
ఆంధ్రజ్యోతి(23-10-2020)
ప్రశ్న: నాకు నలభై ఏళ్లు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తా. టీ కాఫీలకు దూరంగా ఉంటాను. రోజుకు అరగంట వాకింగ్ కూడా చేస్తాను. అయినా నిద్రపట్టదు. ఆహారంలో తరుణోపాయం ఉందా?
- కవిత, వరంగల్
డాక్టర్ సమాధానం: పెరి మెనోపాజ్ అంటే మెనోపాజ్‌కు కొద్ద్ది సంవత్సరాల ముందే శరీరంలో హార్మోన్లలో తేడాలు రావడం వల్ల మధ్యవయసులో మహిళలకు నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ హార్మోను స్థాయి తగ్గడం వల్ల నిద్ర త్వరగా పట్టకపోవడం, రాత్రిళ్లు ఎక్కువసార్లు మెలకువ రావడం, ఓసారి మెలకువ వచ్చిన తరువాత తిరిగి నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. సరిగా నిద్ర పట్టడంలో ఆహారం పాత్ర కొంత ఉంది. మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తికి సహకరించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను కొంత తగ్గించుకోవచ్చు. పడుకునే అరగంట ముందు గోరువెచ్చని పాలు, మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావ, అరటి పండు, కివి, బాదం లేదా జీడిపప్పు మొదలైనవి తీసుకొంటే నిద్ర పడుతుంది. అలాగే, రాత్రి భోజనంలో రొట్టెలు బదులుగా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ అనే హార్మోను కూడా నిద్రలేమికి కారణమే. యోగ, ప్రాణాయామం ఉపయోగపడతాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
[email protected]కు పంపవచ్చు)