గందరగోళం

ABN , First Publish Date - 2021-12-05T05:23:44+05:30 IST

పీజీ పరీక్షల నిర్వహణలో ఎస్కేయూ వీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా పరీక్షలకు ఏర్పాట్లు, ఇతర అంశాలపై పలువురు పెదవి విరుస్తున్నారు.

గందరగోళం

వర్సిటీలోనే పెట్టాలని తొలుత ఆదేశం

ఆ మేరకు హాల్‌టికెట్లు జారీ

ఒత్తిడి పెరగటంతో ఆయా 

కళాశాలల్లోనే పరీక్షలంటూ తాజాగా ఉత్తర్వులు

రేపట్నుంచి పీజీ పరీక్షలు

అనంతపురం అర్బన, డిసెంబరు 4: పీజీ పరీక్షల నిర్వహణలో ఎస్కేయూ వీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా పరీక్షలకు ఏర్పాట్లు, ఇతర అంశాలపై పలువురు పెదవి విరుస్తున్నారు. మొదటి సంవత్సరం పీజీ విద్యా ర్థులకు సెకెండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలని వీసీ.. సంబంధిత అధికారులకు నవంబరులో ఆదేశించారు. పరీక్షలు మాత్రం వర్సిటీ క్యాంప్‌సలోనే నిర్వహించాలని పట్టుబట్టారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని అనుబంధ కళాశాలల విద్యార్థులకు వర్సిటీలో పరీక్షలు నిర్వహించడమేంటని పరీక్షల నిర్వహణ ప్రక్రియ అధికారులు, విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు గందరగోళానికి లోనయ్యారు. వీసీ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో పరీక్షలకు ముందురోజు ఆయా కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ మా భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు.


పరీక్ష కేంద్రంగా హాల్‌టికెట్లలో ఎస్కేయూ పేరు

ఎస్కేయూ అనుబంధంగా జిల్లాలో ప్రైవేట్‌ పీజీ కళాశాలలు 19 ఉన్నాయి. అనంతపురం నగరంతోపాటు హిందూపురం, మడకశిర, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు తదితరపట్టణాల్లో విద్యార్థులు పీజీ కోర్సులను అభ్యసిస్తున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు 6 నుంచి 11వ తేదీ వరకు సెకెండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించానికి షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ పరీక్షలు వర్సిటీ క్యాంప్‌సలోనే నిర్వహించాలని వీసీ రామకృష్ణారెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించారు. ఎస్కేయూలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు తీవ్రసమస్యలను ఎదుర్కోవాల్సివస్తుందని.. అందులోనూ వర్సిటీలో తగిన సిబ్బంది, వసతులు లేవని పరీక్షల నిర్వహణాధికారులు వీసీకి వివరించలేకపో యా రు. వర్సిటీలో పరీక్షలు నిర్వహిస్తే సుదూరప్రాంతాల నుం చి వ్యయప్రయాసాలకోర్చి రావాల్సి ఉంటుందని, పరీక్షలు రాయలేమని విద్యార్థులు వీసీకి నేరుగా లేఖలు పంపారు. అయినా పరీక్ష కేంద్రంగా ఎస్కేయూ పేరును ముద్రించిన హాల్‌టికెట్లను విద్యార్థులకు పంపిణీచేశారు. ఒత్తిడి పెరగడంతో ఆయా కళాశాలల్లోనే పరీక్షలు నిర్వహించాలని పరీక్షల ముందురోజు శనివారం సాయంత్రం ఆదేశించారు.


ఆయా కళాశాలల్లోనే పీజీ పరీక్షలు

ఎస్కేయూ ఆధ్వర్యంలో 1468 మంది పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 6 నుంచి సెకెండ్‌ సెమ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్కేయూ అనుబంధ కళాశాలలైన నగరంలోని వాణి డిగ్రీ కళాశాల, పీవీకేకే, కేఎ్‌సఎన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్యాంపస్‌ విద్యార్థులతో కలిపి వర్సిటీలోనే నిర్వహించనున్నారు. మిగిలిన అనుబంధ కళాళాలల విద్యార్థులకు అయా కళాశాలల్లోనే నిర్వహించనున్నారు. పరీక్షాకేంద్రాలకు ముందుగానే ఓఆర్‌ఎం, ఆన్సర్‌ షీట్లు తరలించాల్సి ఉన్నా.. ఒక్కరోజు ముందు వాటిని తరలించడానికి, ఇన్విజిలేటర్లు, సిబ్బందిని సమకూర్చడానికి అధికారులు, సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు. సోమవారం పరీక్షలు కావడంతో ఆదివారం విధులకు హాజరై, పనులు చేయాల్సి ఉందని వారు వాపోతున్నారు.


ఎక్కడ నిర్వహించాలో మాకు తెలుసు: రామకృష్ణారెడ్డి, వీసీ

ఏఏ పరీక్షలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలో మాకు తెలుసు. ఆ మేరకే అధికారులు, సిబ్బంది, విద్యార్థులు షెడ్యూల్‌ను ఫాలో కావాలి. అంతేకానీ వారికి నచ్చినట్లు పరీక్షలు నిర్వహించమంటే కుదరదు. కళాశాల అనుబంధం కొనసాగాలంటే మేము చెప్పినట్లు వినాల్సిందే.


Updated Date - 2021-12-05T05:23:44+05:30 IST