స్కంద ఏరోస్పేస్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2022-05-13T06:48:09+05:30 IST

హెలికాప్టర్‌ గేర్లు, గేర్‌ బాక్సులను తయారు చేయడానికి స్కంద ఏరోస్పేస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఏటీపీఎల్‌)..

స్కంద ఏరోస్పేస్‌ యూనిట్‌

హెలికాప్టర్‌ గేర్ల తయారీకి

రూ.250 కోట్లతో ఆదిభట్లలో ఏర్పాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెలికాప్టర్‌ గేర్లు, గేర్‌ బాక్సులను తయారు చేయడానికి స్కంద ఏరోస్పేస్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఏటీపీఎల్‌).. హైదరాబాద్‌లోని ఆదిభట్లలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలో హెలికాప్టర్‌ గేర్లు, గేర్‌ బాక్సులను తయారు చేయనున్న ప్రైవేటు రంగంలోని మొదటి కంపెనీ ఇదే అవుతుంది. రూ.250 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ వచ్చే ఏడాది జనవరిలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఈ యూనిట్‌ వల్ల వచ్చే రెండు, మూడేళ్లలో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని స్కంద ఏరోస్పేస్‌ వెల్లడించింది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన రేవ్‌ గేర్స్‌, రఘు వంశీ మెషిన్‌ టూల్స్‌ (ఆర్‌ఎంవీటీ) సంయుక్తంగా ఎస్‌ఏటీపీఎల్‌ను ఏర్పాటు చేశాయి. సంయుక్త సంస్థలో రేవ్‌ గేర్స్‌కు 55 శాతం, రఘు వంశీ, ఇతర ఇన్వెస్టర్లకు 45 శాతం వాటా ఉంటుంది. సంయుక్త సంస్థ ఏర్పాటుపై ఇటీవల రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయు.

స్కంద ఏరోస్పేస్‌కు రేవ్‌ గేర్స్‌ ఏడాదికి 90 లక్షల డాలర్ల (దాదాపు రూ.70 కోట్లు) ఆర్డర్లను ఇస్తుంది. రేవ్‌ గేర్స్‌కు బోయింగ్‌, బెల్‌, కోలిన్స్‌, బీఏఈ సిస్టమ్స్‌, రోల్స్‌ రాయిస్‌ తదితర ఓఈఎం కంపెనీలు ఖాతాదారులుగా ఉన్నాయి. బోయింగ్‌, జీఈ ఏవియేషన్‌ వంటి కంపెనీలకు రఘు వంశీ మెషిన్‌ టూల్స్‌ హై ప్రెసిషన్‌ ఉత్పత్తులు, చిన్న, చిన్న విడి భాగాలను సరఫరా చేస్తోంది.

Read more