Advertisement

ప్రగతి‘మార్గం’ ఏదీ?

Sep 29 2020 @ 06:22AM

 జిల్లాలో అధ్వానంగా రహదారులు!

 ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం

 ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉన్నా ప్రజలకు తప్పని ఇబ్బందులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారులు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ కొరవడడంతో ఎక్కడికక్కడ గోతులమయమయ్యాయి. రాకపోకలు సాగించే ప్రజలకు నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉన్నా... రహదారులకు మోక్షం లభించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారుల మరమ్మతుల కోసం తరచూ ప్రతిపాదనలు పంపుతున్నా, నిధుల విడుదలలో జాప్యమవుతోంది.


దీంతో పరిష్కారం ‘మార్గం’ కరువవుతోందని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎక్కడ చూసినా గోతులమయం. కొద్దిపాటి వర్షం పడినా అంతా అస్తవ్యస్తం. ఇదీ జిల్లాలో రహదారుల దుస్థితి. ఏళ్ల తరబడి రహదారులు కనీస మరమ్మతులకు నోచుకోకపోవడంతో  దారుణంగా తయారయ్యాయి. అంతర్‌ రాష్ట్ర రహదారులు పూర్తిగా పాడయ్యాయి. అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నా వాటికి మోక్షం కలగకపోవడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


జిల్లాలో సుమారు రూ.860 కోట్ల విలువైన 73 రకాల పనులు చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు గతంలో ప్రతిపాదించారు. ఇందులో 32 రహదారి పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రూ.కోట్ల అంచనాలతో ప్రారంభించిన రహదారి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల నత్తనడకన సాగుతున్నాయి. 


- పాలకొండ నుంచి రాజాం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి పొడవునా గోతులు ఏర్పడ్డాయి. ఈ రహదారికి కొన్నేళ్లుగా మరమ్మతులు చేపట్టాలని  ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ.. నిధులు మంజూరు కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 


 బెండి గేటు నుంచి వయా వజ్రపు కొత్తూరు పూండి వెళ్లే సుమారు 7 కిలోమీటర్ల రహదారి అధ్వానంగా మారింది.


 బెండి నుంచి మెళియాపుట్టి వయా టెక్కలిపట్నంకు వెళ్లే 10 కిలోమీటర్ల పొడవు రహదారి ఛిద్రమైంది. 


పలాస నుంచి అక్కుపల్లి వరకు 10 కిలోమీటర్ల రహదారికి ఏళ్ల తరబడి మరమ్మతులు లేవు. దీనిపై స్థానికులు అధికారులు, పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే వారు లేరు.


 టెక్కలి నుంచి తెంబూరు వయా పాతపట్నం మీదుగా పోలవరం ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలను కలిపే రహదారి పనులు ముందుకు సాగడం లేదు.

 

 జాతీయ రహదారి నుంచి తామరాపల్లి, నౌగాం తూముకొండ వరకు 11 కిలోమీటర్ల రహదారి దుర్భరంగా దర్శనమిస్తోంది. 


 ఎల్‌.ఎన్‌.పేట మండలంలో కొమ్మువలస, బొత్తాడసింగి, అలికాం-బత్తిలి వెళ్లే రహదారులు గోతులమయమయ్యాయి. 


 ఇచ్ఛాపురంలో సిద్ధభైరవి ఆలయం నుంచి పురుషోత్తపురం వరకు ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితి దయనీయంగా మారింది. ఈ మార్గంలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం కురిసినా.. ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారుతోంది.


 ఇలా జిల్లాలో ఎక్కడచూసినా రహదారులు అధ్వానంగా ఉన్నాయి.  ఏళ్లతరబడి మరమ్మతులకు నోచుకోక ఛిద్రమయ్యాయి. మండల నాయకులు, అధికారులు తరచూ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపుతున్నా, నిధుల విడుదలలో జాప్యమవుతోంది. 

 

 వంతెన నిర్మాణాలు అంతే..

పొందూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జికి రూ.27.25 కోట్లు కేటాయించారు. గత ఏడాది డిసెంబరు నాటికే వంతెన పూర్తి కావాల్సి ఉంది. కానీ ఈ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. దీనిని ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. 

 

 వీరఘట్టం మండలం కిమ్మి నుంచి వంగర మండలం రుషింగి మధ్యలో నిర్మాణంలో ఉన్న వంతెన పనులు ఆగిపోయాయి. 2004 నుంచి ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు ఎప్పుడు పూర్తవుతాయో అధికారులకే స్పష్టత లేదు.


 మంత్రి హయాంలో శూన్యం...

 జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్‌.. మొన్నటివరకూ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆయన మంత్రిగా బాఽధ్యతలు చేపట్టిన వెంటనే అధ్వాన రహదారుల రూపురేఖలు మారిపోతాయని అంతా ఆశించారు.  సుమారు 15 నెలల పాటు ఆయన అర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా పనిచేసినా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిగా కొనసాగుతున్నారు.


అధ్వాన రహదారుల విషయంపై అనేకసార్లు స్థానికులు గతంలో ఆయనకు విన్నవించినా పైసా  విదల్చలేదు.  మరో ముఖ్య నేత తమ్మినేని సీతారాం.. శాసనసభ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కూడా ఇటీవల మంత్రి పదవి వరించింది. జిల్లాలో ముగ్గురు నేతలు కీలక పదవుల్లో ఉన్నా.. ఆర్‌అండ్‌బీ రహదారులకు మోక్షం లభించడం లేదని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇప్పటివరకూ ఆర్‌అండ్‌బీ శాఖతో సమీక్ష కూడా నిర్వహించలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి.. రహదారులు బాగుచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.