సాగునీటి విడుదల తర్వాత.. తీరిగ్గా కల్వర్టు నిర్మాణం

ABN , First Publish Date - 2021-06-23T07:01:52+05:30 IST

అమలాపురం-గూడాల వెళ్లే ప్రధాన పంటకాల్వపై తీరుబడిగా వంతెన నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చేపట్టారు.

సాగునీటి విడుదల తర్వాత.. తీరిగ్గా కల్వర్టు నిర్మాణం
దబ్బందుల కాల్వపై కల్వర్టు నిర్మాణంలో భాగంగా శ్లాబ్‌ వేస్తున్న దృశ్యం

సాగునీటి కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు
అమలాపురం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అమలాపురం-గూడాల వెళ్లే ప్రధాన పంటకాల్వపై తీరుబడిగా వంతెన నిర్మాణ పనులను పంచాయతీరాజ్‌శాఖ అధికారులు చేపట్టారు. కాల్వలకు నీరు వదిలిన తర్వాత తీరిక చేసుకుని రైతుల ఇబ్బందులతో సంబంధం లేకుండా వీఎస్‌ఆర్‌ కాలనీ సమీపంలో పంచాయతీరాజ్‌ శాఖ మూడు రోజుల కిందట కల్వర్టు నిర్మాణం చేపట్టింది. సుమారు రూ.10 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు తీరిగ్గా చేస్తున్నప్పటికీ బాధ్యత గల జలవనరులశాఖ అధికారులు ప్రేక్షకపాత్ర వహించాల్సి రావడానికి రాజకీయ పరమైన ఒత్తిళ్లే కారణంగా సమాచారం. అమలాపురం-గూడాల కెనాల్‌పై ఎనిమిది  గ్రామాలకు చెందిన 4 వేల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించడంతోపాటు ఆయా గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన పంటకాల్వ ఇది. నీరు అందకపోవడం వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం కాల్వపై కల్వర్టు నిర్మాణంలో భాగంగా ఫౌండేషన్‌ పనులు చేపట్టారు. ఇటు బుధవారం సాయంత్రంలోగా ఎట్టి పరిస్థితుల్లోను పనులు పూర్తి చేస్తామని పంచాయతీరాజ్‌ డీఈ పీఎస్‌ రాజ్‌కుమార్‌ వెల్లడించారు. వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఒత్తిడితో జరుగుతున్న ఈ నిర్మాణ పనుల వల్ల సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదని ఆయా గ్రామాల రైతులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


Updated Date - 2021-06-23T07:01:52+05:30 IST