జలవనరుల శాఖతో అనుసంధానం చేయండి

ABN , First Publish Date - 2020-10-27T09:37:17+05:30 IST

ఉపాధి హామీ పథకాన్ని జల వనరుల శాఖకు అనుసంధానం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశించారు.

జలవనరుల శాఖతో అనుసంధానం చేయండి

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 26 : ఉపాధి హామీ పథకాన్ని జల వనరుల శాఖకు అనుసంధానం చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆదేశించారు. సోమవారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ప్రణాళిక రూపొందించడంపై జడ్పీ సమావేశ మందిరం లో అధికారులతో సమీక్షించారు. స్పీకర్‌తో పాటు మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. కొద్దిసేపటికే కృష్ణదాస్‌ వెళ్లిపోగా..


స్పీకర్‌ తమ్మినేని, మంత్రి అప్పలరాజు సమీక్ష కొనసాగించారు. ముందుగా స్పీకర్‌ మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమమైన పథకం ఉపాధి హామీ అన్నారు. లోపాలు సవరించుకొని ముందుకు సాగితే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ప్రజోపయోగ పనులకు పెద్దపీట వేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.  గ్రామాల్లో రోడ్లు, కాలువలు, తాగునీటి వసతులు, గిడ్డంగులు, వెల్‌నెస్‌ కేంద్రాలు తదితర సౌకర్యాలపై దృష్టిసారించాలని చెప్పారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలని..


అందుకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. సమావేశాలకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రాంతాల వారీగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య తదితర ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పూర్తిస్థాయిలో నిర్మించాలని చెప్పారు. దేవునల్తాడ చెత్త సంపద తయారీ కేంద్రాల వల్ల గ్రామంలో 70 శాతం వరకూ పారిశుధ్య ప్రక్రియ సక్రమంగా జరిగిందని గుర్తుచేశారు. 


జిల్లా కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ పనుల ప్రణాళికకు సంబంధించిన అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జలకళ కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీధర్‌, జేసీ శ్రీరాములనాయుడు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ జాయింట్‌ కమిషనర్‌ కల్యాణచక్రవర్తి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ కూర్మారావు, ఏపీడీ రోజారాణి, ఎంపీడీవోలు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. అంతకు ముందు ఇటీవల మృతిచెందిన జడ్పీ సీఈవో చక్రధరరావుకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 

Updated Date - 2020-10-27T09:37:17+05:30 IST