శ్రీలంకతో పింక్‌బాల్ టెస్ట్.. 252 పరుగులకే కుప్పకూలిన భారత్

ABN , First Publish Date - 2022-03-13T00:15:13+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 252..

శ్రీలంకతో పింక్‌బాల్ టెస్ట్.. 252 పరుగులకే కుప్పకూలిన భారత్

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో (డే/నైట్) టెస్టులో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ దశలోనూ శ్రీలంక బౌలర్లను ఎదురొడ్డలేకపోయింది. వికెట్లను టపటపా రాల్చుకుంది. క్రీజులో కుదురుకోవడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.


ముఖ్యంగా లసిత్ ఎంబుల్‌దెనియా, ప్రవీణ్ జయవిక్రమ బౌలింగును ఎదుర్కోవడంలో తడబడి వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క శ్రేయాస్ అయ్యర్ మాత్రం బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా ఒంటరిగా పోరాడాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అతడి తర్వాత రిషభ్ పంత్ చేసిన 39 పరుగులే అత్యధికం.


హనుమ విహారి 31 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేదు. ఫలితంగా 59.1 ఓవర్లలోనే టీమిండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్‌దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, ధనంజయ డిసిల్వా రెండు వికెట్లు తీసుకోగా, సురంగ లక్మల్ ఒక వికెట్ పడగొట్టాడు.

Updated Date - 2022-03-13T00:15:13+05:30 IST