రైతులకు చల్లటి కబురు

ABN , First Publish Date - 2022-04-12T22:23:53+05:30 IST

న్యూఢిల్లీ : వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనాలు, వర్షాకాలంపై ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ శుభవార్త చెప్పింది.

రైతులకు చల్లటి కబురు

న్యూఢిల్లీ : వేసవి తాపంతో అల్లాడిపోతున్న జనాలు, వర్షాకాలంపై ఆశలు పెట్టుకున్న రైతులకు ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవన వర్షాలు 2022లో  సాధారణంగానే ఉంటాయని అంచనా వేసింది. జూన్ లోనే రుతుపవన సీజన్ ఆరంభమవుతుందని రైతులకు చల్లటి సందేశమిచ్చింది. వర్షాల దీర్ఘకాల సగటు(ఎల్ పీఏ)లో ఈ ఏడాది 98 శాతం మేర వర్షాలు పడే అవకాశముందని సంస్థ లెక్కగట్టింది. అయితే అంచనాలో ప్లస్ లేదా మైనస్ 5 శాతాన్ని దోషంగా పేర్కొంది.  రుతుపవన సీజన్ మలి విడతతో పోల్చితే తొలి అర్ధభాగంలో వర్షాలు సమృద్ధిగా ఉంటాయని పేర్కొంది. భౌగోళిక పరిస్థితుల కారణంగా రాజస్థాన్, గుజరాత్ తోపాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని విశ్లేషించింది.


జులై, ఆగస్టు నెలలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. అయితే ఉత్తర భారతదేశంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ అంచనా 65 శాతం నిజమయ్యేందుకు అవకాశాలు ఉండగా.. 25 శాతం లోటు వర్షపాతానికి, 10 శాతం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. కాగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో వర్షాల దీర్ఘకాల సగటు(ఎల్ పీఏ) 881 మిల్లిమీటర్లుగా ఉంది. ఇందులో 96-104 శాతం మేర కురిసినా సాధారణ వర్షపాతంగా లెక్కిస్తారు.

Updated Date - 2022-04-12T22:23:53+05:30 IST