంతో 21వ శతాబ్ధంలో అత్యధిక వరుస విజయాలు కలిగిన వీనస్‌ విలియమ్స్‌ రికార్డును కూడా సమం చేసింది. అటు తొలి గ్రాండ్‌స్లామ్‌పై గంపెడాశలు పెట్టుకున్న అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌ రన్నరప్‌తో సంతృప్తి పడింది.


పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ బ్యూటీ ఇగా స్వియటెక్‌ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల స్వియటెక్‌ 6-1, 6-3 తేడాతో 18 ఏళ్ల కోకో గాఫ్‌ను సునాయాసంగా ఓడించింది. ఇగా కెరీర్‌లో ఇది రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌. 2020లో తొలి టైటిల్‌ను గెలుచుకుంది.


 అలాగే ఇటీవలి కాలంలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా వరుసగా 35 విజయాలతో వీనస్‌ విలియమ్స్‌ రికార్డును కూడా సమం చేసింది. మరోవైపు ఈ ఏడాది తనకిది వరుసగా ఆరో టైటిల్‌. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ఖతార్‌ ఓపెన్‌, ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌, మయామి ఓపెన్‌, స్టట్‌గార్ట్‌ ఓపెన్‌, ఇటాలియన్‌ ఓపెన్‌లను సాధించింది. ఫైనల్లో గాఫ్‌ 23 అనవసర తప్పిదాలు, మూడు డబుల్‌ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకోగా.. అటు ఐదు బ్రేక్‌ పాయింట్లతో వరల్డ్‌ నెంబర్‌వన్‌ పూర్తి ఆధిపత్యం చూపింది. 


ఏకపక్షంగా..: కేవలం 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో స్వియటెక్‌ జోరు ముందు తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన గాఫ్‌ ఏమాత్రం నిలువలేకపోయింది.భీకర ఫామ్‌కు తోడు ప్రత్యర్థిపై ముఖాముఖి పోరులోనూ తనదే పైచేయి కావడంతో ఫైనల్లోనూ ఇగా చెలరేగింది. తాజా టోర్నీలో ఒక్క సెట్‌ కూడా కోల్పోని గాఫ్‌ను బిత్తరపోయేలా చేసింది. ఒత్తిడిలో కనిపించిన గాఫ్‌ అనవసర తప్పిదాలతో తన తొలి రెండు గేమ్‌ల్లోనూ సర్వీస్‌ కోల్పోయింది. అటు స్వియటెక్‌ శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో 4-0తో ఆధిక్యం సాధించింది. ఎట్టకేలకు ఐదో గేమ్‌లో గాఫ్‌ తన సర్వీ్‌సను కాపాడుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.


ఆ తర్వాత ఆరో గేమ్‌లో ఇగా గెలిచి ఏడో గేమ్‌లో గాఫ్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 6-1తో సెట్‌ను ముగించింది. రెండో సెట్‌లో మాత్రం తొలి గేమ్‌ను బ్రేక్‌ పాయింట్‌తో గెలుచుకుని, రెండో గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకోవడంతో గాఫ్‌ పోటీలోకి వచ్చినట్టనిపించింది. కానీ అక్కడి నుంచి గాఫ్‌ ఎప్పటిలాగే తడబడడంతో స్వియటెక్‌ వరుసగా ఐదు గేమ్‌లను గెలుచుకుని 5-2తో మ్యాచ్‌ ఫలితం ఏమిటో చాటింది. ఆ తర్వాత గాఫ్‌ ఎనిమిదో గేమ్‌ను గెలిచినా చేసేదేమీ లేకపోయింది. ఓటమి భారంతో గాఫ్‌ కన్నీటిపర్యంతం కాగా.. స్వియటెక్‌ స్టాండ్స్‌లోకి వెళ్లి తన కోచ్‌, కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకుంది.

Updated Date - 2022-06-05T10:32:51+05:30 IST