Shadab Khan: నా వల్లే జట్టు ఓడింది.. క్షమించండి: పాక్ క్రికెటర్

ABN , First Publish Date - 2022-09-12T18:51:36+05:30 IST

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్ (Pakistan) ఓటమి పాలై ఉత్త చేతులతో

Shadab Khan: నా వల్లే జట్టు ఓడింది.. క్షమించండి: పాక్ క్రికెటర్

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్ (Pakistan) ఓటమి పాలై ఉత్త చేతులతో స్వదేశానికి పయనమైంది. తొలుత శ్రీలంక (Sri Lanka) బ్యాటింగ్ చూసి మ్యాచ్ ఏకపక్షమని భావించిన వేళ.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన లంక బ్యాటర్లను చూసి క్రికెట్ ప్రేమికులు ఫిదా అయిపోయారు.


దీనికి తోడు పాక్ ఫీల్డింగ్ లోపాలు కూడా ఆ జట్టు కొంప ముంచాయి. శ్రీలంక విజయానికి ప్రధాన కారణమైన భానుక రాజపక్ష (Bhanuka Rajapaksa)కు రెండుసార్లు లైఫ్ ఇచ్చిన పాక్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్.. పాక్ పరాజయానికి పరోక్ష కారకుడయ్యాడు. మ్యాచ్ ముగిశాక.. ఆ బాధ్యతను తనపైనే వేసుకున్నాడు. ఓటమికి తనదే కారణమని అంగీకరించిన షాదాబ్ తనను క్షమించాలని వేడుకున్నాడు. 


ఈ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన  శ్రీలంకను ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయింది. 58 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో 100 పరుగులు చేయడం కూడా గగనమే అనిపించింది. అయితే భానుక రాజపక్స దూకుడుతో ఇన్నింగ్స్‌ ముగిసేసరికి భారీ స్కోరు సాధించింది.  డెత్‌ ఓవర్లలో రాజపక్స భారీ సిక్సర్లతో విరుచుకుపడి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతడిచ్చిన రెండు క్యాచ్‌లను పాక్‌ ఫీల్డర్లు వదిలేయడం కలిసివచ్చింది.  ముఖ్యంగా షాదాబ్ ఖాన్ రెండు ముఖ్యమైన క్యాచ్‌లను నేలపాలు చేశాడు. అందులో ఒకటి చివరి ఓవర్‌లో సిక్స్ పడడానికి కారణమైంది. 


మహ్మద్ హస్నైన్ వేసిన 19 ఓవర్ చివరి బంతికి భానుక రాజపక్స మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న అసిఫ్ అలీ బంతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అది గమనించని షాదాబ్ కూడా అదే బంతిని అందుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో ఇద్దరూ ఢీకొని కిందపడ్డారు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌కు ఇవతల పడాల్సిన బంతి అటువైపు పడడంతో సిక్సర్‌గా మారింది. ఆ తర్వాతి చివరి ఓవర్ చివరి బంతికి భానుక మరో సిక్సర్‌ కొట్టి జట్టు స్కోరును 170 పరుగులకు చేర్చాడు. అంతకుముందు కూడా షాదాబ్ ఓ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 


ఈ నేపథ్యంలో పాక్ ఓటమికి షాదాబ్ నైతిక బాధ్యత వహించాడు. ఓటమి బాధ్యత తనదేనని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ‘‘క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. క్షమించండి. జట్టు ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నాను. జట్టును నిరాశపరిచాను’’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మహమ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షాలతోపాటు ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్‌పై షాదాబ్ ప్రశంసలు కురిపించాడు. అలాగే, గెలిచిన శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.


ఆ తర్వాత 171 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి 93/3తో బలంగా కనిపించింది. ఈ దశలో శ్రీలంక గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, శ్రీలంక బౌలర్లు విజృంభించి వికెట్లు తీయడంతో పాక్ కోలుకోలేకపోయింది. చివరికి 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించి ఓటమి పాలైంది.



Updated Date - 2022-09-12T18:51:36+05:30 IST