ఆలస్యంగా కర పెండలం క్రషింగ్‌ సీజన్‌

ABN , First Publish Date - 2021-01-25T07:20:13+05:30 IST

జిల్లాలో సగ్గుబియ్యం మిల్లులో కరపెండలం దుంప క్రషింగ్‌ సీజన్‌ కాస్త ఆలస్యమవుతోంది.

ఆలస్యంగా కర పెండలం క్రషింగ్‌ సీజన్‌

సామర్లకోట, జనవరి 24: జిల్లాలో సగ్గుబియ్యం మిల్లులో కరపెండలం దుంప క్రషింగ్‌ సీజన్‌ కాస్త ఆలస్యమవుతోంది. ఈ నెలాఖరు నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించినట్టు సగ్గుబియ్యం మిల్లుల యాజమాన్యాల నుంచి తెలియవచ్చింది. ఆంధ్రాశాగో మాన్యుఫాక్చురర్స్‌ అసోసియేషన్‌ నిర్దేశించిన ప్రకారం ఈనెల 21 నుంచే దుంప క్రషింగ్‌ సీజన్‌ను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ మిల్లులో కొన్ని సాంకేతిక అవరోధాలను సరిదిద్దడంలో కొంతమేర జాప్యం జరిగినట్టు సమా చారం. ఈ కారణంగానే ఈ నెలాఖరు నుంచి సీజన్‌ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. కరపెండలం దుంప ఆధారంగా సగ్గుబియ్యం తయారుచేసే మిల్లులు రాష్ట్రంలో కేవలం తూర్పుగోదావరి జిల్లాలోనే అందునా సామర్లకోట, పెద్దాపురం మండలాలలోనే  కేందీకృతమై ఉన్నందున జిల్లాలో మెట్ట ప్రాంతాలలోనూ, ఏజెన్సీ మండలాలలోనూ సాగవుతున్న కరపెండలం దుంప మొత్తం సామర్లకోట, పెద్దాపురం మండలాలలోని సగ్గుబియ్యం మిల్లులకే సరఫరా అవుతుంటాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 28 సగ్గుబియ్యం మిల్లులు ఉన్నప్పటికీ ఈ ఏడాది సుమారు 15 సగ్గుబియ్యం మిల్లులలోనే దుంప క్రషింగ్‌ జరిపేందుకు మిల్లర్లు సన్నాహలు చేస్తున్నట్టు ఆంధ్రా శాగో మాన్యు ఫ్యాక్చురర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి నున్న రామకృష్ణ చెప్పారు. రైతుల నుంచి కొనుగోలు చేసే కరపెండలం దుంప పుట్టికి(225 కిలోలు) రూ.1100 ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధర కన్నా రూ.100 అదనం అవుతుందని చెప్పారు. సగ్గుబియ్యం తయారీకి ఉత్పాదకా వ్యయం పెరుగుతున్నప్పటికీ సేలం మార్కెట్‌లో సగ్గు బియ్యం బస్తాకు రూ.3300కు మించకపోవడం వల్ల దుంపకు అంతకుమించి ధర చెల్లించలేపోతున్నట్టు మిల్లర్‌ ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది కర పెండలం దుంప సాగుకు సకాలంలో వర్షాలు కురవడంతో సానుకూల వాతావ రణం ఏర్పడి భూమిలో దుంప ఉరిమేందుకు దోహద పడిందని, దిగుబడి ఎకరాకు 30 పుట్లు అందే అవకాశాలు ఉన్నాయని, కానీ ధర కూడా పెరిగితే బావుంటుందని దుంప రైతు బండే కొండలరావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-25T07:20:13+05:30 IST